మృతిచెందిన భార్గవ్, భార్గవ్ (ఫైల్)
కాజీపేట అర్బన్ /లింగాలఘణపురం : జనగామ, సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల సమీపంలోని ఆర్టీసీ కాలనీ వద్ద శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని వరంగల్ నిట్‌లో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న నల్గొండ జిల్లాకు చెందిన కేతావత్ భార్గవ్ (20) దుర్మరణం చెందాడు. ఏఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దామెరచర్ల మండలం జిలావర్పూర్ శివారు గ్రామమైన కేతావత్తండాకు చెందిన కేతావత్ భార్గవ్ మిర్యాలగూడలో ఉంటున్న తల్లిదండ్రులు సైదమ్మ, సీతారాంనాయక్‌లను చూసేందుకు గురువారం హోండా ఎఫ్‌జెడ్ ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తల్లిదండ్రులను చూసిన భార్గవ్ రాత్రి 1.30గంటల సమయంలో మిర్యాలగూడ నుంచి అదే వాహనంపై వరంగల్ నిట్ కళాశాలకు బయలుదేరాడు.
శుక్రవారం తెల్లవారు జామున సుమారు 4.30 గంటల సమయంలో నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ కల్వర్టు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. చీటూరు నుంచి జనగామకు వెళ్తున్న టాటాఏస్ డ్రైవర్ ప్రమాదానికి సంబంధించి వివరాలను ఇంట్రాసెక్టార్, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. తలకు బలమైన గాయం కావడంతో రోడ్డంతా రక్తసిక్తమై అక్కడికక్కడే భార్గవ్ మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భోరున విలపించారు. కాగా ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు నవాబుపేట, నెల్లుట్ల, జనగామలోని సీసీ కెమెరాల పూటేజీలను పరిశీలిస్తున్నారు. నవాబుపేట సీసీ కెమెరాల పుటేజీలో భార్గవ్ 4.05 గంటలకు అక్కడి నుంచి వచ్చినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment