శభాష్‌ సాత్విక్‌ | Indian badminton mens team wins final on Indonesia | Sakshi
Sakshi News home page

శభాష్‌ సాత్విక్‌

Published Mon, May 16 2022 4:37 AM | Last Updated on Mon, May 16 2022 3:10 PM

Indian badminton mens team wins final on Indonesia - Sakshi

థామస్‌ కప్‌ ట్రోఫీతో భారత జట్టు సభ్యులు శ్రీకాంత్, ప్రణయ్, సాత్విక్, విష్ణువర్ధన్, చిరాగ్‌ (పై వరుసలో ఎడమ నుంచి). లక్ష్య సేన్, అర్జున్, ధ్రువ్, కృష్ణప్రసాద్, ప్రియాన్షు

సాక్షి, అమలాపురం: కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు కావడం పట్ల ఈ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్స్‌లో సాత్విక్‌.. చిరాగ్‌ శెట్టితో కలిసి ఆడాడు. గతంలో కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత జట్టు తరఫున బంగారు, రజత పతకాలు సాధించాడు. ఒలింపిక్స్‌లో పతకం త్రుటిలో చేజారింది. అయినా వెరవకుండా పలు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. సాత్విక్‌ విజయం పట్ల అమలాపురంలో పలువురు కేక్‌ కట్‌ చేసి బాణాసంచా కాల్చారు.

సాత్విక్‌ ఎదుగుదల వెనుక అతడి తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్‌ పాత్ర కీలకం. కాశీ విశ్వనాథ్‌ పాఠశాలలో పీడీగా పని చేస్తూ హెచ్‌ఎంగా పదోన్నతి పొందాక రిటైరయ్యారు. పైగా షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. ఇదే క్రీడలో స్టేట్‌ రిఫరీగా పని చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ అమలాపురం ఆఫీసర్స్‌ క్లబ్‌ స్టేడియంలో షటిల్‌ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందారు. చిన్నవాడైన సాత్విక్‌ క్రీడను సీరియస్‌గా తీసుకుని రాణించాడు. 2015 నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.


మ్యాచ్‌ గెలుస్తానని అనుకోలేదు
తొలి సెట్‌లో ఓడిపోయాం. రెండో సెట్‌లో 20–17 తేడాతో వెనుకబడ్డాం. ఆ సమయంలో ప్రత్యర్థులు చేసిన చిన్న తప్పిదం మాకు అనుకూలంగా మారింది. ఆ సెట్‌ గెలిచాం. అదే ఊపులో మూడో సెట్‌ కూడా గెలిచాం. నాన్న, అమ్మ ఆ సమయంలో తిరుపతిలో ఉన్నారు. స్వామి కరుణించారు. అందుకే కలలో కూడా ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను గెలిచాననే ఆనందం కన్నా భారత జట్టు విజయం సాధించడం రెట్టింపు సంతోషాన్నిస్తోంది.
– సాత్విక్‌

చిన్నప్పటి నుంచీ ఆటపై మక్కువ
సాత్విక్‌ నాలుగో సంవత్సరం నుంచే నాతో పాటు స్టేడియానికి వచ్చేవాడు. స్థానిక క్లబ్‌లో శిక్షణ శిబిరాలు నిర్వహించడం, నాతో పాటు అక్కడకు రావడం వల్ల సాత్విక్‌కు ఆటపై మక్కువ పెరిగింది. జిల్లా స్థాయిలో తొలిసారి అండర్‌–9కు ఎంపికయ్యాడు. అక్కడి నుంచి ఆరంభమైన కెరీర్‌ అంతర్జాతీయ స్థాయి వరకూ వెళ్లడం మాకు చాలా సంతోషాన్నిస్తోంది. మంచి క్రీడాకారుడవుతాడని ఆశించాను కానీ ఈ స్థాయిని ఊహించలేదు. థామస్‌ కప్‌ గెలవడం సాత్విక్‌ కెరీర్‌లో గొప్ప విజయంగా నిలిచిపోతుంది. మొదట్లో సాత్విక్‌తో కలిసి ఆడిన కృష్ణప్రసాద్‌ కూడా ఇప్పుడు గెలిచిన జట్టులో ఉండడం చాలా సంతోషాన్నిస్తోంది.

– రంకిరెడ్డి కాశీవిశ్వనాథ్, సాత్విక్‌ తండ్రి

ఆ మ్యాచ్‌ చూడలేదు
సాత్విక్‌ ఆడిన ఫైనల్‌ మ్యాచ్‌ మేము చూడలేదు. ఆ సమయంలో మేమిద్దరం (సాత్విక్‌ తల్లిదండ్రులు) తిరుమలలో స్వామి వారి కల్యాణంలో ఉన్నాము. బయటకు రాగానే విషయం తెలిసింది. ఈ విజయం ఊహించలేదు. సాత్విక్‌ ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల తల్లిదండ్రులుగా చాలా ఆనందంగా ఉంది. దీనిని మాటల్లో వర్ణించలేం. భారత జట్టుకు అభినందనలు. కోచ్‌లకు, క్రీడాభిమానులకు కృతజ్ఞతలు.
– రంకిరెడ్డి రంగమణి, సాత్విక్‌ తల్లి

దటీజ్‌ కృష్ణప్రసాద్‌
థామస్‌ కప్‌ గెలిచిన షటిల్‌ బాడ్మింటన్‌ బృందంలో మరో ఆటగాడు కాకినాడకు చెందిన గరగ కృష్ణప్రసాద్‌ తండ్రి గంగాధర్‌ ప్రోద్బలంతో షటిల్‌ బ్యాడ్మింటన్‌లో ప్రవేశించాడు. గంగాధర్‌ గత డిసెంబర్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. తన కొడుకును అంతర్జాతీయ క్రీడాకారునిగా తీర్చిదిద్దేందుకు ఆయన అహర్నిశలూ కృషి చేశారు. గంగాధర్‌ సైతం షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. గతంలో ఆంధ్రా యూనివర్సిటీ బ్యాడ్మింటన్‌ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. క్రికెట్‌లో సైతం రాణించారు.

తండ్రి గంగాధర్‌తో కృష్ణప్రసాద్‌ 

తండ్రి బాటలోనే కొడుకు కృష్ణప్రసాద్‌ కూడా షటిల్‌ బ్యాడ్మింటన్‌లో రాణించడం విశేషం. కృష్ణప్రసాద్‌కు మొదటి నుంచీ పట్టుదల ఎక్కువ. సాత్విక్‌తో కలిసి పలు టోర్నీలు ఆడిన కృష్ణప్రసాద్‌ 2011లో గోపీచంద్‌ అకాడమీలో చేరాడు. తొలుత సింగిల్స్‌ ఆడిన కృష్ణప్రసాద్‌ 2015 నుంచి డబుల్స్‌పై దృష్టి పెట్టాడు. మూడేళ్లలోనే జూనియర్‌ డబుల్స్‌ విభాగం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎదిగాడు. 2019లో దక్షిణాసియా బ్యాడ్మింటన్‌ పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. తాజా విజయం పట్ల దటీజ్‌ కృష్ణప్రసాద్‌.. అంటూ ఈ ప్రాంత షటిల్‌ క్రీడాకారులు కొనియాడుతున్నారు.

అందరికీ గర్వకారణం 
థామస్‌ కప్‌ సాధించిన భారత బ్యాడ్మింటన్‌ బృందంలో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్‌ గౌడ్‌ కూడా ఉన్నాడు. ఈ చరిత్రాత్మక గెలుపుపై ‘సాక్షి’ విష్ణువర్ధన్‌ గౌడ్‌ తల్లిదండ్రుల స్పందన కోరగా వారు తమ బిడ్డ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్‌ టీమ్‌ సాధించిన గెలుపు భారతీయులందరికీ గర్వకారణమన్నారు.   

గర్వంగా ఉంది
చాలా ఆనందంగా ఉంది. మాది క్రీడా కుంటుంబం. ఓ క్రీడాకారుడిగా నా కుమారుడు ప్రపంచ కప్‌ గెలిచిన టీంలో ఉండడం గర్వంగా ఉంది. 73 ఏళ్ల తర్వాత ఈ క్రీడలో భారత్‌కు కప్‌ రావడం అందులో నా కుమారుడు ఉండడం అదృష్టం.
– విష్ణువర్ధన్‌గౌడ్‌ తండ్రి వెంకటేశ్‌గౌడ్‌

సంతోషంగా ఉంది
నా కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో ఆడి భారత దేశానికి కప్‌ తీసుకురావడం సంతోషంగా ఉంది. ఎంతో పట్టుదలతో శిక్షణ పొందాడు. కుటుంబమంతా అన్ని విధాలా అండగా అన్ని వేళలా ప్రోత్సహించాం. దానికి 
తగ్గ ఫలితం వచ్చింది. 
– విష్ణువర్ధన్‌గౌడ్‌ తల్లి సుహాసిని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement