ఆ విమానాలకే ఎందుకలా జరుగుతోంది?
కౌలంపూర్: మలేసియా విమానాలకే ఎందుకిలా జరుగుతోంది- విమాన ప్రయాణికులను తొలుస్తున్న ప్రశ్న ఇది. ఏడాది కాలంలో మలేసియాకు చెందిన మూడు విమానాలు విషాదానికి కారణమయ్యాయి. ఈ ఏడాది మార్చి 8న మలేసియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 కనిపించకుండాపోయింది. పది నెలలు గడుస్తున్నా ఈ విమానం ఆచూకీ ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. ఇందులో ఉన్న 237 మంది మృతి చెందినట్టు ప్రకటించారు.
మలేసియా ఎయిర్ లైన్స్ కే చెందిన ఎమ్ హెచ్ 17 విమానాన్ని జూలై 17న ఉక్రెయిన్ గగనతలంలో రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేశారు. ఈ దారుణ ఘటనలో మొత్తం 298 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా మలేసియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా విమానం 162 మందితో గగన తలంలో అదృశ్య కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతూ క్యూజెడ్8501 విమానం ఆకాశమార్గంలో అదృశ్యమైంది. బెలిటంగ్ ద్వీపం తూర్పు తీరంలో ఈ విమానం కూలిపోయిందని ధ్రువీకరించిన వార్తలు వస్తున్నాయి. మలేసియాకు చెందిన విమానాలకు వరుస ప్రమాదాలు ఎదురవుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దేశపు విమానాలకే ఎందుకిలా జరుగుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.