స్వార్థ రాజకీయాల కోసమే దళితుల విభజన
- ఢిల్లీలో మాల మహానాడు నిరసనలు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను విభజించే కుట్రలు పన్నుతున్నార ని మాల మహానాడు మండిపడింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాల మహానాడు చేపట్టిన నిరసన కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తీర్పులకు విరుద్ధమన్నారు.
ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలను ఆదుకోవడానికి గతంలో సుప్రీం కోర్టు చేసిన సూచలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై సానుకూల నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమ సత్తా చూపుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాలు ఆగస్ట్ 12 వరకు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శ్రీనివాస్, తెలంగాణ అధ్యక్షడు రమేష్ పాల్గొన్నారు.