Malabar Gold
-
పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా తెలంగాణ
గచ్చిబౌలి (హైదరాబాద్): పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రాంతం ఎంతో అనువైనదని, అందులో హైదరాబాద్ నగరం మరింత అనువైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్లో మలబార్ గ్రూపు ఆధ్వర్యంలో మహేశ్వరంలో ఏర్పాటు చేసే మలబార్ గోల్డ్, డైమండ్స్ ఆభరణాల ఉత్పత్తి సంస్థ ఫ్యాక్టరీకి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టెక్నాలజీ, బయాలజీ, ఏరోస్పేస్, లాజిస్టిక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. జువెలరీ సంస్థలు మరిన్ని తెలంగాణలో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే జువెలరీ హబ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2,750 మందికి ఉపాధి కల్పించేలా రూ.750 కోట్లతో మలబార్ గోల్డ్, జువెలరీ ఆభరణాల సంస్థ రాష్ట్రంలో అతిపెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకురావడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మలబార్ గ్రూపు చైర్మన్ అహ్మద్ ఎంపీ, వైస్‌చైర్మన్ అబ్దుల్ సలామ్ మాట్లాడుతూ ..ప్రస్తుతం మలబార్ గోల్డ్, డైమండ్స్ రిటైల్ షోరూమ్స్ తెలంగాణలో 17 ఉన్నాయని వాటిద్వారా 1,000 మందికి ఉపాధి కలుగుతోందని చెప్పారు. కేరళ, కర్ణాటక తర్వాత హైదరాబాద్‌లో తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడంతో వినియోగదారుల మన్ననలు పొందుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, మలబార్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. డైమండ్ & జ్యూయలరీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు గల మలబార్ గ్రూప్ తెలంగాణలో ₹750 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో పాటు రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి వల్ల రాష్ట్రంలో సుమారు 2,500 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ పేర్కొంది. మలబార్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా డైమండ్ & జ్యూయలరీ స్టోర్స్ ఉన్నాయి. నేడు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్, ప్రతినిధుల బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని కలిసి కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ఆయన పంచుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో నాణ్యమైన మానవ వనరుల లభ్యతతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు మలబార్ గ్రూప్ ప్రతినిధులు పేర్కొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూపును మంత్రి కేటీఆర్ తెలంగాణాకు స్వాగతించారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల వివిధ జిల్లాల్లో నైపుణ్యం కలిగిన స్వర్ణకారులుకు ఉపాధి లభిస్తుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. Happy to share that 'Malabar Gold and Diamonds' will be establishing a gold and diamond jewellery manufacturing unit along with a refinery in Telangana with an estimated investment of ₹ 750 Crores This new investment will create employment to about 2500 people in the state pic.twitter.com/FQM8U8Kxof — KTR (@KTRTRS) September 15, 2021 -
ఆ ఒక్క కామెంట్ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!
21 ఏళ్ల ధన్య సోజన్ వధువుగా నటించిన యాడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలీవుడ్ పర్సనాలిటీలతో మొదలు అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఎందుకు? ధన్య చావుతో పోరాడుతోంది. చావును గెలవాలనుకుంటోంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి, వెంట్రుకలు పూర్తిగా కోల్పోయిన స్థితి నుంచి అందమైన పెళ్లికూతురిగా మారడం ఇటీవలి గొప్ప కుతూహలపు కథ. 28 ఆగస్టు 2019లో ధన్య సోజన్ టొరెంటో (కెనడా)లో దిగింది. అక్కడ రెండేళ్లు పోస్ట్ డిప్లమో కోర్సు ఆమె చదవాలి. కేరళ ఇడుక్కి జిల్లాలోని తోడపుజ అనే చిన్న టౌన్ ఆమెది. తండ్రి జోసఫ్ మిల్క్‌బూత్ నడుపుతాడు. తల్లి శాంతి గృహిణి. హైస్కూల్లో చదివే ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న ధన్య బాగా చదువుకుని కెనడాలో సీటు సంపాదించుకుంది. కొన్ని నెలలు బాగా జరిగాయి. సెమిస్టర్లు రాసింది. కాని 2020 ఆగస్టు నాటికి ఆమె వూరికూరికే స్పృహ తప్పి పడిపోవడం మొదలెట్టింది. అక్కడి డాక్టర్లు చూసి మొదట నిమోనియా అనుకున్నారు. కాని రిపోర్టులు చూసి ఆమెకు ‘కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ ఉందని తేల్చారు. ప్రమాదకరమైన గుండెజబ్బు. ఏ క్షణం ఏమైనా కావచ్చు. గుండె మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ధన్య. ఊరుగాని ఊరు. దేశం కాని దేశం. ఇప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్ రోజులు 20 ఏళ్ల హుషారైన అమ్మాయి ధన్య. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. ఆమెకు ఆక్సిజన్ సరిగా అందడం లేదు. జుట్టు కొన్నాళ్లు నిలవదని చెప్పారు. ఉన్న జుట్టును పూర్తిగా తొలగించారు. ఆమె స్టూడెంట్ వీసా మీద రావడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగించుకునే వీలు లేదు. అలాగని ఇంటినుంచి డబ్బు తెప్పించుకోలేదు. దారుణమైన పరిస్థితిలో పడింది ధన్య. అదృష్టం... ఆమె చేరిన హాస్పిటల్లో కేరళ నుంచి వచ్చిన నర్స్‌లు పని చేస్తున్నారు. వారు ధన్యను ఆదుకున్నారు. ధైర్యం చెప్పారు. ధన్య పరిస్థితిని టొరెంటోలో ఉన్న మలయాళీ సంఘం ‘హృదయపూర్వం’కు తెలియచేశారు. హృదయపూర్వం వెంటనే ధన్య కోసం ఫండ్ రైజింగ్ మొదలెట్టింది. దాదాపు లక్షన్నర డాలర్లు (కోటి రూపాయలు) కలెక్ట్ అయ్యాయి. హాస్పిటల్ బిల్ అందులో నుంచే కట్టారు. అయితే సమస్య అదుపులో ఉంది కాని ట్రీట్మెంట్ కొనసాగాల్సి ఉంది. ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పారు. ఈలోపు హాస్పిటల్, యూనివర్సిటీ వాళ్ల సహకారం వల్ల హాస్పిటల్ నుంచి ఎగ్జామ్స్ రాసి పాసయ్యింది ధన్య. మార్చి వరకూ ఉంటే వర్క్ వీసాకు అర్హత వస్తుందని అప్పటి వరకూ అక్కడే ఉండి కొచ్చి చేరుకుంది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు వెళ్లి అడ్మిట్ అయ్యింది ధన్య. మెరుపు కలలు ధన్య ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా మెరుపు కలలు కనడం మానలేదు. ఆమెకు మోడలింగ్ చేయాలని కోరిక. అలాగే పాటలకు డాన్స్ చేయడం కూడా సరదా. హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ బోర్ పోయేందుకు కొన్ని సినిమా పాటలకు చేతులు కదిలించి డాన్స్ చేసి ఆ వీడియోలు రిలీజ్ చేసింది. అవి ఇన్స్టాంట్ హిట్ అయ్యాయి. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి నటులు ఆమె స్థితిని తెలుసుకుని ఆ స్థితిలో కూడా అంత హుషారుగా ఉన్నందుకు మెచ్చుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మలుపుతిప్పిన ఘడియ కొచ్చి చేరుకుని వైద్యం తీసుకుంటున్న ధన్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మలబార్ గోల్డ్’ వారి ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ యాడ్ కాంపెయిన్ ప్రకటన కనిపించింది. ‘మీకు పెళ్లికూతురిలా కనిపించాలని ఉందా’ అనే ప్రశ్నకు 7000 మంది యువతులు ‘అవును’ అని ఉత్సాహపడి సమాధానం ఇచ్చారు. ధన్య కూడా ఇచ్చింది. ఆ సంగతి మర్చిపోయింది. కాని కొన్నాళ్లకు మలబార్ గోల్డ్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. తమ ప్రకటనల్లో కేరళ వధువుగా కనిపించమని వారు కోరారు. ధన్య సంతోషానికి అవధులు లేవు. కేరళ క్రిస్టియన్ వధువుగా తెల్లగౌన్లో కనిపించడానికి అందుకు తగ్గ షూట్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. మలబార్‌గోల్డ్ ఈ షూట్ కోసం అసలు సిసలు వజ్రాల నెక్లెస్‌ను వాడటానికి పంపింది. దానిని ధరించిన ధన్య ఎంతో ముచ్చటపడింది. ‘ఈరోజు నాకెంతో బాగుంది’ అని అద్దంలో చూసుకుని మురిసిపోయింది. ఆమె స్వచ్ఛమైన నవ్వు వధువు పాత్రకు అందం తెచ్చింది. ఇదంతా చూస్తున్న ఆమె తల్లిదండ్రులు ‘ఈరోజు మా అమ్మాయి పేషెంట్ అన్న సంగతే మర్చిపోయింది’ అని ఎంతో సంబరంగా ఆమెను చూశారు. నిరాశలో కూడా ఒక ఆశ చేతికి దొరుకుతుంది. అంతవరకూ ఓపిక పట్టమని ధన్య నవ్వు అందరికీ చెబుతోంది. విశేష స్పందన ‘స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా’గా మలబార్ గోల్డ్ వారు విడుదల చేసిన ధన్య యాడ్ విశేష స్పందన పొందింది. ఆ యాడ్‌లో ధన్య ఎంతో అందంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. ఆమె నవ్వుకు ఎందరో ఫాన్స్ అయ్యారు. ఇవాళ ధన్య సెలబ్రిటీ అయ్యింది. తన అనారోగ్యాన్ని గెలిచి తీరగలననే ఆత్మవిశ్వాసం పొందింది. -
మలబార్ గోల్డ్ : మహిళలకు గోల్డెన్ చాన్స్
సాక్షి,న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల రంగంలో ఉన్న కేరళ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారీ నియామకాలను చేపట్టనుంది. భారత్‌లో రిటైల్‌తోపాటు ఇతర విభాగాల కోసం 5,000 పైచిలుకు మందిని కొత్తగా చేర్చుకోనున్నట్టు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్ మంగళవారం ప్రకటించారు. వీరిలో సగం మంది మహిళలు ఉంటారు. అకౌంటింగ్, డిజైన్, డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఆభరణాల తయారీ, సరఫరా నిర్వహణ, ఫైనాన్స్, ఐటీ వంటి విభాగాల్లో కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది. అలాగే జువెల్లరీ విక్రయాలు, కార్యకలాపాల కోసం బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన ఫ్రెషర్లకు ఇంటర్న్షిప్స్, ట్రెయినీషిప్స్ సైతం ఆఫర్ చేయనుంది. కొత్తగా చేరినవారు సంస్థ కేంద్ర కార్యాలయం ఉన్న కేరళలోని కోజికోడ్తోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కత ఆఫీస్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. ఔత్సాహికులు కంపెనీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 10 దేశాల్లో 260 ఔట్లెట్లను సంస్థ నిర్వహిస్తోంది. వార్షిక టర్నోవర్ సుమారు రూ.33,640 కోట్లు. -
ఆడపిల్లలు గల తల్లిదండ్రులు అదృష్టవంతులు
-
మలబార్ గోల్డ్ ‘బ్రైడ్ ఆఫ్ ఇండియా’
బెంగళూరు: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. ‘బ్రైడ్ ఆఫ్ ఇండియా’ పేరుతో తన నూతన కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది. పెళ్లిళ్ల సీజన్లో విభిన్న వివాహ ఆభరణాలను పరిచయం చేసే ఈ ప్రచార కార్యక్రమ 7వ ఎడిషన్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ.. ‘నూతన వధూవరులకు నచ్చే విధంగా కొత్త హంగులతో కూడిన ప్రత్యేక ఆభరణాలను ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉంచాం. భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతుల వివాహ ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి’ అని తెలిపారు. -
కేరళకు ‘మలబార్ గోల్డ్’ 7 కోట్లు విరాళం
తిరుపతి కల్చరల్: కేరళ వరద బాధితుల సహాయార్థం మలబార్ గోల్డ్ గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో రూ.7 కోట్లు విరాళంగా అందజేసినట్లు తిరుపతి మలబార్ గోల్డ్ డైరెక్టర్లు రెజీష్, హరి తెలిపారు. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళ ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్రంలోని అన్ని మలబార్ బ్రాంచ్‌లు స్పందించి ఈ నిధులను సమకూర్చాయన్నారు. ఇందులో రెండు కోట్లు తక్షణ సాయంగా, 5 కోట్లు నిరాశ్రయుల కోసం మలబార్ హౌసింగ్ చారిటీ ద్వారా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మలబార్ గ్రూప్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ కేరళ ముఖ్యమంత్రిని కలిసి చెక్కును అందించినట్లు తెలిపారు. -
మలబార్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మానుషి చిల్లర్
ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తాజాగా మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. కాగా మానుషి చిల్లర్ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ చేతుల మీదుగా బ్రాండ్ అంబాసిడర్ ఒప్పంద పత్రాలను స్వీకరించారు. -
మలబార్ గోల్డ్‌పై తప్పుడు ప్రచారం.. దోషికి శిక్ష
హైదరాదాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందనే ఫొటోలను ప్రచారం చేసిన వ్యక్తికి దుబాయ్ న్యాయస్థానం తగిన శిక్ష విధించింది. కోర్టు అది తప్పుడు ప్రచారమని పేర్కొంటూ.. ఈ పనికి పాల్పడ్డ బినిష్ పున్నాకల్ ఆరుముగన్‌కి బహిష్కరణతోపాటు రూ.44.68 లక్షల జరిమానా విధించిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సోషల్ మీడియాను ఉపయోగించుకొని సంస్థలు/వ్యక్తుల కీర్తిప్రతిష్టలను దెబ్బతీయాలని ప్రయత్నించే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం. ప్రతివాది మమల్ని క్షమాపణ కోరిన వెంటనే మేం కేసును వెనక్కు తీసుకున్నాం. కానీ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసును కొనసాగించింది. తక్కువ వ్యవధిలో ఉత్తమమైన తీర్పు వెలువరించినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం’ అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఎండీ షామ్లాల్ అహ్మద్ పేర్కొన్నారు. -
గల్ఫ్‌లో ఒకే రోజు 7 మలబార్ షోరూమ్‌లు
హైదరాబాద్: ఆభరణాల విక్రయ రంగంలో ప్రముఖ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గల్ఫ్ దేశాల్లో ఒకే రోజు ఏడు కొత్త షోరూమ్‌లను ప్రారంభించింది. యూఏఈలో ఐదు, కువైట్‌లో ఒకటి, బహ్రెయిన్‌లో ఒకటి వీటిలో ఉన్నాయి. వీటిలో 18, 22, 24 క్యారట్ల బంగారు ఆభరణాలతోపాటు, వజ్రాలు, ఆన్కట్ వజ్రాలు, జాతి రత్నాభరణాలను ప్రదర్శించనున్నట్టు సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ షోరూమ్‌ల విస్తరణపై రూ.620 కోట్లను వెచ్చించనున్నట్టు మలబార్ గోల్డ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి లోపు అదనంగా 24 షోరూమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం షోరూమ్‌ల సంఖ్యను 185కి పెంచుకోనుంది. -
ఆ ఫోటోగ్రాఫ్తో మాకు సంబంధం లేదు
ఇది కొందరి అసత్య ప్రచారం: మలబార్ గోల్డ్ హైదరాబాద్: పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని పోలి ఉన్న కేక్‌ను కోస్తున్నట్లు ఉన్న ఫోటోగ్రాఫ్తో తమకెలాంటి సంబంధం లేదని ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా నమ్మకమైన కస్టమర్ బేస్ కలిగిన తమ బ్రాండ్‌ను అపఖ్యాతి పాలుచేయడానికి కొందరు ఈ కుట్రపన్నారని, సోషల్‌మీడియాలో ఈ మేరకు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అసలు ఆ కేక్ కటింగ్ చేసింది యూఏఈ ఎక్స్చేంజ్ కంపెనీ అని తెలియజేసింది. -
మలబార్ గోల్డ్‌లో బంగారు నాణేలు చోరీ
కడప : కడప నగరం కోటిరెడ్డి సర్కిల్లోని మలబార్ గోల్డ్ దుకాణంలో 180 బంగారు నాణేలు చోరీ అయ్యాయి. ఈమేరకు మలబార్ గోల్డ్ మేనేజర్ షంషీర్ బుధవారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 138 గ్రాముల బరువుగల వీటి విలువ 3.5లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. వన్ టౌన్ సీఐ రమేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరంటే గౌరవం
లక్ష్మీపురం(గుంటూరు), న్యూస్‌లైన్ :గుంటూరులో తనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారని, గుంటూరంటే తనకు అమితమైన గౌరవమని ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ అన్నారు. గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ షోరూంను ఆదివారం ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తనకు ఎన్నో ఏళ్లుగా మలబార్ సంస్థతో మంచి అనుబంధం ఉందని, తాను మెచ్చిన సంస్థ మలబార్ అని ఆమె అన్నారు. సంస్థ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అషర్ మాట్లాడుతూ గుంటూరులో ప్రారంభించిన మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూమ్ ప్రపంచ వ్యాప్తంగా 110 అవుట్లెట్లను కలిగి ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఇది 11వ షోరూమ్ అని చెప్పారు. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కొనుగోలు దారులకు బంగారం, డైమండ్ ఆభరణాలు ప్రతి గ్రాముపై రూ.120 తగ్గింపును పరిమిత కాల ఆఫర్‌గా అందిస్తున్నామన్నారు. తమ సంస్థ భవిష్యత్తులో హాంకాంగ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో అవుట్‌లెట్స్ విస్తరణ చేసే ఉద్దేశంతో ఉందన్నారు. యూరోపియన్ మార్కెట్లో సంస్థ విస్తరణకు కృషిచేస్తున్నామన్నారు. సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా వార్షిక నికర లాభంలో పది శాతం ఆరోగ్యం, విద్య, పర్యావరణం, ఉచిత గృహ నిర్మాణం, స్త్రీ సాధికారిత వంటి ఐదు రంగాల అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. 2014-15 సంవత్సరంలో సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు రూ.300 మిలియన్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అసోసియేట్ డెరైక్టర్ పి.కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ 1993లో ధక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రంలో మలబార్ సంస్థను ప్రారంభించామన్నారు. తమకు ఎనిమిది దేశాల్లో పటిష్టమైన రిటైల్ నెట్వర్క్ ఉందన్నారు. వార్షిక టర్నోవర్ 220 బిలియన్లు అని, ప్రస్తుత టర్నోవర్ ఆధారంగా ప్రపంచంలో మూడవ అతి పెద్ద జ్యూయలరీ సంస్థగా మలబార్ స్థానం సంపాదించిందన్నారు. సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రేన్ గ్రూప్ సంస్థల చైర్మన్ గ్రంథి కాంతారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి కొనుగోలుదారులకు బహుమతులు ఈ సందర్భంగా మొదటి కొనుగోలుదారులు ఎం.డి.ఎరికోల్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్ అధినేత దివాకర్, శర్వణ్ సాయికన్స్ట్రక్షన్స్ ఛైర్మన్ కళానిధి, శివా కన్స్ట్రక్షన్స్ చైర్మన్ శివారెడ్డి, శ్యామ్‌సంగ్ డిస్ట్రిబ్యూటర్ మట్టుపల్లి శ్రీనివాసరావు, వెంకటేష్ కన్స్ట్రక్షన్స్ సీఈవో శేషగిరి, సూర్యసాయి డెవలపర్స్ ఎం.రవికృష్ణ, జీవన్స్ మల్టీప్లక్స్ గుంటపల్లి జగజీవన్బాబు తదితరులకు కాజల్ చేతుల మీదుగా బంగారం, డైమండ్స్, అంకట్ డైమండ్స్, ప్రీషియస్ జెమ్స్ జ్యూయలరీ, హ్యాండ్‌క్రాఫ్ట్ డిజైన్డ్ జ్యూయలరీ, ఇండియన్ హెరిటేజ్ జ్యూయలరీ, వాచ్‌లను అందజేశారు. కాజల్ కోసం ఉరుకులు...పరుగులు ప్రముఖ సినీ నటి కాజల్‌అగర్వాల్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలుసుకున్న నగరంలోని యువత షోరూము వద్దకు చేరుకుని కాజల్‌ను చూసేందుకు ఉత్సాహం చూపారు. ఆమెతో మాట్లాడాలని, ఫోటోలు దిగేందుకు చాలా ఆసక్తి కనబర్చారు. కాజల్ షోరూమ్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం వెళ్ళిపోతుందని తెలుసుకున్న పలువురు యువకులు ఆమె వెళుతుండంగా పరుగులు తీశారు. మొత్తం మీద కాజల్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున నగరంలోని యువతీ యువకులు షోరూమ్ వద్దకు విచ్చేసి ఆనందపడ్డారు.