Malaysia Masters Grand Prix Gold tournament
-
టైటిల్‌కు విజయం దూరంలో
మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ ఫైనల్లో సైనా సారావక్ (మలేసియా): కొత్త ఏడాదిని టైటిల్‌తో శుభారంభం చేసేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఓ విజయం దూరంలో ఉంది. మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సైనా 21–13, 21–10తో ఐదో సీడ్ యిప్ పుయ్ యిన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఓవరాల్ కెరీర్లో యిప్ పుయ్ యిన్ పై సైనాకిది ఏడో విజయం కావడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సైనా ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో పోర్న్‌పవీ 21–19, 20–22, 21–18తో ప్రపంచ 19వ ర్యాంకర్ చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)పై సంచలన విజయం సాధించింది. 32 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో సైనాకు తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. ఒకదశలో 9–12తో వెనుకబడిన సైనా వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 14–9తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఒక పాయింట్ చేజార్చుకున్న సైనా మళ్లీ చెలరేగి ఈసారి వరుసగా ఏడు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలో సైనా 6–0తో ముందంజ వేసి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. -
మరో అడుగు దూరంలో సైనా
సారావక్ (మలేసియా): మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించిన టాప్ సీడ్ సైనా టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో హాంగ్ కాంగ్ ప్లేయర్ యిప్ పుయ్ యిన్‌పై 21-13, 21-10 తేడాతో సైనా నెగ్గింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి కాస్త ప్రతిఘటించినా సైనా మాత్రం ఈ ఏడాది తొలి టోర్నీని కైవసం చేసుకునేందుకు పోరాడింది. రెండో గేమ్‌లో హాంగ్ కాంగ్ ప్లేయర్ ను ఓడించి మ్యాచ్ నెగ్గి యిన్ పై గెలుపొటముల రికార్డును 6-2గా మెరుచు పరుచుకుంది. ఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ పోర్నపావీ చోచువాంగ్‌తో తో సైనా తలపడనుంది. మరో సెమీఫైనల్లో పోర్నపావీ చోచువాంగ్ చ్యుంగ్ ఎన్గన్ యి పై 21-19, 20-22, 21-18తో నెగ్గి ఫైనల్లో ప్రవేశించింది. గంటా 16 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో రెండో సీడ్ ప్లేయర్ ఎన్గన్ యికు అనామకురాలు పోర్నపావీ షాకిచ్చి టోర్నీ విజయానికి ఒక్క మెట్టు దూరంలో నిలిచింది. -
సెమీఫైనల్లో సైనా నెహ్వాల్
జయరామ్ ఇంటికి...మలేసియా మాస్టర్స్ టోర్నీ సారావక్ (మలేసియా): భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్న లండన్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత సైనా, శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21–15, 21–14తో ఎనిమిదో సీడ్ ఫిత్రిని ఫిత్రియాని (ఇండోనేసియా)పై విజయం సాధించింది. ఈ ప్రపంచ 40వ ర్యాంకర్‌పై హైదరాబాద్ క్రీడాకారిణికిది మూడో విజయం. 40 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనాకు ఆరంభంలో గట్టిపోటీ ఎదురైంది. ఒక దశలో తొలిగేమ్‌లో ఫిత్రియాని 4–0తో ముందంజలో ఉంది. ఇదే జోరులో ఆమె 11–6తో సైనాపై ఆధిక్యాన్ని చాటింది. అయితే సైనా పుంజుకొని స్కోరును 12–12తో సమం చేసింది. అనంతరం వరుస పాయింట్లతో గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో గేమ్‌లో మొదటి నుంచి ఆధిక్యంలోనే నిలిచి మ్యాచ్‌ను గెలుచుకుంది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ పోరాటం ముగిసింది. ప్రపంచ 19వ ర్యాంకర్ జయరామ్ 13–21, 8–21తో ఆంథోని సినిసుక గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. అజయ్ జయ రామ్.. ఆంథోని చేతిలో ఓడిపోవడం ఇది మూడోసారి కాగా... ఈ మ్యాచ్‌లో ఏ గేమ్‌లోనూ ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయాడు. అదంతా సులభం కాదు... గతేడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా నియమితులైన సైనా, ఒక వైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూ మరో వైపు ఆ గురుతర బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించడం అంత సులభం కాదని చెప్పింది. అయితే ఈ అవకాశం రావడానికి ముందే దీనిపై చర్చించానని, కమిషన్ కు తనదైన పరిధిలో తగు సలహాలు ఇచ్చేందుకు ఎప్పుడైనా సిద్ధమేనని స్పష్టం చేసింది. -
సైనా జోరుగా ముందుకు..
సారావక్ (మలేసియా): మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో విజయం సాధించింది. వరుసగా మూడో విజయంతో సైనా నెహ్వాల్ సెమిఫైనల్స్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21-15, 21-14 తేడాతో ఇండోనేసియాకు చెందిన ఫిత్రియానిని ఓడించింది. వరుస పాయింట్లు సాధిస్తూ ఎనిమిదో సీడెడ్ ప్లేయర్ ఫిత్రియానిని తికమక పెట్టి తొలి సెట్ కైవసం చేసుకున్న టాప్ సీడ్ సైనా రెండో సెట్లోనూ పోరాటం కొనసాగించింది. 40 నిమిషాల్లో గేమ్ ముగించి సైనా సెమిస్లో ప్రవేశించింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అజయ్ జయరామ్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆంథోనీ సినిసుకా గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో 21-13, 21-8 తేడాతో జయరామ్ ఓటమిపాలయ్యాడు. రెండు వరుస సెట్లలో జయరామ్ చేతులెత్తేయడంతో ప్రత్యర్థి ఆంథోనీ కేవలం 28 నిమిషాల్లోనే నెగ్గి సెమిఫైనల్స్ చేరుకున్నాడు. -
క్వార్టర్ ఫైనల్లో సైనా
సారావక్ (మలేసియా): వరుసగా రెండో విజయం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21–17, 21–12తో హనా రమాదిని (ఇండోనేసియా)పై గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అజయ్ జయరామ్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జయరామ్ 21–12, 15–21, 21–15తో సుయె సువాన్ యి (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 17–21, 21–18, 12–21తో గుణవా¯ŒS–కిడో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–మనూ అత్రి జోడీ 18–21, 10–21తో అహ్మద్–గ్లోరియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
శ్రీకాంత్‌కే టాప్ సీడింగ్
‘మలేసియా’ మాస్టర్స్‌తో సీజన్ మొదలు బరిలో కశ్యప్, సింధు, సాయిప్రణీత్ సాక్షి, హైదరాబాద్: గత ఏడాదిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. ఈనెల 13న మొదలయ్యే మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌తో భారత ఆటగాళ్ల కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. మలేసియాలోని కుచింగ్ పట్టణంలో జరిగే ఈ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్, ఆనంద్ పవార్, అజయ్ జయరామ్, చేతన్ ఆనంద్ బరిలోకి దిగుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్‌కు ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడింగ్ దక్కింది. కశ్యప్‌కు మూడో సీడింగ్ లభించగా... సాయిప్రణీత్‌కు పదమూడో సీడింగ్‌ను కేటాయించారు. తొలి రౌండ్లో యూనుస్ ఆలమ్‌షా (ఇండోనేసియా)తో శ్రీకాంత్; షీ కుయ్ చున్ (చైనీస్ తైపీ)తో కశ్యప్; లిన్ యు సెయిన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్ ఆడతారు. ఇదే టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి పి.వి.సింధుకు రెండో సీడింగ్ దక్కింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నమెంట్ ముగిశాక భారత క్రీడాకారులు స్వదేశంలో జరిగే సయ్యద్ మోదీ స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొంటారు. ఈ నెల 20 నుంచి 25 వరకు జరిగే ఈ టోర్నీకి లక్నో ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్‌కే టాప్ సీడింగ్ దక్కింది. శ్రీకాంత్‌తోపాటు గురుసాయిదత్, కశ్యప్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్ తదితరులు ఈ టోర్నీలో ఆడనున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్‌కు టాప్ సీడింగ్ దక్కింది. నిరుటి రన్నరప్ సింధుకు మూడో సీడింగ్‌ను కేటాయించారు. వేర్వేరు పార్శ్వంలో ఉండటంతో అంతా అనుకున్నట్లు జరిగితే మరోసారి సైనా, సింధు టైటిల్ పోరులో తలపడే అవకాశముంది. తొలి రౌండ్లో యిన్ ఫున్ లిమ్ (మలేసియా)తో సైనా; క్వాలిఫయర్‌తో సింధు ఆడతారు. రుత్విక శివాని తొలి రౌండ్లో కరోలినా మారిన్‌తో పోటీపడుతుంది.