Malkajgiri police station
-
న్యాయం చేయాల్సిన వాడే కన్నేశాడు
బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ఓ లాయర్ సాయం కోసం వచ్చిన యువతిపై కన్నేశాడు. ఇక ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఆ యువతి(25)కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. తను ఓ ప్రైవేట్ కంపనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. కాగా తన భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకునేందుకు సిద్దమైంది. దాంతో గతేడాది జూన్‌లో స్థానికంగా ఉండే ఓ లాయర్‌ను కలిసింది. తన భర్తతో విడాకులు ఇప్పించమని కోరింది. ఇక ఇదే అదనుగా భావించాడు ఆ లాయర్. అతని కన్ను ఆ యువతిపై పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి ఓ రోజు తన ఆఫీస్‌కు రప్పించుకున్నాడు. అలా ఆ యువతితో చనువు పెంచుకున్నాడు. అయితే అప్పటికే భర్త నుండి దూరంగా ఉండాలని భావించిన సదరు యువతి ప్రస్తుతం తాను ఉన్న ఇంటి నుంచి మరో ఇంటికి మారాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న అడ్వకేట్ తాను నివసించే ప్రాంతంలో ఓ ఫ్లాటుందని చెప్పడంతో అతడ్ని నమ్మిన యువతి ఫ్లాట్‌లోకి వచ్చి చేరింది. ఇక ఇక్కడే ఆ లాయర్ తన వంకర బుద్దిని చూపించాడు. తానొక ప్రోఫెషనల్ వృత్తిలో ఉన్న విషయం కూడా మరిచిపోయి ఆ ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. బాధితురాలు దుస్తులు మార్చుకునే వీడియోలను బాధితురాలికి చూపించి తనను బెదిరించి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఇలా తరచూ తన లైంగిక వాంఛను తీర్చుకోసాగాడు. ఇక అప్పటికే తన భర్త కారణంగా మానసిక ఆందోళనకు గురైన తనను ఇలా ఇబ్బంది పెట్టవద్దని వేడుకున్నా అతడు ఆమెను వదల్లేదు. అయితే అతడి వేధింపులు శృతిమించడంతో విసిగిపోయిన బాధితురాలు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.. -
ముక్కలుగా నరికి.. డ్రమ్ముల్లో కుక్కి
హైదరాబాద్: తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. కుటుంబసభ్యులతో కలిసి వృద్ధతండ్రిని దారుణంగా హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసి ఉంచిన సంఘటన హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏసీపీ సందీప్‌కుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్ ఆదివారం వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన కిషన్ సుతార్ మారుతి(80) రైల్వే విభాగంలో గూడ్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. 20 ఏళ్ల క్రితం మౌలాలి ఆర్టీసీ కాలనీలో స్ధిరపడ్డాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు చాలా ఏళ్ల క్రితమే అదృశ్యమయ్యాడు. పెద్ద కూతురు అనుపమ, భర్తతో కలిసి మారేడ్‌పల్లిలో ఉంటోంది. ఆర్టీసీకాలనీలో సూతార్ మారుతీ, అతని భార్య గయ, కూతురు ప్రపుల్, కుమారుడు కిషన్‌తో కలిసి ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన సుతార్ మారుతీ నిత్యం కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. కుమారుడి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈ నెల 16వ తేదీ రాత్రి పది గంటలకు మద్యం సేవించి ఇంటికి వచ్చిన సుతార్ మారుతి భార్య, కొడుకు, కూతురుతో గొడవపడ్డాడు. అదేరాత్రి సుతార్ మారుతీ హత్యకు గురయ్యాడు దుర్వాసనతో బయటపడ్డ సంఘటన రెండు రోజులుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు 100 నంబర్‌కు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ మన్మోహన్, ఎస్ఐ సంజీవరెడ్డిలు ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. సుతార్ మారుతీ మృతదేహం ముక్కలు, ముక్కలుగా ఆరు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వేసి ఉండటం చూసి ఖంగుతిన్నారు. సుతార్ మారుతీని పథకం ప్రకారమే హత్య చేసారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యులను తరచూ వేధించడం, కిషన్‌కు ఉద్యోగంలేదని గొడవపడుతుండటంతో సుతార్ మారుతీను హత్య చేసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పకడ్బందీగా మృతదేహాన్ని తరలించేందుకు కొత్తగా ఆరు ప్లాసిక్ట్ డమ్ములను వాడటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. సంఘటనాస్థలానికి వచ్చిన క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్ శునకం ఇంట్లో నుంచి కొంత దూరం వెళ్లి తిరిగివచ్చింది. పోలీసుల అదుపులో నిందితులు? నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఉద్దేశపూర్వకంగా హత్య చేశారా లేక సుతార్ మారుతీ, కిషన్ గొడ వపడినప్పుడు కిందపడి ప్రమాదవశాత్తు చనిపోతే ఎవరికీ తెలియకుండా ప్లాసిక్ట్ డ్రమ్ముల్లో తరలించడానికి ప్రయత్నించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టుపక్కలవారిని విచారించగా సుతార్ మారుతీ కుటుంబసభ్యులు ఎవరితోనూ ఎక్కువగా కలిసేవారు కాదని తెలిపారు. కుటుంబ కలహాలే కారణం: ఏసీపీ సందీప్ సుతార్ మారుతీ హత్యకు కుటుంబకలహాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని ఏసీపీ సందీప్ తెలిపారు. కొడుకుకు ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తరచూ తండ్రీకొడుకులు గొడవపడేవారన్నారు. -
ఈ బాబు... మహా ముదురు బాబూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి చెందిన ఓ మైనర్.. బైకులతో స్టంట్స్ చేయడంలో ఎక్స్పర్ట్.. అందులో మరికొందరికి శిక్షణ కూడా ఇస్తుంటాడు.. మరో ముగ్గురు బాలురతో జట్టు కట్టాడు.. ఈ స్టంట్స్ చేయడానికి, రేసింగ్స్‌లో పాల్గొనడానికి అవసరమైన బైక్‌ల కోసం చోరీల బాట పట్టారు. వాటిలో పెట్రోల్ నింపుకోవడానికి మొబైల్ ఫోన్స్ దొంగతనం చేయడం మొదలుపెట్టారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ ముఠాలోని నలుగురిని పట్టుకుని వారి గుట్టు రట్టుచేశారు. ‘సాహసాలు’అంటే మక్కువ.. హైదరాబాద్‌లోని సిద్ధార్థనగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు ఈసీఐఎల్‌లోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి ఇళ్లల్లో పని చేసుకుంటూ కొడుకును పోషిస్తోంది. బైక్‌లు నడపటంలో పట్టున్న అతడికి.. స్టంట్స్ చేయడమంటే సరదా. స్నేహితుల వద్ద నుంచి తీసుకున్న బైక్‌లతో రోడ్లపై స్టంట్స్ చేస్తుంటాడు. కేబీఆర్ పార్క్ వద్ద రేసింగ్స్ చేసేవాడు. ఉప్పల్‌లోని భగాయత్ ల్యాండ్స్‌లో ప్రతి శని, ఆదివారాల్లో స్టంట్స్ చేయడంలో యువతకు ‘శిక్షణ’కూడా ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఇతడికి తమ ఏరియాలోనే ఉండే ముగ్గురు మైనర్లతో పరిచయం ఏర్పడింది. ఈ ముఠాకు అతగాడు గ్యాంగ్‌లీడర్‌గా మారాడు. స్టంట్స్ చేయడానికి స్పోర్ట్స్‌బైక్స్.. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు స్టంట్స్ చేయాలంటే సొంతంగా స్పోర్ట్స్ బైక్ ఉండాలని సూత్రధారి భావించాడు. వాటిని ఖరీదు చేసే స్తోమత వారికి లేకపోవడంతో బైక్‌లను చోరీ చేయాలని పథకం వేశారు. ఇందుకు మరో ముగ్గురు మైనర్లనూ తమతో చేర్చుకున్నారు. వీరంతా కలసి గోల్కొండ, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి మూడు బైక్స్ చోరీ చేశారు. వీటిలో రెండు కేటీఎంలు కాగా, మరొకటి పల్సర్. వీటిపై తిరిగేందుకు కావాల్సిన పెట్రోల్ కోసం గోపాలపురం, మహంకాళి, ఎల్బీనగర్లలో సెల్ఫోన్లు దొంగతనం చేశారు. వీరు దొంగిలించిన బైకులకు తప్పుడు నంబర్ప్లేట్లు తగిలించి రోడ్డుపై వెళ్తున్న వారి నుంచి సెల్ఫోన్లు లాక్కుపోయేవారు. మల్కాజ్గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో రెండు ఫోన్లు దొంగతనం చేశారు. చిక్కినా చెప్పడు... ఈ గ్యాంగ్ సూత్రధారి అయిన మైనర్ చాలా ముదురు. పోలీసులకు చిక్కినా కూడా పూర్తి వివరాలు చెప్పేవాడు కాదు. రెండు సెల్ఫోన్లు దొంగిలించిన కేసులో మల్కాజ్గిరి పోలీసులు గత నెలలో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో చేసిన నేరాలకు సంబంధించి నోరు విప్పలేదు. గత నెల 18న సూత్రధారి సహా ముగ్గురు మైనర్లు ఓ వాహనంపై వచ్చి క్లాక్‌టవర్ వద్ద సెల్‌ఫోన్ దొంగిలించారు. దీనిపై గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సూత్రధారిని గుర్తించారు. అతడి కదలికలపై ఆరా తీయగా.. వీకెండ్స్‌లో ఉప్పల్‌లోని భగాయత్‌లో, మామూలు రోజుల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. నిఘా పెట్టిన పోలీసులు సూత్రధారితో పాటు నలుగురు మైనర్లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. -
మరణంలోనూ వీడని స్నేహం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల దుర్మరణం హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణాపురానికి చెందిన సుంకరి సురేశ్(20), పట్టం వెంకటేశ్(21), ప్రభుదేవ్(19) స్నేహితులు. పదో తరగతి వరకు కలసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం సురేశ్, వెంకటేశ్ నగరానికి వచ్చారు. సురేశ్ నాగారంలో తన అన్న తిరుపతి వద్ద ఉంటూ తార్నాకలోని ప్రైవేట్ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. వెంకటేశ్ ఘట్కేసర్లోని మేథ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూ.. నాగారంలో స్నేహితులతో కలసి ఉంటున్నాడు. ప్రభుదేవ్ సూర్యాపేటలోని ప్రైవేట్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. స్నేహితులను చూడటానికి ప్రభుదేవ్ మంగళవారం నగరానికి వచ్చాడు. ఈ సందర్భంగా నాగారంలోని వెంకటేశ్ రూమ్‌లో ముగ్గురూ కలసి పార్టీ చేసుకున్నారు. కాగా, బుధవారం తెల్లవారు జామున ఎస్పీనగర్ ప్రధాన రహదారిపై డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో ముగ్గూరు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అతి వేగంతో బైక్ నడపడంతో అదుపుచేయలేక డివైడర్‌ను ఢీ కొట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాగారం నుండి తార్నాక వైపు వెళుతుండగా ప్రమాదం జరిగిందని, ప్రభుదేవ్‌ను బస్టాండ్‌లో దించడానికి వె ళుతుండగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నాకు కూడా తెలియదు: రూమ్మేట్ ప్రసాద్ వారు ముగ్గురూ తెల్లవారుజామున బయటకు వెళ్లిన విషయం తనకు కూడా తెలియదని వెంకటేశ్ రూమ్మేట్ ప్రసాద్ చెప్పాడు. తన బైక్ తాళం తీసుకెళ్లారని, రూమ్ తలుపు కూడా వేసిఉండటంతో ఇరుగుపొరుగువారు తలుపు తీశారని తెలిపాడు. సురేశ్ అన్న తిరుపతి మాట్లాడుతూ.. తన వద్దనే ఉండి సురేశ్ చదువుకుంటున్నాడని, అప్పుడప్పుడు వెంకటేశ్ రూమ్‌కు వెళ్లి వచ్చేవాడని చెప్పాడు. మంగళవారం రాత్రి ఇంటికి రాలేదని, ఆ రోజే తన తమ్ముడికి చివరిరోజు అవుతుందని ఊహించలేదని అతను రోదించాడు.