అతడుగా రేప్ చేసి.. ఆమెగా జైలుకు!
తాను పురుషుడిగా ఉన్నప్పుడు టీనేజ్ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ట్రాన్స్ జెండరైన ఓ మహిళను బ్రిటన్ కోర్టు దోషిగా తేల్చింది. డేవిడ్ అనే వ్యక్తి 2004 వేసవిలో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిపాడు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే మూడేళ్ల కిందట అతను టాన్స్జెండర్గా మారాడు. తన పేరు డెవినా ఆర్టన్గా మార్చుకున్నాడు. ఆర్టాన్ను గత జనవరిలో పోర్ట్‌మౌత్ క్రౌన్ కోర్టు దోషిగా తేల్చింది. ఆమెకు శిక్ష విధించిన అనంతరం పురుషుల జైలుకు తరలించనున్నారు.
కోర్టు విచారణ వివరాల ప్రకారం.. ఆర్టాన్ 2004లో వేసవిలో బాధితురాలిని కలిశాడు. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఆమె, ఆమె మరో ఇద్దరు స్నేహితులు పోర్ట్స్ మౌత్‌లోని ఓ గ్యారేజ్‌లో ఆర్టాన్ తో కలసి మద్యాన్ని సేవించారు. అక్కడే సోఫాపై రాత్రి పడుకున్నారు. ఈ సమయంలో ఆర్టాన్ బాధితురాలిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. దీనిని ఆపడానికి ఆమె ఎంతగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. కొంచెం దూరంలోనే ఆమె స్నేహితులు నిద్రపోతున్నా మద్యం మత్తులో ఉండటంతో మేల్కొనలేదు. ఆర్టాన్ జీవితం అస్తవ్యస్తంగా సాగిందని, అతను ఓ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయంలో పెరిగాడని, తన సాయం కోసం వచ్చిన టీనేజ్ అమ్మాయిని రేప్ చేసినట్టు అతను అంగీకరించాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.
ఈ క్రమంలో ట్రాన్స్‌జెండర్ గా మారిన ఆర్టాన్ గత ఏడాది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో న్యాయమూర్తి ఆమెకు కస్టడీకి విధించారు. ఆమెకు జైలు శిక్ష వేసిన అనంతరం హంప్‌షైర్ లోని వించెస్టర్ పురుషుల జైలుకు పంపనున్నారు. లింగమార్పిడి చేయించుకున్నప్పటికీ భౌతికంగా శరీరంలో మార్పుల కోసం ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోలేదని ఆర్టాన్ న్యాయమూర్తికి తెలిపింది. పురుషుడిగా ఉన్నప్పుడు ఓ బిడ్డకు తండ్రి అయిన ఆర్టాన్.. పిల్లలు అసభ్య ఫొటోలు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై కూడా దోషిగా తేలింది.