ఇందూరు బిడ్డకు జేజేలు
సాహసమే పూర్ణ ఊపిరి
సిరికొండ/తాడ్వాయి, న్యూస్‌లైన్: సాహసమే ఆమె ఊపిరి. మనోధైర్యమే ఆమె బలం. అందుకే ఎవరెస్ట్ సైతం ఆమెకు తలవంచింది. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి అత్యంత చిన్న వయసులోనే ప్రపంచంలో ఎత్తయిన శిఖరాన్ని అధిరోహిం చింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన గిరిజన బాలిక మాలావత్ పూర్ణ ఈ అరుదైన ఘనత సాధించింది. మాలావత్ దేవీదాస్-లక్ష్మి దంపతుల కూతురు పూర్ణ.. తాడ్వాయిలోని సాంఘిక సంక్షేమ గురుకు ల పాఠశాలలో ఇటీవ లే తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుంది. ఐదో తరగతి వరకు పాకాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివిన పూర్ణ చిన్నప్పటి నుంచే క్రీడల్లో ముందుండేది. గురుకుల పాఠశాలలో చేరిన తర్వాత ఉపాధ్యాయుల ప్రో త్సాహంతో పర్వతారోహణపై దృష్టి సారిం చింది.
కఠోరమైన పరిస్థితులు : యాత్రలో భాగంగా 52 రోజుల పాటు సాహసమే ఊపిరిగా ముందుకు సా గిన పూర్ణ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. హిమాలయ పర్వతాన్ని అధిరోహించే సమయంలో 20 కిలోల బరువున్న దుస్తులను ధరించింది. తీవ్రమై న మంచు, చలి, తక్కువ ఆక్సిజన్, ప్రాణాంతక డెత్జోన్ను దాటడం వంటి ఎన్నో కఠోరమైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది. తమ ఊరి బిడ్డ ఉన్నత శిఖరాన్ని అధిరోహించిందని తెలియగానే పాకాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఎంతో గర్వంగా ఉంది
నా కూతురు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం ఎంతో గర్వంగా ఉంది. మా పాప అంత పెద్ద గుట్టను, అంత చలిలో ఎక్కాల్సి ఉంటుందని సార్లు మొదట చెప్పగానే చాలా భయమేసింది. పంపించొద్దనుకున్నా. కాని పూర్ణనే నాకు ధైర్యం చెప్పింది. ఏం కాదు నాన్న నేను శిఖరాన్ని సులువుగా ఎక్కుతానని చెప్పి శిక్షణకు వెళ్లింది. చిన్నప్పుడు పూర్ణ ఎంతో స్పీడ్‌గా సైకిల్ తొక్కేది. చాలా వేగంగా కబడ్డీ ఆడేది. ఇలాంటి ఆటల వల్లనేనేమో అంత పెద్ద శిఖరాన్ని నా బిడ్డ ఎక్కగలిగింది. - మాలావత్ దేవీదాస్, పూర్ణ తండ్రి
వద్దని ఏడ్చేశాను
నా బిడ్డను అంత చలిలో అంత పెద్ద మంచు కొండను ఎక్కేందుకు తీసుకెళ్తామంటే వద్దని బాగా ఏడ్చేశాను. ఆ కొండ ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉంటే ఇంటికి తిరిగి రావొచ్చు. లేదంటే ఇంకా ఏమైనా జరగొచ్చు అని సార్లు చెప్పిండ్రు. అక్కడికి పోవద్దని ఎంత చెప్పినా మా పూర్ణ అస్సలు వినలేదు. నాకైతే బాగానే భయమేసింది. నా బిడ్డ అంత పెద్ద కొండ ఎక్కిందని టీవీల్లో చూపిస్తుంటే ఎంతో ఆనందపడ్డాను. - మాలావత్ లక్ష్మి, పూర్ణ తల్లి