సెమీఫైనల్లో సైనా నెహ్వాల్
జయరామ్ ఇంటికి...మలేసియా మాస్టర్స్ టోర్నీ
సారావక్ (మలేసియా): భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్న లండన్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత సైనా, శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21–15, 21–14తో ఎనిమిదో సీడ్ ఫిత్రిని ఫిత్రియాని (ఇండోనేసియా)పై విజయం సాధించింది. ఈ ప్రపంచ 40వ ర్యాంకర్‌పై హైదరాబాద్ క్రీడాకారిణికిది మూడో విజయం. 40 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనాకు ఆరంభంలో గట్టిపోటీ ఎదురైంది. ఒక దశలో తొలిగేమ్‌లో ఫిత్రియాని 4–0తో ముందంజలో ఉంది.
ఇదే జోరులో ఆమె 11–6తో సైనాపై ఆధిక్యాన్ని చాటింది. అయితే సైనా పుంజుకొని స్కోరును 12–12తో సమం చేసింది. అనంతరం వరుస పాయింట్లతో గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో గేమ్‌లో మొదటి నుంచి ఆధిక్యంలోనే నిలిచి మ్యాచ్‌ను గెలుచుకుంది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ పోరాటం ముగిసింది. ప్రపంచ 19వ ర్యాంకర్ జయరామ్ 13–21, 8–21తో ఆంథోని సినిసుక గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. అజయ్ జయ రామ్.. ఆంథోని చేతిలో ఓడిపోవడం ఇది మూడోసారి కాగా... ఈ మ్యాచ్‌లో ఏ గేమ్‌లోనూ ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయాడు.
అదంతా సులభం కాదు...
గతేడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా నియమితులైన సైనా, ఒక వైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూ మరో వైపు ఆ గురుతర బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించడం అంత సులభం కాదని చెప్పింది. అయితే ఈ అవకాశం రావడానికి ముందే దీనిపై చర్చించానని, కమిషన్ కు తనదైన పరిధిలో తగు సలహాలు ఇచ్చేందుకు ఎప్పుడైనా సిద్ధమేనని స్పష్టం చేసింది.