'వర్సిటీలో సీటు కోసం వేరే వ్యక్తితో రాయించాను'
సాక్షి, హైదరాబాద్: తన బదులు మరోవ్యక్తితో ఎడ్‌సెట్ రాయించినట్లు నిందితుడు మాలిగ లింగస్వామి విచారణలో ఒప్పుకున్నాడని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ క్యాంపస్‌లో సీటు సాధించడం కోసం మరోవ్యక్తితో పరీక్ష రాయించాడని వివరించారు. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసిన లింగస్వామి వర్సిటీలోనే ఉండాలన్న ఉద్దేశంతో పూర్వ విద్యార్థి శోభన్‌తో పరీక్ష రాయించాలని అనుకున్నాడు. తన దరఖాస్తు ఫారానికి శోభన్ ఫొటో పెట్టి అప్లోడ్ చేయాలని స్నేహితుడు ఓయూ విద్యార్థి శ్రీనివాస్‌రెడ్డిని స్వామి కోరగా.. అతను ఆ పని పూర్తిచేశాడు.
ఈ క్రమంలో శోభన్ పరీక్ష రాయగా.. 108 మార్కులతో స్వామి సాంఘిక శాస్త్రం మెథడాలజీలో రెండో ర్యాంకు పొందాడు. శోభన్ రైల్వే శాఖలో గ్రూప్ -డీ కేటగిరీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కృష్ణకాంత్ కూడా ఈ తరహా నేరానికి పాల్పడి మొదటి ర్యాంకు సాధించాడని ఆరోపణలు రావడంతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడ్‌సెట్ కన్వీనర్ పి. ప్రసాద్‌ని పిలిచి వివరాలు సేకరించారు. ఆ తర్వాత నిందితుల కోసం పోలీసులు రంగంలోకి దిగి స్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించినట్లు సీసీఎస్ జాయింట్ పోలీస్ కమిషనర్ బుధవారం పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కృష్ణకాంత్ కోసం గాలిస్తున్నారు.