Malignant disease
-
పీడ తక్కువ పిశాచాల్లాంటి... కీడు తక్కువ క్యాన్సర్లివి!
Benign Cancer Malignant What Are The Differences Must Known Facts: క్యాన్సర్ అన్న మాట వింటేనే భయం. ఆ పదంతోనే వణుకు. కానీ కొన్ని క్యాన్సర్ల తీవ్రత తక్కువ. ఎలాగంటే... క్యాన్సర్ ఒక భూతం అనుకుంటే... ఈ భూతాల కీడు మోతాదు కాస్త తక్కువ. క్యాన్సర్ ఓ దెయ్యం అనుకుంటే... ఈ దెయ్యాల దయా గుణం ఒకింత ఎక్కువ. క్యాన్సర్ ఓ పిశాచమనుకుంటే ఈ పిశాచాలు పీడ తక్కువగా ఉండే పిల్ల పిశాచాలనుకోవచ్చు. ఇవి తెచ్చే అనర్థాలు చాలా దీర్ఘకాలానికి గాని రావు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ మందకొడి క్యాన్సర్లతో పోలిస్తే దీర్ఘకాలంలో డయాబెటిస్ తెచ్చే ముప్పే ఎక్కువన్నమాట. అలాంటి మొద్దుక్యాన్సర్ల గురించి తెలుసుకోడానికి ఉపయోగపడేదే ఈ కథనం. అన్ని గడ్డలూ క్యాన్సర్లు కావన్నది తెలిసిందే. హానికరం కాని గడ్డలను ‘బినైన్’ అని అంటారు. అలాగే హానికరమైనవాటిని ‘మెలిగ్నెంట్’ అని చెబుతారు. ఈ రెంటికీ మధ్య... అంతగా హానికరం కాని క్యాన్సర్లను ఒక రకంగా ‘బార్డర్ లైన్ క్యాన్సర్స్’ అనుకోవచ్చు. అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దాం. కార్సినాయిడ్ ట్యూమర్స్ : వీటినే ‘న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్’ అనవచ్చు. ఇవి చాలా చాలా అరుదు. లక్షమంది జనాభాల్లో ఏ ముగ్గురూ లేదా నలుగురిలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఇవి ఎండోక్రైన్ గ్రంథులు... అంటే హార్మోన్లు పుట్టి, స్రవించే అవయవాలైన పాంక్రియాస్, గ్యాస్రోఇంటస్టినల్ ట్రాక్ట్, టెస్టిస్, ఓవరీస్ లాంటి వాటిల్లో ఆవిర్భవిస్తాయి. వీటి సైజూ తక్కువే, పెరుగుదల రేటూ తక్కువే. ఈ క్యాన్సర్లెంత బద్దకమైనవంటే...కొన్ని సందర్భాల్లో... అవి పుట్టి, లక్షణాలు కనిపించే నాటికి కొన్ని దశాబ్దాలే దొర్లిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయా అవయవాల నుంచి స్రవించే స్రావాల (ఉదాహరణకు సెరటోనిన్, బ్రాడీకైనిన్, హిస్టమైన్, ప్రోస్టాగ్లాండిన్ వంటి వాటి) మోతాదులు చాలా ఎక్కువగా ఉండటంతో... మోతాదుకు మించి స్రవించినందున కనిపించే లక్షణాల కారణంగా అసలు సమస్య కనిపించవపోవచ్చు. నిజానికి సమస్య క్యాన్సరా లేక మరొకటా అనే అయోమయం నెలకొనవచ్చు. అందుకే ఈ అనిశ్చితి కారణంగా సమస్యకు ‘‘కార్సినాయిడ్ సిండ్రోమ్’’ అని పేరు. ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా వీటి నిర్ధారణ చేయవచ్చు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘డోటా’ న్యాక్ స్కాన్’ ఇలాంటి క్యాన్సర్లను ఖచ్చితంగా నిర్ధారణ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే సీరమ్ క్రోమోగ్నానిన్ వంటి కొన్ని రక్తపరీక్షలూ, 24 గంటల మూత్రపరీక్షతో పాటు బయాప్సీ కూడా నిర్ధారణకు ఉపయోగపడే పరీక్షలు. అరికట్టడానికి సూచనలు : ఆహారంలో నియాసిన్ (విటమిన్ బి3) ఎక్కువగా ఉండే పదార్థాలు (ఉదాహరణకు కాలేయం, చికెన్, ట్యూనా, సాల్మన్ వంటి చేపలతో పాటు శాకాహారంలో వేయించిన పల్లీలు, నువ్వులు, బార్లీ, గోధుమరవ్వ మొ.) ఎక్కువగా తీసుకోవాలి. ఇవి కార్సినాయిడ్ సమస్య లక్షణాల తీవ్రతను తగ్గించడంతో పాటు... పెలెగ్రా, నీళ్ల విరేచనాలు వంటి ఇతర సమస్యల నియంత్రణకూ కొంత తోడ్పడతాయి. క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా (సీఎల్ఎల్) : ఇదో రకం బ్లడ్‌క్యాన్సర్. ఎముకల మజ్జ/మూలగ భాగాల్లో తెల్లరక్తకణాల్లో ఒకటైన లింఫోసైట్స్ కూడా తయారవుతాయి. ఈ క్యాన్సర్‌ను చాలా మందకొడి అనీ స్టేజ్ జీరో అని చెబుతారు. తొలిదశల్లో లక్షణాలు దాదాపుగా కనపడవు. ఆ తర్వాత లింఫ్‌నోడ్స్ వాపు, తీవ్రమైన అలసట, జ్వరం, రాత్రివేళల్లో చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి నిర్దిష్టంగా ఫలానా అని చెప్పడానికి వీల్లేనివి కావడంతో సమస్య తెలియదు. ఏళ్లూపూళ్లూ గడిచాక... అతి నెమ్మదిగా గానీ అసలు లక్షణాలు కనిపించవు. ఫిల్లోడ్ ట్యూమర్స్ : గ్రీక్‌లో ఫిల్లో... అంటే ఆకు అని అర్థం. ఇవి మహిళల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్లలో ఒక రకం. మధ్యవయసు కు చేరిన మహిళల్లో తప్ప... యువతుల్లో ఒకింత తక్కువే. ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని వారాల్లోని చేతికి తగిలేలా/స్పర్శకు తెలిసేలా పెరుగతాయి. ఇవి ఎంతగా హాని చేయనివి అని చెప్పవచ్చంటే... అలా పెరిగిన వాటిని శస్త్రచికిత్సతో తొలగిస్తే చాలు. పూర్తిగా నయమైపోతాయి. కీమో/రేడియేషన్ వంటి చికిత్సలూ అక్కర్లేదు. బోర్డర్‌లైన్ ఒవేరియన్ క్యాన్సర్లు : వైద్యపరిభాషలోనే వీటిని అత్యంత తక్కువ హానికరమైన క్యాన్సర్లు (లో మేలిగ్నెంట్ పొటెన్షియల్ ట్యూమర్స్)గా చెబుతారు. అల్ట్రాసౌండ్ లేదా సీటీ స్కాన్ చేసినప్పుడు ఇవి ఎపిథీలియల్ ఒవేరియన్ క్యాన్సర్లలాగా కనిపిస్తాయి. మామూలు ఇతర క్యాన్సర్ గడ్డలకు శస్త్రచికిత్స తర్వాత కీమో కావాలగానీ... వీటికి కేవలం సర్జరీ చాలు. ఆ తర్వాత వీటి ఊసే కనిపించకుండా పోతాయి. సూడో మిక్సోమా పెరిటోనీ : ఇది కడుపులో చాలా నెమ్మదిగా పెరిగే ‘మ్యూకస్’ను స్రవించే గడ్డ. దీన్ని నయం చేయడం ఒకింత కష్టం. కానీ ఇదెంత నెమ్మదిగా పెరుగుతుందంటే... దాన్నసలు గుర్తించడానికే చాలా చాలా సమయం పడుతుంది. లో–గ్రేడ్ లింఫోమాస్ : కొన్నింటిని మినహాయిస్తే... ఈ రకాలకు చికిత్స కూడా అవసరం లేకుండా అలా గమనిస్తూ ఉంటే చాలు. కాస్తంత మంచి వ్యాధి నిరోధకత ఉన్నవాళ్లలో ఇవి ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే పూర్తిగా లొంగి ఉంటాయి. ఎందుకు తెలుసుకోవాలంటే... ఇవి ఒకింత అరుదైనవే. చాలా తక్కువ మందిలోనే కనిపించేవే. అయితే వీటిని తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న... మనకు చాలా మేలైన సమాధానం ఇస్తుంది. కణాల్లోని ఏ జన్యు పదార్థాలు, వీటిని వేగంగా పెరగకుండా చేస్తున్నాయి?... ఏ డీఎన్ఏ అంశాలు... వీటిని హానికారకాలు కాకుండా చూస్తున్నాయి? ఎందుకు చికిత్స కూడా అవసరం లేనివిగా ఉంటున్నాయి? (చికిత్స అందిస్తే ఒక్కోసారి వాటి కంటే కూడా ఆ చికిత్స కారణంగా కనిపించే దుష్ప్రభావాల వల్లనే నష్టాలు ఎక్కువన్నమాట)... ప్రస్తుతం క్యాన్సర్ పరిశోధకులు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ఆ సమాధానాలు తెలుసుకుంటే వాటిని... హానికరమైన క్యాన్సర్లకూ అనువర్తింపజేసి... చికిత్సలు కనుగొనేందుకు ఆస్కారముందా అన్న దిశలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో వీటికీ చికిత్స చేస్తుంటారు. కాకపోతే అన్ని విభాగాలకు చెందిన స్పెషలిస్టులతో కూడిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆధ్వర్యంలో... చికిత్స కంటే దుష్ప్రభావాల తీవ్రత పెరగకుండే రీతిలో వాటికి చికిత్సలు నిర్వహిస్తుంటారన్నమాట. -డాక్టర్ సురేశ్ ఏవీఎస్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్. -
వారికి ఎయిడ్స్ సోకదు!
విల్నియస్: ఎయిడ్స్.. ఇదో ప్రాణాంతక వ్యాధి. అయితే లిథువేనియా దేశానికి చెందిన కొందరికి మాత్రం ఎయిడ్స్ అంటే అస్సలు భయమే లేదు. ఎందుకంటే వారికి ఎయిడ్స్ అసలే సోకదు. హెచ్ఐవీ వైరస్ వారి శరీరంలోకి ప్రవేశించినా కూడా వారికి ఏమీ కాదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. లిథువేనియా ప్రజల్లో దాదాపు 16 శాతం మందికి ఎయిడ్స్ నిరోధకత కలిగి ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వారి జన్యువులు పలు పరివర్తనాలు (జీన్ మ్యుటేషన్) చెందడం వల్ల వారి నిరోధక వ్యవస్థలోకి ఎయిడ్స్ వైరస్ ప్రవేశించి నాశనం చేయలేదని వెల్లడించారు. వీరి జన్యువులను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలకు ఎయిడ్స్ వ్యాధి చికిత్స పద్ధతులు తెలుసుకునే అవకాశం కలగనుంది. -
కలత తీర్చి... కల నెరవేర్చి!
ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులు 17 మంది కలలు నెరవేర్చిన ‘మేక్ ఎ విష్ ఫౌండేషన్’ అందరిలాగానే వారికీ కొన్ని ఆశలున్నాయి...ఆశయాలు ఉన్నాయి. అవి తీరే దారి మాత్రం కనిపించలేదు. ఆ దారిని మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ చూపించింది. ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న 17 మంది చిన్నారులు కోరిన కానుకలు అందించి... సహృదయతను చాటుకుంది. ఈ క్రతువులో పోలీసులూ పాలు పంచుకున్నారు. ఆ చిన్ని కళ్లల్లో ఆనందాన్ని నింపారు. సిటీబ్యూరో: ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న కొంతమంది చిన్నారుల కలలు నెరవేర్చేందుకు ఓ సంస్థ ముందుకు వస్తే...దానికి తమవంతు సాయం అందించిన పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ దృశ్యం చూసిన బాధితుల తల్లిదండ్రులు తమ బిడ్డల పరిస్థితి తలచుకొని తల్లడిల్లుతూనే... ఆ సంస్థ... పోలీసుల దయార్ధ్ర హృదయానికి ఉప్పొంగిపోయారు. వివరాల్లోకి వెళితే... ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతూ నగరంలోని వివిధ ఆస్పత్రులలో 17 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరంతా ఎన్నో రోజులుగా కావాలనుకుంటున్న వస్తువులు...బొమ్మలను అందించేందుకు మేక్ ఎ విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ‘వరల్డ్ విష్ డే’ సందర్భంగా బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ చిన్నారులు కోరిన వస్తువులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులను ఆదుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. మనో ధైర్యం కల్పిస్తే... వారు తొందరగా కోలుకుంటారని చెప్పారు. ఇలా ధైర్యం కల్పించేందుకు యత్నిస్తున్న మేక్ ఎ విష్ ఫౌండేషన్ కృషిని అభినందించారు. డాక్టర్లు ఇంద్రసేనారెడ్డి, సదాశివుడు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులను తగ్గించే దిశగా వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. క్యాన్సర్‌ను సైతం జయించే రోజులు వచ్చాయని తెలిపారు. మందుల వినియోగంతో పాటు బాధితులకు ఆత్మస్థైర్యం కల్పిస్తే వ్యాధి నుంచి త్వరగా బయటపడతారని చెప్పారు. ఈమేరకు అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డి కలసి చిన్నారులు అవదూత్ భవాని (15), చెన్నకేశవ(17), పి.మహేష్ (17),శుభం (15), సుమేరాఫాతిమా (16), మహ్మద్ అబ్దుల్ ఖాదర్ (16), అన్కూరి పరశురాములు (16), అంకూష్ లహరి(15)లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. కె.శ్రీను (15), మహ్మద్ మునావర్అలీ (12), మాస్టర్ సాత్విక్ (16), జి.కుమార్ (15)లకు ప్లే స్టేషన్ (బొమ్మలాట)లు, జి.సంహిత్ (16), ప్రశాంత్ (13)లకు ల్యాప్‌టాప్‌లు, సంజయ్‌మోర్ (14)కు మ్యూజిక్ కీబోర్డు, పావని (17)కి ఐపాడ్, అరుణ్‌కుమార్ (7)కు ఎలక్ట్రానిక్ బైక్‌లను అందించారు. తమ పిల్లల్లో ఆనందాన్ని నింపేందుకు ఫౌండేషన్ నిర్వాహకులు, వైద్యులు, పోలీసులు చేస్తున్న కృషిని చూసిన ఆ తల్లిదండ్రులు చెమర్చిన కళ్లతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. వరంగ ల్, ఉప్పల్, అనంతపూర్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఈ చిన్నారులు నగరంలోని డయాబైడ్, ఎంఎన్‌జే, తలసీమియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ైవె ద్యులుగా... ఇంజినీర్లుగా ఎదగాలనేది తమ ఆశయమని ఆ చిన్నారులు చెప్పినపుడు అక్కడి వారి కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. తమను ఆదుకునేందుకు ఇంతమంది ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని వారంతా కృతజ్ఞతలు చెప్పారు.