హత్యకు గురైన సుతార్ మారుతి(ఫైల్)
హైదరాబాద్: తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. కుటుంబసభ్యులతో కలిసి వృద్ధతండ్రిని దారుణంగా హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసి ఉంచిన సంఘటన హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏసీపీ సందీప్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ ఆదివారం వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన కిషన్ సుతార్ మారుతి(80) రైల్వే విభాగంలో గూడ్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. 20 ఏళ్ల క్రితం మౌలాలి ఆర్టీసీ కాలనీలో స్ధిరపడ్డాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు చాలా ఏళ్ల క్రితమే అదృశ్యమయ్యాడు. పెద్ద కూతురు అనుపమ, భర్తతో కలిసి మారేడ్‌పల్లిలో ఉంటోంది.
ఆర్టీసీకాలనీలో సూతార్ మారుతీ, అతని భార్య గయ, కూతురు ప్రపుల్, కుమారుడు కిషన్‌తో కలిసి ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన సుతార్ మారుతీ నిత్యం కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. కుమారుడి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈ నెల 16వ తేదీ రాత్రి పది గంటలకు మద్యం సేవించి ఇంటికి వచ్చిన సుతార్ మారుతి భార్య, కొడుకు, కూతురుతో గొడవపడ్డాడు. అదేరాత్రి సుతార్ మారుతీ హత్యకు గురయ్యాడు
దుర్వాసనతో బయటపడ్డ సంఘటన
రెండు రోజులుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు 100 నంబర్‌కు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ మన్మోహన్, ఎస్‌ఐ సంజీవరెడ్డిలు ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. సుతార్ మారుతీ మృతదేహం ముక్కలు, ముక్కలుగా ఆరు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వేసి ఉండటం చూసి ఖంగుతిన్నారు. సుతార్ మారుతీని పథకం ప్రకారమే హత్య చేసారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యులను తరచూ వేధించడం, కిషన్‌కు ఉద్యోగంలేదని గొడవపడుతుండటంతో సుతార్ మారుతీను హత్య చేసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పకడ్బందీగా మృతదేహాన్ని తరలించేందుకు కొత్తగా ఆరు ప్లాసిక్ట్ డమ్ములను వాడటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. సంఘటనాస్థలానికి వచ్చిన క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్ శునకం ఇంట్లో నుంచి కొంత దూరం వెళ్లి తిరిగివచ్చింది.
పోలీసుల అదుపులో నిందితులు?
నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఉద్దేశపూర్వకంగా హత్య చేశారా లేక సుతార్ మారుతీ, కిషన్ గొడ వపడినప్పుడు కిందపడి ప్రమాదవశాత్తు చనిపోతే ఎవరికీ తెలియకుండా ప్లాసిక్ట్ డ్రమ్ముల్లో తరలించడానికి ప్రయత్నించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టుపక్కలవారిని విచారించగా సుతార్ మారుతీ కుటుంబసభ్యులు ఎవరితోనూ ఎక్కువగా కలిసేవారు కాదని తెలిపారు.
కుటుంబ కలహాలే కారణం: ఏసీపీ సందీప్
సుతార్ మారుతీ హత్యకు కుటుంబకలహాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని ఏసీపీ సందీప్ తెలిపారు. కొడుకుకు ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తరచూ తండ్రీకొడుకులు గొడవపడేవారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment