జీఎంఆర్కు అప్పగించేది లేదు..
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్కు పెద్ద షాక్. మాలె విమానాశ్రయాన్ని విదేశీ కంపెనీకిగానీ, తమ దేశానికి చెందిన కంపెనీకిగానీ అప్పగించేది లేదని మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ స్పష్టం చేశారు. విమానాశ్రయ నిర్వహణ బాధ్యతను తమ ప్రభుత్వానికి చెందిన మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ కంపెనీ చేపడుతుందని ఆయన వెల్లడించారు. దీంతో విమానాశ్రయ నిర్వహణ ప్రాజెక్టు తిరిగి తమకే వస్తుందని ఎదురు చూస్తున్న జీఎంఆర్కు పెద్ద ఎదురుదెబ ్బ తగిలినట్టయింది. ‘విమానాశ్రయ పూర్తి నిర్వహణ బాధ్యతలు మాల్దీవుల ప్రభుత్వానికి చాలా ముఖ్యమైంది. జీఎంఆర్కుగానీ భారత కంపెనీలకుగానీ మేము వ్యతిరేకం కాదు. వాణిజ్య, భద్రతాపరంగా ఈ విమానాశ్రయం మాకు అత్యంత ప్రాధాన్యమైంది’ అన్నారు.
కొత్త ప్రాజెక్టు చూసుకోండి..
మాలె విమానాశ్రయ ప్రాజెక్టును జీఎంఆర్కు తిరిగి అప్పగించేది లేదని తేల్చి చెప్పిన యమీన్.. మాల్దీవుల్లో ఏదైనా కొత్త ప్రాజెక్టును చూసుకోవాలని జీఎంఆర్కు సూచించారు. విమానాశ్రయ ప్రాజెక్టు వివాదాన్ని కోర్టు వెలుపల సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని చెప్పారు. కాగా, మాలె విమానాశ్రయ ఆధునీకరణ, 25 ఏళ్లపాటు నిర్వహణ ప్రాజెక్టును 2010లో జీఎంఆర్ చేపట్టింది. ఒప్పందంలో లొసుగులు ఉన్నాయని ఆరోపిస్తూ కొత్తగా అధికారంలోకి వచ్చిన మాల్దీవుల ప్రభుత్వం 2012 నవంబర్లో కాంట్రాక్టును రద్దు చేసిన సంగతి తెలిసిందే.