Indian badminton players
-
ఫైనల్లో రుత్విక–రోహన్ జంట
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని ఫైనల్‌కు దూసుకెళ్లింది. గచ్చి»ౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో శనివారం రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–16, 21–13తో అమృత–సూర్య (భారత్) జోడీపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ షట్లర్ కాటం తరుణ్ రెడ్డి ఫైనల్లో అడుగు పెట్టాడు.సెమీస్‌లో తరుణ్ 14–21, 21–13, 21–14తో తెలంగాణకే చెందిన రుషీంద్ర తిరుపతిపై గెలిచాడు. మరో సెమీస్‌లో రితి్వక్ సంజీవి సతీశ్ కుమార్ (భారత్) 21–18–21–13తో మైరాబాలువాంగ్ మైస్నమ్ (భారత్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ఇషారాణి బారువా (భారత్) 15–21, 21–18, 21–11తో అనుపమా ఉపాధ్యాయ్ (భారత్)పై, రక్షిత శ్రీ సంతోష్ రామరాజ్ (భారత్) 21–11, 21–17తో అన్మోల్ ఖరబ్ (భారత్)పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టారు.పురుషుల డబుల్స్‌లో తెలంగాణకు చెందిన పంజాల విష్ణువర్ధన్ గౌడ్ తన భాగస్వామి ఎం.ఆర్.అర్జున్‌తో కలిసి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. సెమీ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–అర్జున్ ద్వయం 21–12, 14–21, 21–18తో సూరజ్–ధ్రువ్ రావత్ (భారత్) జంటపై, పృథ్వీ కృష్ణమూర్తి–సాయిప్రతీక్ (భారత్) జోడీ 21–18, 21–19తో హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జంటపై గెలిచి టైటిల్ ఫైట్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో ప్రియ–శృతి (భారత్) ద్వయం 21–10, 21–18తో ప్రగతి–విశాఖ (భారత్) జంటపై, ఆరతి సారా–వర్షిణి (భారత్) జోడీ 21–13, 16–21, 21–15తో అమృత–సోనాలీ (భారత్)ద్వయంపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. -
Indonesia Masters: మెయిన్ ‘డ్రా’కు కిరణ్ జార్జి అర్హత
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లోనూ ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి గెలుపొందాడు. కేరళకు చెందిన 23 ఏళ్ల కిరణ్ తొలి రౌండ్లో 12–21, 21–18, 22–20తో లానియర్ (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో 21–17, 12–21, 21–15తో రుస్తావిటో (ఇండోనేసియా)పై నెగ్గాడు. -
Malaysia Open 2023: సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ సాత్విక్–చిరాగ్ 16–21, 21–11, 15–21తో ప్రపంచ 17వ ర్యాంక్ ద్వయం లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీకి 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 8,400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భళా.. కిడాంబి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతిష్టాత్మక థామస్ కప్ విజయాన్ని భారత జట్టు గెలుపొందడం, అందులో గుంటూరుకు చెందిన షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించడంతో ఆదివారం క్రీడాభిమానులు, సహచరులు, కోచ్‌లు ఉద్వేగానికి లోనయ్యారు. శభాష్ శ్రీకాంత్.. అంటూ ప్రశంసలు కురిపించారు. 2018లో ప్రపంచ నంబర్ వన్ స్థానం పొందిన తర్వాత అనేక విజయాలు నమోదు చేసినా, భారత చిరకాల వాంఛ అయిన థామస్ కప్ గెలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. థామస్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ తనదైన శైలిలో ప్రత్యర్థి ఇండోనేషియా ఆటగాడు, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21–15, 23–21 స్ట్రెయిట్ సెట్స్‌లో మట్టికరిపించి తెలుగోడి సత్తా చాటాడు. గుంటూరులో ఉన్న శ్రీకాంత్ తండ్రి కృష్ణను షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సంపత్ కుమార్, డి.శ్రీనివాసరావులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుంటూరులోనే ఓనమాలు ఏడేళ్ల వయసులో శ్రీకాంత్ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వేసవి శిక్షణకు సరదాగా వచ్చాడు. అప్పుడే అతనిలోని వేగాన్ని గుర్తించిన శిక్షకులు, సీనియర్ ఆటగాళ్లు తల్లిదండ్రులు కృష్ణ, రాధలకు మరింత ఉత్తమ శిక్షణ ఇప్పించాలని సలహా ఇవ్వడంతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. అయినప్పటికీ శ్రీకాంత్ తల్లిదండ్రులు గుంటూరుతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అడపాదడపా శ్రీకాంత్ గుంటూరుకు రావడం, పాత మిత్రులను కలవడం జరుగుతోంది. ఈ దేశం గర్విస్తోంది.. థామస్ కప్‌లో నా కుమారుడు శ్రీకాంత్ విజయాన్ని దేశం సాధించిన విజయంగా నేను భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణతో సాధన చేశాడు. దీని కోసం ఎన్నో సరదాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ విశ్రమించకుండా సాధన చేస్తునే ఉంటాడు. శ్రీకాంత్‌ను చూసి మరింత మంది ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను. – కిడాంబి కృష్ణ, శ్రీకాంత్ తండ్రి అద్భుత వేగం అతని సొంతం ఎన్టీఆర్ స్టేడియంలో తొలి నాళ్లలో శ్రీకాంత్ సాధన చేయడం చూశాను. అద్భుత వేగం అతని సొంతం. తోటి పిల్లలతో సరదాగా ఉండడంతో పాటు, ఆట సమయంలో వేరే ధ్యాస లేకుండా దృష్టి సారించే వాడు. విజయం సాధించాలంటే ఏమి చేయాలో అతనికి బాగా తెలుసు. అందుకోసం చేసేదంతా క్రమశిక్షణతో చేసేవాడు. ఈ రోజు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. క్వార్టర్ ఫైనల్స్ నుంచి మ్యాచ్‌లు గమనిస్తే భారత బృందం కొత్త దూకుడు విధానాన్ని అనుసరించింది. ప్రత్యర్థులు ఇది తెలుసుకునే లోపే విజయం భారత్ సొంతమయ్యింది. – షేక్ అన్వర్ బాషా, షటిల్ కోచ్ ఇదొక చరిత్రే భారత జట్టులోని ఐదుగురిలో నలుగురు తెలుగువారు. అందులో మన గుంటూరు షట్లర్ శ్రీకాంత్ ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. అటువంటి క్రీడాకారుడ్ని పొందిన రాష్ట్రం, దేశం గర్వపడుతోంది. మా ముందు ఓనమాలు నేర్చుకున్న పిల్లాడు ఈ రోజు ప్రపంచం మెచ్చే ప్లేయర్‌గా గుర్తింపు పొందడం పట్ల అసోసియేషన్ సభ్యులు, క్రీడాభిమానులం గర్వంగా ఫీల్ అవుతున్నాం. – సంపత్ కుమార్, షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి -
శభాష్ సాత్విక్
సాక్షి, అమలాపురం: కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ప్రతిష్టాత్మక థామస్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు కావడం పట్ల ఈ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్స్‌లో సాత్విక్.. చిరాగ్ శెట్టితో కలిసి ఆడాడు. గతంలో కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టు తరఫున బంగారు, రజత పతకాలు సాధించాడు. ఒలింపిక్స్‌లో పతకం త్రుటిలో చేజారింది. అయినా వెరవకుండా పలు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. సాత్విక్ విజయం పట్ల అమలాపురంలో పలువురు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. సాత్విక్ ఎదుగుదల వెనుక అతడి తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ పాత్ర కీలకం. కాశీ విశ్వనాథ్ పాఠశాలలో పీడీగా పని చేస్తూ హెచ్ఎంగా పదోన్నతి పొందాక రిటైరయ్యారు. పైగా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇదే క్రీడలో స్టేట్ రిఫరీగా పని చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ అమలాపురం ఆఫీసర్స్ క్లబ్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందారు. చిన్నవాడైన సాత్విక్ క్రీడను సీరియస్‌గా తీసుకుని రాణించాడు. 2015 నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మ్యాచ్ గెలుస్తానని అనుకోలేదు తొలి సెట్లో ఓడిపోయాం. రెండో సెట్లో 20–17 తేడాతో వెనుకబడ్డాం. ఆ సమయంలో ప్రత్యర్థులు చేసిన చిన్న తప్పిదం మాకు అనుకూలంగా మారింది. ఆ సెట్ గెలిచాం. అదే ఊపులో మూడో సెట్ కూడా గెలిచాం. నాన్న, అమ్మ ఆ సమయంలో తిరుపతిలో ఉన్నారు. స్వామి కరుణించారు. అందుకే కలలో కూడా ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను గెలిచాననే ఆనందం కన్నా భారత జట్టు విజయం సాధించడం రెట్టింపు సంతోషాన్నిస్తోంది. – సాత్విక్ చిన్నప్పటి నుంచీ ఆటపై మక్కువ సాత్విక్ నాలుగో సంవత్సరం నుంచే నాతో పాటు స్టేడియానికి వచ్చేవాడు. స్థానిక క్లబ్లో శిక్షణ శిబిరాలు నిర్వహించడం, నాతో పాటు అక్కడకు రావడం వల్ల సాత్విక్‌కు ఆటపై మక్కువ పెరిగింది. జిల్లా స్థాయిలో తొలిసారి అండర్–9కు ఎంపికయ్యాడు. అక్కడి నుంచి ఆరంభమైన కెరీర్ అంతర్జాతీయ స్థాయి వరకూ వెళ్లడం మాకు చాలా సంతోషాన్నిస్తోంది. మంచి క్రీడాకారుడవుతాడని ఆశించాను కానీ ఈ స్థాయిని ఊహించలేదు. థామస్ కప్ గెలవడం సాత్విక్ కెరీర్లో గొప్ప విజయంగా నిలిచిపోతుంది. మొదట్లో సాత్విక్‌తో కలిసి ఆడిన కృష్ణప్రసాద్ కూడా ఇప్పుడు గెలిచిన జట్టులో ఉండడం చాలా సంతోషాన్నిస్తోంది. – రంకిరెడ్డి కాశీవిశ్వనాథ్, సాత్విక్ తండ్రి ఆ మ్యాచ్ చూడలేదు సాత్విక్ ఆడిన ఫైనల్ మ్యాచ్ మేము చూడలేదు. ఆ సమయంలో మేమిద్దరం (సాత్విక్ తల్లిదండ్రులు) తిరుమలలో స్వామి వారి కల్యాణంలో ఉన్నాము. బయటకు రాగానే విషయం తెలిసింది. ఈ విజయం ఊహించలేదు. సాత్విక్ ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల తల్లిదండ్రులుగా చాలా ఆనందంగా ఉంది. దీనిని మాటల్లో వర్ణించలేం. భారత జట్టుకు అభినందనలు. కోచ్‌లకు, క్రీడాభిమానులకు కృతజ్ఞతలు. – రంకిరెడ్డి రంగమణి, సాత్విక్ తల్లి దటీజ్ కృష్ణప్రసాద్ థామస్ కప్ గెలిచిన షటిల్ బాడ్మింటన్ బృందంలో మరో ఆటగాడు కాకినాడకు చెందిన గరగ కృష్ణప్రసాద్ తండ్రి గంగాధర్ ప్రోద్బలంతో షటిల్ బ్యాడ్మింటన్‌లో ప్రవేశించాడు. గంగాధర్ గత డిసెంబర్లో అనారోగ్యంతో మృతి చెందారు. తన కొడుకును అంతర్జాతీయ క్రీడాకారునిగా తీర్చిదిద్దేందుకు ఆయన అహర్నిశలూ కృషి చేశారు. గంగాధర్ సైతం షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. గతంలో ఆంధ్రా యూనివర్సిటీ బ్యాడ్మింటన్ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. క్రికెట్లో సైతం రాణించారు. తండ్రి గంగాధర్‌తో కృష్ణప్రసాద్ తండ్రి బాటలోనే కొడుకు కృష్ణప్రసాద్ కూడా షటిల్ బ్యాడ్మింటన్‌లో రాణించడం విశేషం. కృష్ణప్రసాద్‌కు మొదటి నుంచీ పట్టుదల ఎక్కువ. సాత్విక్‌తో కలిసి పలు టోర్నీలు ఆడిన కృష్ణప్రసాద్ 2011లో గోపీచంద్ అకాడమీలో చేరాడు. తొలుత సింగిల్స్ ఆడిన కృష్ణప్రసాద్ 2015 నుంచి డబుల్స్‌పై దృష్టి పెట్టాడు. మూడేళ్లలోనే జూనియర్ డబుల్స్ విభాగం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎదిగాడు. 2019లో దక్షిణాసియా బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. తాజా విజయం పట్ల దటీజ్ కృష్ణప్రసాద్.. అంటూ ఈ ప్రాంత షటిల్ క్రీడాకారులు కొనియాడుతున్నారు. అందరికీ గర్వకారణం థామస్ కప్ సాధించిన భారత బ్యాడ్మింటన్ బృందంలో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్ గౌడ్ కూడా ఉన్నాడు. ఈ చరిత్రాత్మక గెలుపుపై ‘సాక్షి’ విష్ణువర్ధన్ గౌడ్ తల్లిదండ్రుల స్పందన కోరగా వారు తమ బిడ్డ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్ టీమ్ సాధించిన గెలుపు భారతీయులందరికీ గర్వకారణమన్నారు. గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది. మాది క్రీడా కుంటుంబం. ఓ క్రీడాకారుడిగా నా కుమారుడు ప్రపంచ కప్ గెలిచిన టీంలో ఉండడం గర్వంగా ఉంది. 73 ఏళ్ల తర్వాత ఈ క్రీడలో భారత్‌కు కప్ రావడం అందులో నా కుమారుడు ఉండడం అదృష్టం. – విష్ణువర్ధన్‌గౌడ్ తండ్రి వెంకటేశ్‌గౌడ్ సంతోషంగా ఉంది నా కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో ఆడి భారత దేశానికి కప్ తీసుకురావడం సంతోషంగా ఉంది. ఎంతో పట్టుదలతో శిక్షణ పొందాడు. కుటుంబమంతా అన్ని విధాలా అండగా అన్ని వేళలా ప్రోత్సహించాం. దానికి తగ్గ ఫలితం వచ్చింది. – విష్ణువర్ధన్‌గౌడ్ తల్లి సుహాసిని -
సూపర్ లక్ష్య: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్లోకి భారత యువతార
వేదిక ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా... పరిస్థితి ఎలా ఉన్నా... తగ్గేదేలే... అంటూ భారత బ్యాడ్మింటన్ యువతార లక్ష్య సేన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో దూసుకుపోతున్నాడు. ఎవరూ ఊహించని విధంగా చెలరేగిపోతున్న 20 ఏళ్ల లక్ష్య సేన్ ఈ మెగా టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ లీ జి జియా (మలేసియా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్ మరో విజయం సాధిస్తే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన మూడో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్), నాలుగో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు. బర్మింగ్హమ్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ రూపంలో మళ్లీ ఓ భారతీయ ప్లేయర్ టైటిల్ బరిలో నిలిచాడు. 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మెగా టోర్నీలో ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ 76 నిమిషాల్లో 21–13, 12–21, 21–19తో ప్రపంచ 7వ ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ లీ జి జియా (మలేసియా)పై గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్య సేన్ 10–14తో, 12–16తో, 16–18తో వెనుకబడ్డాడు. కానీ వెనుకంజలో ఉన్నానని ఆందోళన చెందకుండా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్ స్కోరు 16–18 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఒక పాయింట్ కోల్పోయిన లక్ష్య సేన్ ఆ వెంటనే మరో పాయింట్ గెలిచి చిరస్మరణీయ విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)ను ఓడించిన లీ జి జియా సెమీఫైనల్లో మాత్రం లక్ష్య సేన్ ధాటికి కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో సౌరభ్ వర్మ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై నెగ్గిన లక్ష్య సేన్‌కు క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ లూ గ్వాంగ్ జు నుంచి వాకోవర్ లభించింది. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న లక్ష్య సేన్ కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో తనకంటే మెరుగైన ప్లేయర్లను ఓడిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన లక్ష్య సేన్ ఈ ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. గత వారం జర్మన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. గాయత్రి–త్రిషా జంట ఓటమి మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ (భారత్) జంట పోరాటం ముగిసింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో గాయత్రి– త్రిషా జోడీ 17–21, 16–21తో జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) జంట చేతిలో ఓడింది. గాయత్రి–త్రిషా జోడీకి 14 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షల 64 వేలు) తోపాటు 8,400 పాయింట్లు లభించాయి. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన ఐదో భారతీయ ప్లేయర్ లక్ష్య సేన్. గతంలో పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌నాథ్ (1947; రన్నరప్), ప్రకాశ్ పదుకొనే (1980–విజేత; 1981–రన్నరప్), పుల్లెల గోపీచంద్ (2001–విజేత)... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2015–రన్నరప్) ఈ ఘనత సాధించారు. -
44 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర...
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడనున్నారు. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే పురుషుల సింగిల్స్‌లో తొలిసారి భారత ప్లేయర్ ప్రపంచ చాంపియన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాగా మహిళల సింగిల్స్‌లో 2019లో పీవీ సింధు విశ్వవిజేతగా నిలిచింది. హుఎల్వా (స్పెయిన్): రెండు నెలల క్రితం థామస్ కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ టోర్నీ మ్యాచ్‌లో ఓడిపోయి జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన యువతార లక్ష్య సేన్... నిలకడలేని ఆటతీరుతో గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా నెగ్గలేకపోయిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి పది గంటలకు మొదలయ్యే సెమీఫైనల్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడతారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–7తో ప్రపంచ 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)ను చిత్తు చేయగా... ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 67 నిమిషాల్లో 21–15, 15–21, 22–20తో 42వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచాడు. జున్ పెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్య సేన్ 19–20 వద్ద మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. ఈ స్కోరు వద్ద ఒక్కసారిగా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ ప్రణయ్ కూడా గెలిచి ఉంటే భారత్‌కు మూడో పతకం ఖరారయ్యేది. కానీ క్వార్టర్ ఫైనల్లో కీన్ యియు (సింగపూర్) 21–14, 21–12 తో ప్రణయ్‌ను ఓడించి రెండో సెమీఫైనల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో పోరుకు సిద్ధమయ్యాడు. సింధుకు నిరాశ... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17–21, 13–21తో ఓడిపోయింది. తై జు చేతిలో సింధు ఓడటం ఇది 15వ సారి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో పతకాలు నెగ్గిన భారత క్రీడాకారుల సంఖ్య. గతంలో ప్రకాశ్ పదుకొనే (1983లో), సాయిప్రణీత్ (2019లో) కాంస్య పతకాలు నెగ్గారు. ఈసారి లక్ష్య సేన్, శ్రీకాంత్‌లలో ఒకరికి కనీసం రజతం లేదా స్వర్ణం... మరొకరికి కాంస్య పతకం ఖరారు కానుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ నెగ్గిన మొత్తం పతకాలు. మహిళల సింగిల్స్‌లో సింధు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు), సైనా నెహ్వాల్ రెండు పతకాలు (ఒక కాంస్యం, ఒక రజతం) సాధించారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట ఒక కాంస్యం గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే, సాయిప్రణీత్ ఒక్కో కాంస్యం నెగ్గారు. శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా ఒక్కో పతకం ఖరారు చేశారు. -
Saina Nehwal, Kidambi Srikanth: సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ టోక్యో ఒలిం పిక్స్‌కు అర్హత పొందలేకపోయారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమయ్యేలోపు ఎలాంటి క్వాలిఫయింగ్ టోర్నీలు నిర్వహించడంలేదని... జూన్ 15వ తేదీ ర్యాంకింగ్స్ ఆధారంగా టోక్యో బెర్త్‌లు ఖరారు చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది. భారత్ నుంచి మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో... శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. దాంతో భారత్ నుంచి సింధు, సాయిప్రణీత్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల డబుల్స్‌లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. -
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి!
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో అర్హత నిబంధనలలో మార్పులు చేస్తే తప్ప... టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆటను చూసే భాగ్యం లేనట్టే. ఆసియాలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో... క్రీడాకారులతోపాటు టోర్నీ సహాయక సిబ్బంది, ఇతర వర్గాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్–500 టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీలలో భాగమైన ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌ను కరోనా కారణంగానే వాయిదా వేయగా... సింగపూర్ ఓపెన్‌ను ఏకంగా రద్దు చేయడంతో చివరి అవకాశంగా టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలన్న భారత స్టార్స్ సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ ఎదురైంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై సింగపూర్ నిషేధం విధించింది. మరోవైపు జూన్, జూలైలలో జరగాల్సిన ఇతర టోర్నీలు కొరియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ వాయిదా పడగా... ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ, థాయ్‌లాండ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలు రద్దయ్యాయి. దాంతో ఈ ఏడాది జూలై 23న టోక్యో ఒలింపిక్స్ మొదలయ్యే వరకు అంతర్జాతీయ ఎలాంటి బ్యాడ్మింటన్ టోర్నీలు లేకుండా పోయాయి. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలు రద్దయిన నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనల వివరాలపై మరో ప్రకటన విడుదల చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో ఒకే దేశం నుంచి ఇద్దరు అర్హత పొందాలంటే టాప్–16లో కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ‘టోక్యో’ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో ఉంది. దాంతో సింధుకు ‘టోక్యో’ బెర్త్ ఖరారయింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో ఉండగా... శ్రీకాంత్ 20వ స్థానంలో ఉన్నాడు. దాంతో సాయిప్రణీత్‌కు టోక్యో బెర్త్ ఖాయమైంది. పురుషుల డబుల్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట కూడా ‘టోక్యో’ బెర్త్ దక్కించుకుంది. 31 ఏళ్ల సైనా నెహ్వాల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరగా... 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయిన శ్రీకాంత్ 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
‘షటిల్’ ఎగరడమే ముఖ్యం!
కరోనా కారణంగా ఆగిపోయిన క్రీడా ప్రపంచం మళ్లీ దారిలోకి పడుతున్న వేళ వచ్చే జనవరిలో ఒకే వేదికపై మూడు టోర్నీలు ఆడేందుకు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఆట జరగడమే సంతోషించదగ్గ పరిణామమని, అంతా బాగున్నట్లు అనిపిస్తేనే మరిన్ని టోర్నమెంట్లకు అవకాశం ఉంటుందని భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. కోవిడ్–19 కారణంగా స్తబ్దత ఏర్పడినా... అగ్రశ్రేణి ఆటగాళ్లు దానిని తట్టుకోగలిగారని, తర్వాతి స్థాయిలోని ప్లేయర్ల కెరీర్‌పై మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన అన్నారు. తాజా పరిణామాలపై ‘సాక్షి’తో గోపీచంద్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... –సాక్షి, హైదరాబాద్ మన ఆటగాళ్లలో దాదాపు అందరికీ మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీనే చివరిది. శ్రీకాంత్ సహా మరికొందరు మాత్రం ఆ తర్వాత డెన్మార్క్ ఓపెన్‌లో ఆడారు. అయితే భారత షట్లర్లందరూ కరోనా కష్టకాలం తర్వాత మొదటిసారి ఒక మేజర్ టోర్నీలో ఆడనున్నారు. బ్యాంకాక్‌లో రెండు సూపర్–1000 టోర్నీలు, ఆ తర్వాత బీడబ్లూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ ఉన్నాయి. అక్కడ కోవిడ్–19 కేసుల సంఖ్య ఇతర బ్యాడ్మింటన్ దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండటంతో ఒకే చోట మూడు టోర్నీలకు అవకాశం కల్పించారు. 2020లో తక్కువ టోర్నమెంట్లు జరిగినా... వాటి ఆధారంగానే ఫైనల్స్ కోసం పాయింట్లు తీసుకుంటున్నారు. జనవరి 3న షట్లర్లు థాయ్‌లాండ్ చేరుకొని వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. ఆ తర్వాత బయో బబుల్ వాతావరణంలోనే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే ఫుట్‌బాల్, టెన్నిస్‌లాంటివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక బ్యాడ్మింటన్ మాత్రం ఎందుకు ఆగాలి? కొంత ‘రిస్్క’ ఉన్న మాట వాస్తవమే అయినా ఎంత కాలం ఆడకుండా ఉండగలరు? సన్నాహాలపై... మా అకాడమీకి చెందిన ఆటగాళ్లు అన్ని జాగ్రత్తలతో సాధన చేస్తున్నారు. సీనియర్లు రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌కు హాజరవుతున్నారు. వీరిపై దృష్టి పెట్టేందుకు అకాడమీలో ఇతర ఆటగాళ్ల సంఖ్యను ప్రస్తుతానికి బాగా తగ్గించాం. హాస్టల్లో కూడా తక్కువ వయసువారిని ఎవరినీ అనుమతించడం లేదు. సింధు కూడా లండన్‌లో తన ప్రాక్టీస్ బాగా సాగుతోందని సమాచారమిచ్చింది. అయితే ఇప్పుడున్న స్థితిలో అద్భుత ప్రదర్శనలు వస్తాయని ఆశించరాదు. ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో కోర్టులో ఆడటం అంత సులువు కాదు. ఫలితాలకంటే ఆట జరుగుతోందని సంతోషించాల్సిన సమయమిది. చీఫ్ కోచ్ బాధ్యతల నిర్వహణపై... ఎప్పటి వరకు కోచ్‌గా కొనసాగాలో ఇంకా నిర్ణయించుకోలేదు. అధికారికంగా 2022 వరకు నా పదవీ కాలం ఉంది. ప్రత్యేకంగా విదేశీ కోచ్‌లను నియమించుకున్న తర్వాత నాపై కొంత భారం తగ్గింది. ప్రస్తుతం ముగ్గురు ఇండోనేసియన్లు, ఒక కొరియన్ కోచ్ మన జట్టుతో పని చేస్తున్నారు. టోర్నీలకు కూడా వారే వెళ్తుండటంతో ఇతర ఆటగాళ్లపై మరింతగా దృష్టి పెట్టేందుకు నాకు తగినంత సమయం లభిస్తోంది. కరోనా తర్వాత ఆట పరిస్థితి... ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడింది. అందులో క్రీడలు కూడా ఒకటి. అయితే వ్యక్తిగత క్రీడ అయిన బ్యాడ్మింటన్‌ను విడిగా చూస్తే... అగ్రశ్రేణి షట్లర్లకు పెద్దగా సమస్యలు రాలేదు. నా విశ్లేషణ ప్రకారం ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది స్పాన్సర్‌షిప్‌లు కోల్పోయారు. పలువురిని కంపెనీలు ఉద్యోగాల్లోంచి తొలగించాయి. కొన్నాళ్ల క్రితం వరకు క్రీడాకారులకు అమిత గౌరవం ఇచ్చిన కార్పొరేట్ కంపెనీలు కూడా తమ నష్టాలు చూపిస్తూ వారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాయి. 2021లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. గోపీచంద్‌పై డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆధ్వర్యంలోని అధికారిక ఓటీటీ సంస్థ ‘ఒలింపిక్ చానల్’ పుల్లెల గోపీచంద్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో షూట్ కొనసాగుతోంది. గోపీచంద్ ఇస్తున్న శిక్షణ, ఆటగాళ్లు సాధించిన ఫలితాలు, ఆయన ఇద్దరు శిష్యులు (సైనా, సింధు) ఒలింపిక్ పతకాలు గెలుచుకోవడం వరకు వివిధ అంశాలు ఇందులో ఉంటాయి. -
భారత షట్లర్లకు కరోనా కష్టాలు!
సార్‌బ్రుకెన్ (జర్మనీ): కోవిడ్–19 కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ ప్రారంభమైన సార్లార్ లక్స్ ఓపెన్ సూపర్–100 టోర్నీనుంచి మన షట్లర్లు అజయ్ జయరాం, శుభాంకర్ డే అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. బుధవారమే మరో ఆటగాడు లక్ష్య సేన్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. కరోనా భయమే దీనికంతటికీ కారణం. వివరాల్లోకెళితే... ఆటగాళ్లతో పాటు కోచ్ హోదాలో టోర్నీకి వచ్చిన లక్ష్య సేన్ తండ్రి డీకే సేన్ బుధవారం కరోనా ‘పాజిటివ్’గా తేలారు. దాంతో ఆయనతో కలిసి ఉన్న లక్ష్య సేన్ టోర్నీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే సేన్‌తో కలిసి సాధన చేసిన, ప్రయాణించిన జయరామ్, శుభాంకర్ కూడా తప్పుకోవాలని టోర్నీ నిర్వాహకులు సూచించారు. ఈ విషయాన్ని ‘బీడబ్ల్యూఎఫ్’ కూడా ప్రకటించింది. దాంతో వీరిద్దరు కూడా నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం కనీసం 10 నవంబర్ వరకు ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పిన నిర్వాహకులు అందుకు తగినట్లుగా కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎక్కడ ఉండాలో, అన్ని రోజులు ఖర్చులు ఎలా భరించాలనే విషయంపై కూడా స్పష్టతనివ్వకుండా వారి మానాన వారిని వదిలేశారు. నిజానికి వీరిద్దరికి ఎలాంటి లక్షణాలు లేవు. జర్మనీ రావడానికి ముందే చేయించుకున్న పరీక్షల ‘నెగెటివ్’ రిపోర్టులు కూడా ఉన్నాయి. డీకే సేన్ రిపోర్టు వచ్చే సమయానికి జయరామ్ ఒక మ్యాచ్ కూడా ఆడేశాడు. ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో సరైన కోవిడ్–19 నిబంధనలు పాటించని నిర్వాహకులతో పాటు పరీక్షలు చేయించుకోకుండా వచ్చిన లక్ష్యసేన్ తప్పు కొంత వరకు ఉండగా... వీరిద్దరు కూడా బాధితులయ్యారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన జయరామ్ తన బాధను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఎట్టకేలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) దీనిపై స్పందించింది. వారి భోజన, వసతి ఖర్చులను తాము భరించనున్నట్లు స్పష్టం చేసింది. దాంతో ఊరట పొందిన జయరామ్...సాధ్యమైనంత తర్వాత స్వదేశం తిరిగొస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడి
బ్యాంకాక్: అంచనాలకు మించి రాణిస్తూ వస్తోన్న భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్స్‌కు చేరి ఔరా అనిపించింది. సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారత జోడీగా చరిత్ర సృష్టించింది. హేమాహేమీలైన భారత షట్లర్లు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా భారత టైటిల్ ఆశలను తమ భుజాలపై మోస్తూ వచ్చిన సాయిరాజ్ జోడి మరో అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీస్ మ్యాచ్‌లో ప్రపంచ 16వ ర్యాంక్ సాయిరాజ్ జోడి 22–20, 22–24, 21–9తో 19వ ర్యాంక్ కో సుంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్ (కొరియా) జంటను చిత్తుచేసింది. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాయిరాజ్ జంట టైటిల్ కోసం జరిగే తుది పోరుకు అర్హత సాధించింది. -
మనోళ్లకు క్లిష్టమైన డ్రా
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ముంబై: రియో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సైనాకు గ్రూప్ ‘జి’లో... తొమ్మిదో సీడ్ సింధుకు గ్రూప్ ‘ఎం’లో... పురుషుల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ శ్రీకాంత్‌కు గ్రూప్ ‘హెచ్’ లో చోటు దక్కింది. సైనా గ్రూప్‌లో మరియా ఉలిటినా (ఉక్రెయిన్), లొహెని విసెంటి (బ్రెజిల్)... సింధు గ్రూప్‌లో మిచెల్లి లీ (కెనడా), లారా సరోసి (హంగేరి), శ్రీకాంత్ గ్రూప్‌లో హెన్రీ హుర్స్‌కెనైన్ (స్వీడన్), లినో మునోజ్ (మెక్సికో) ఉన్నారు. గ్రూప్ ‘టాపర్లు’ మాత్రమే నాకౌట్ దశ (ప్రిక్వార్టర్ ఫైనల్స్)కు అర్హత సాధిస్తారు. ‘డ్రా’ ప్రకారం ప్రిక్వార్టర్స్‌లో సైనాకు పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్)... క్వార్టర్స్‌లో లీ జురుయ్ (చైనా), సెమీస్‌లో టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్); సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో తై జు యింగ్ (చైనీస్ తైపీ), క్వార్టర్స్‌లో యిహాన్ వాంగ్ (చైనా), సెమీస్‌లో ఒకుహారా (జపాన్) లేదా రచనోక్ (థాయ్‌లాండ్) ఎదురయ్యే అవకాశముంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఐదో సీడ్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో... క్వార్టర్ ఫైనల్లో లిన్ డాన్ (చైనా)తో సెమీస్‌లో లీ చోంగ్ వీ (మలేసియా)తో తలపడే అవకాశముంది. -
శ్రీకాంత్‌కే టాప్ సీడింగ్
‘మలేసియా’ మాస్టర్స్‌తో సీజన్ మొదలు బరిలో కశ్యప్, సింధు, సాయిప్రణీత్ సాక్షి, హైదరాబాద్: గత ఏడాదిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. ఈనెల 13న మొదలయ్యే మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌తో భారత ఆటగాళ్ల కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. మలేసియాలోని కుచింగ్ పట్టణంలో జరిగే ఈ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్, ఆనంద్ పవార్, అజయ్ జయరామ్, చేతన్ ఆనంద్ బరిలోకి దిగుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్‌కు ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడింగ్ దక్కింది. కశ్యప్‌కు మూడో సీడింగ్ లభించగా... సాయిప్రణీత్‌కు పదమూడో సీడింగ్‌ను కేటాయించారు. తొలి రౌండ్లో యూనుస్ ఆలమ్‌షా (ఇండోనేసియా)తో శ్రీకాంత్; షీ కుయ్ చున్ (చైనీస్ తైపీ)తో కశ్యప్; లిన్ యు సెయిన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్ ఆడతారు. ఇదే టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి పి.వి.సింధుకు రెండో సీడింగ్ దక్కింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నమెంట్ ముగిశాక భారత క్రీడాకారులు స్వదేశంలో జరిగే సయ్యద్ మోదీ స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొంటారు. ఈ నెల 20 నుంచి 25 వరకు జరిగే ఈ టోర్నీకి లక్నో ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్‌కే టాప్ సీడింగ్ దక్కింది. శ్రీకాంత్‌తోపాటు గురుసాయిదత్, కశ్యప్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్ తదితరులు ఈ టోర్నీలో ఆడనున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్‌కు టాప్ సీడింగ్ దక్కింది. నిరుటి రన్నరప్ సింధుకు మూడో సీడింగ్‌ను కేటాయించారు. వేర్వేరు పార్శ్వంలో ఉండటంతో అంతా అనుకున్నట్లు జరిగితే మరోసారి సైనా, సింధు టైటిల్ పోరులో తలపడే అవకాశముంది. తొలి రౌండ్లో యిన్ ఫున్ లిమ్ (మలేసియా)తో సైనా; క్వాలిఫయర్‌తో సింధు ఆడతారు. రుత్విక శివాని తొలి రౌండ్లో కరోలినా మారిన్‌తో పోటీపడుతుంది.