శ్రీకాంత్‌కే టాప్ సీడింగ్
‘మలేసియా’ మాస్టర్స్‌తో సీజన్ మొదలు బరిలో కశ్యప్, సింధు, సాయిప్రణీత్
సాక్షి, హైదరాబాద్: గత ఏడాదిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. ఈనెల 13న మొదలయ్యే మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌తో భారత ఆటగాళ్ల కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. మలేసియాలోని కుచింగ్ పట్టణంలో జరిగే ఈ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్, ఆనంద్ పవార్, అజయ్ జయరామ్, చేతన్ ఆనంద్ బరిలోకి దిగుతున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్‌కు ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడింగ్ దక్కింది. కశ్యప్‌కు మూడో సీడింగ్ లభించగా... సాయిప్రణీత్‌కు పదమూడో సీడింగ్‌ను కేటాయించారు. తొలి రౌండ్‌లో యూనుస్ ఆలమ్‌షా (ఇండోనేసియా)తో శ్రీకాంత్; షీ కుయ్ చున్ (చైనీస్ తైపీ)తో కశ్యప్; లిన్ యు సెయిన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్ ఆడతారు. ఇదే టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి పి.వి.సింధుకు రెండో సీడింగ్ దక్కింది.
ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నమెంట్ ముగిశాక భారత క్రీడాకారులు స్వదేశంలో జరిగే సయ్యద్ మోదీ స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొంటారు. ఈ నెల 20 నుంచి 25 వరకు జరిగే ఈ టోర్నీకి లక్నో ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్‌కే టాప్ సీడింగ్ దక్కింది. శ్రీకాంత్‌తోపాటు గురుసాయిదత్, కశ్యప్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్ తదితరులు ఈ టోర్నీలో ఆడనున్నారు.
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్‌కు టాప్ సీడింగ్ దక్కింది. నిరుటి రన్నరప్ సింధుకు మూడో సీడింగ్‌ను కేటాయించారు. వేర్వేరు పార్శ్వంలో ఉండటంతో అంతా అనుకున్నట్లు జరిగితే మరోసారి సైనా, సింధు టైటిల్ పోరులో తలపడే అవకాశముంది. తొలి రౌండ్‌లో యిన్ ఫున్ లిమ్ (మలేసియా)తో సైనా; క్వాలిఫయర్‌తో సింధు ఆడతారు. రుత్విక శివాని తొలి రౌండ్‌లో కరోలినా మారిన్‌తో పోటీపడుతుంది.