మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌లో మలబార్ గోల్డ్ సంస్థ ఏర్పాటు చేయబోయే జువెలరీ ఫ్యాక్టరీ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్, జయేశ్ రంజన్ తదితరులు
గచ్చిబౌలి (హైదరాబాద్): పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రాంతం ఎంతో అనువైనదని, అందులో హైదరాబాద్ నగరం మరింత అనువైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో మలబార్ గ్రూపు ఆధ్వర్యంలో మహేశ్వరంలో ఏర్పాటు చేసే మలబార్ గోల్డ్, డైమండ్స్ ఆభరణాల ఉత్పత్తి సంస్థ ఫ్యాక్టరీకి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టెక్నాలజీ, బయాలజీ, ఏరోస్పేస్, లాజిస్టిక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. జువెలరీ సంస్థలు మరిన్ని తెలంగాణలో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే జువెలరీ హబ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2,750 మందికి ఉపాధి కల్పించేలా రూ.750 కోట్లతో మలబార్ గోల్డ్, జువెలరీ ఆభరణాల సంస్థ రాష్ట్రంలో అతిపెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకురావడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
మలబార్ గ్రూపు చైర్మన్ అహ్మద్ ఎంపీ, వైస్‌చైర్మన్ అబ్దుల్ సలామ్ మాట్లాడుతూ ..ప్రస్తుతం మలబార్ గోల్డ్, డైమండ్స్ రిటైల్ షోరూమ్స్ తెలంగాణలో 17 ఉన్నాయని వాటిద్వారా 1,000 మందికి ఉపాధి కలుగుతోందని చెప్పారు. కేరళ, కర్ణాటక తర్వాత హైదరాబాద్‌లో తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడంతో వినియోగదారుల మన్ననలు పొందుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణభాస్కర్, టీఎస్‌ఐఐసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, మలబార్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment