Male employees
-
పురుష ఉద్యోగులకు 730 పెయిడ్ లీవులు
సాక్షి, ముంబై: అంగవైకల్య పిల్లల బాగోగులు చూసుకునేందుకు బెస్ట్ సంస్థలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజులు పేయిడ్ లీవులు ఇవ్వాలనే ప్రతిపాదనకు బీఎంసీ మహాసభలో ఆమోదం లభించింది. మొదటి ఇద్దరు పిల్లలకు, వారికి 22 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇది వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది. దీంతో ఇంటివద్ద తమ వికలాంగ పిల్లల బాగోగులు చూసుకోవలన్నా, ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లాలన్నా పురుషులు తమ సొంత సెలవులు వాడుకునే అవసరం ఉండదని, 730 రోజుల్లోంచి వాడుకోవచ్చని మేయర్ కిశోరీ పేడ్నేకర్ తెలిపారు. వికలాంగులుగా జన్మించిన పిల్లలను సాకడానికి, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కొందరి ఇళ్లలో తల్లులుగాని, కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరుండరు. దీంతో గత్యంతరం లేక తండ్రులే వారి బాగోగులు చూసుకోవల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సెలవుపెట్టి ఇంటివద్ద ఉండటం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు పదవీ విరమణ పొందేవరకు లేదా దివ్యాంగ పిల్లలకు 22 ఏళ్ల వయసు వచ్చేవరకు 730 సెలవులు వాడుకునేందుకు అవకాశం కల్పించినట్లు బెస్ట్ సమితి అధ్యక్షుడు ప్రవీణ్ షిండే తెలిపారు. ఈ సెలవులు పొందాలంటే దరఖాస్తుతోపాటు 40 శాతం వికలాంగుడిగా ఉన్నట్లు సర్టిఫికెట్ జోడించాల్సి ఉంటుంది. వికలాంగ పిల్లలు తనపై ఆధారపడి ఉన్నట్లు సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది. చదవండి: ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే. -
మహిళా ఉద్యోగుల పెంపుతో జీడీపీకి జోష్..
ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డ్.. - డబ్ల్యూ20 పేరుతో ప్రత్యేక గ్రూప్ ప్రారంభం అంకారా: పురుష ఉద్యోగులతో సమాన స్థాయికి గనుక మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచగలిగితే.. భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) విలువ 27 శాతం మేర ఎగబాకే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ పేర్కొన్నారు. ఉద్యోగాల్లో స్త్రీ-పురుష సమానత్వం(జెండర్ ప్యారిటీ) ఉండటం వల్ల అమెరికా(5%), జపాన్(9%) ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌పైనే అత్యధిక సానుకూల ప్రభావం ఉంటుందని కూడా ఆమె వెల్లడించారు. ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల నుంచి మహిళా లీడర్లతో ఆదివారమిక్కడ ప్రత్యేకంగా డబ్ల్యూ20 గ్రూప్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ లగార్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధిలో మహిళా సాధికారిత పెంపునకు డబ్ల్యూ20 ఏర్పాటు ఎంతగానో దోహదం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. సభ్యదేశాలన్నీ తమ నామినీలను నియమించిన తర్వాత తొలి డబ్ల్యూ20 సదస్సు వచ్చే నెలలో ఇస్తాంబుల్‌లో జరగనుంది. మహిళా-పురుష ఉద్యోగుల మధ్య వ్యత్యాసాన్ని 2025కల్లా 25 శాతం మేర తగ్గించాలంటూ గతేడాది నవంబర్‌లో జీ20 దేశాధినేతలు పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా లగార్డ్ ప్రస్తావించారు. దీనివల్ల ప్రపంచ ఎకానమీలో అదనంగా 10 కోట్ల కొత్త కొలువులను సృష్టించేందుకు ఆస్కారం ఉందని ఆమె అంచనా వేశారు. అధిక వేతనాలు, భద్రమైన ఉద్యోగాల్లోకి మరింత మంది మహిళలు గనుక వస్తే... తలసరి ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని చెప్పారు. ఉద్యోగాల్లో స్త్రీ-పురుష సమానత్వంతో టర్కీలో తలసరి ఆదాయం కూడా 22 శాతం మేర ఎగబాకవచ్చని.. ఇతరత్రా చాలా దేశాల్లోనూ ఇదే తరహా ప్రయోజనం ఉంటుందని లగార్డ్ అభిప్రాయపడ్డారు. 2025కల్లా జెండర్ ప్యారిటీ లక్ష్యాల సాధనకు జీ20, డబ్ల్యూ20 గ్రూప్‌లతో పాటు ఐఎంఎఫ్ సభ్యదేశాలన్నీ(188) కలసికట్టుగా కృషిచేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.