nit Student Death
-
కేరళ ఎన్ఐటీలో కూకట్పల్లి విద్యార్థి అనుమానాస్పదస్థితి మృతి.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: కేరళ కోజికోడ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)–కాలికట్లో విద్యనభ్యసిస్తున్న నగర యువకుడు చెన్నుపాటి యశ్వంత్ (22) అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఇది ఆత్మహత్య అని, దానికి సంబంధించిన సూసైడ్ నోట్ లభించిందని యాజమాన్యం ప్రకటించింది. అయితే, యశ్వంత్ తండ్రి నాగేశ్వరరావు దీన్ని ఖండించారు. సూసైడ్ నోట్లోని చేతిరాత తన కుమారుడిది కాదని చెప్పారు. తన కుమారుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.7 లక్షలు కాజేసిన హాస్టల్ మేట్స్ అతడిని భవనంపై నుంచి తోసి చంపారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. దర్యాప్తు పూర్తి కాకుండానే ప్రకటన సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో యశ్వంత్ హాస్టల్లోని తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం సమాచారమిచ్చింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే ఎన్ఐటీ యాజమాన్యం ఫిర్యాదుతో అనుమానాస్పద స్థితిగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యశ్వంత్ రాసినట్లు చెబుతున్న ఓ లేఖ అతడి గదిలో దొరికింది. దీనిపై దర్యాప్తు పూర్తి కాకుండానే ఎన్ఐటీ యాజమాన్యం యశ్వంత్‌ది ఆత్మహత్యగా తేల్చేసింది. ఆన్లైన్ ట్రేడింగ్‌లో నష్టపోయాడని, దీంతోపాటు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంది. దీంతో తన కుమారుడి కేసు దర్యాప్తు పక్కాగా సాగేలా చూడాలంటూ నాగేశ్వరరావు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా కేరళ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (సీఎంఓ) కోరారు. కుమారుడి పేరుతో ట్రేడింగ్ ఖాతా ఏపీలోని గుంటూరుకు చెందిన చెన్నుపాటి నాగేశ్వరరావు కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కూకట్‌పల్లిలో స్థిరపడ్డారు. ఈయన కుమారుడు యశ్వంత్‌కు గతేడాది ఐఐటీ–గాంధీనగర్పాటు ఎన్ఐటీ కాలికట్లోనూ సీటు వచ్చింది. కంప్యూటర్ సైన్స్‌పై ఆసక్తి ఉండటంతో ఎన్ఐటీ కాలికట్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం సీఎస్ఈలో మూడు సెమిస్టర్లు పూర్తి చేశారు. క్లాస్ టాపర్‌గా ఉన్న ఈయన రిప్రజెంటేటివ్‌గానూ ఎన్నికయ్యారు. నాగేశ్వరరావు కొన్నాళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నారు. తన పేరుతో ఒక ట్రేడింగ్ ఖాతా చాన్నాళ్లుగా ఉండటంతో కొద్దిరోజుల క్రితం యశ్వంత్ పేరుతో మరో ఖాతా తెరిచారు. దీన్ని నగరంలో ఉంటున్న నాగేశ్వరరావే నిర్వహిస్తున్నారు. మూడు నెలల క్రితం ఈ ఖాతాలో రూ.20 లక్షలు డిపాజిట్ చేసిన ఆయన దాని నుంచి రూ.13 లక్షలు తన డీ–మ్యాట్ ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. మిగిలిన రూ.ఏడు లక్షలు మూడు నెలలుగా యశ్వంత్ ఖాతాలోనే ఉన్నాయి. రూ.ఏడు లక్షలు వివిధ ఖాతాల్లోకి... యశ్వంత్ మృతిపై అనుమానాలు ఉండటంతో నాగేశ్వరరావు అతడి బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలించారు. దీంతో పలు అనుమానాస్పద అంశాలు ఆయన దృష్టికి వచ్చాయి. యశ్వంత్‌కు రూ.100 అవసరమైనా తమకు చెప్పే తీసుకుంటాడని నాగేశ్వరరావు తెలిపారు. అయితే శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం యశ్వంత్ ఖాతా నుంచి జరిగిన 20 లావాదేవీల్లో రూ.7 లక్షలు వేరే ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. అవన్నీ అతడి రూమ్ మేట్స్‌తోపాటు అదే హాస్టల్లో ఉండే వారి ఖాతాలుగా నాగేశ్వరరావు చెప్పారు. యశ్వంత్ సొమ్ము కాజేసిన వాళ్లే ఎవరికీ తెలియకుండా ఉండటానికి హాస్టల్ పైనుంచి తోసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తంచేశారు. ఎన్ఐటీ పరువు పోతుందనే ఉద్దేశంతో కేసును నీరు గార్చేందుకు యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ‘నేను మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసిన తర్వాత కేరళ ఏసీపీ నన్ను కలిశారు. మా అనుమానాలను ఆయనకు చెప్పడంతోపాటు యశ్వంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. పోస్టుమార్టం అనంతరం ఎఫ్ఐఆర్ కాపీ, ఎన్ఓసీ మాకు ఇచ్చారు. దహనసంస్కారాలు పూర్తయ్యాక రావాలని సూచించారు’అని నాగేశ్వరరావు చెప్పారు. -
నిట్‌లో ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య
కాజీపేట అర్బన్: వరంగల్ నిట్‌లోని ఓ హాస్టల్లో మంగళవారం ఎంటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాజీపేట ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్, సహచర విద్యార్థుల కథనం ప్రకారం.. నిట్‌లో ఎంటెక్ మొదటి సంవత్సరంలో త్రిపుల్ఈ విభాగంలోని పవర్‌సిస్టం ఇంజినీరింగ్ చదువుతున్న అమిత్‌కుమార్(31) 1.8కె అల్రామె గా హాస్టల్లోని ఎ8–27గదిలో ఉంటున్నాడు. రెండు రోజుల నుంచి తన తండ్రికి ఫోన్లో అందు బాటులోకి రాలేదు. దీంతో అమిత్‌కుమార్ పక్క గదిలో ఉంటున్న మిత్రుడు రాహుల్‌కు ఉదయం 11 గంటలకు శంకర్ ప్రసాద్ ఫోన్ చేసి అమిత్‌ను ఓసారి మాట్లాడించమని తెలిపాడు. దీంతో రాహుల్‌తో పాటు మరికొందరు విద్యార్థులు అమిత్ గది వద్దకు వెళ్లారు. తలుపు తట్టగా తలుపు లోపల గడియ పెట్టి ఉంది. దీంతో విద్యార్థులు బలవంతంగా తలుపులు తెరచి చూసే సరికి సీలింగ్ ఫ్యాన్‌కు టవల్‌తో అమిత్‌కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు నిట్ యాజమాన్యానికి, కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అమిత్‌కుమార్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా పోలీసులు అమిత్‌కుమార్ ఆత్మహత్య విషయం తల్లిదండ్రులు శంకర్‌ప్రసాద్, లలితాదేవికి తెలిపారు. దీంతో వారు హుటాహుటిన బీహార్ నుంచి వరంగల్‌కు బయలుదేరారు. మానసిక ఒత్తిడితోనేనా? అమిత్‌కుమార్ ఎంటెక్ సెమిస్టర్ పరీక్షలో ఫెయిల్ అయినందు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. డిసెంబర్లో జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కాగా జూన్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఉతీర్ణత సాధించాడు. కాగా మొదిటి సెమిస్టర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు తాత్కాలికంగా స్టైఫండ్‌ను నిలిపివేస్తారు. దీంతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు అనుమానిస్తున్నారు. -
‘నిట్’ విద్యార్థి దుర్మరణం
కాజీపేట అర్బన్ /లింగాలఘణపురం : జనగామ, సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల సమీపంలోని ఆర్టీసీ కాలనీ వద్ద శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని వరంగల్ నిట్‌లో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న నల్గొండ జిల్లాకు చెందిన కేతావత్ భార్గవ్ (20) దుర్మరణం చెందాడు. ఏఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దామెరచర్ల మండలం జిలావర్పూర్ శివారు గ్రామమైన కేతావత్తండాకు చెందిన కేతావత్ భార్గవ్ మిర్యాలగూడలో ఉంటున్న తల్లిదండ్రులు సైదమ్మ, సీతారాంనాయక్‌లను చూసేందుకు గురువారం హోండా ఎఫ్‌జెడ్ ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తల్లిదండ్రులను చూసిన భార్గవ్ రాత్రి 1.30గంటల సమయంలో మిర్యాలగూడ నుంచి అదే వాహనంపై వరంగల్ నిట్ కళాశాలకు బయలుదేరాడు. శుక్రవారం తెల్లవారు జామున సుమారు 4.30 గంటల సమయంలో నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ కల్వర్టు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. చీటూరు నుంచి జనగామకు వెళ్తున్న టాటాఏస్ డ్రైవర్ ప్రమాదానికి సంబంధించి వివరాలను ఇంట్రాసెక్టార్, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. తలకు బలమైన గాయం కావడంతో రోడ్డంతా రక్తసిక్తమై అక్కడికక్కడే భార్గవ్ మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భోరున విలపించారు. కాగా ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు నవాబుపేట, నెల్లుట్ల, జనగామలోని సీసీ కెమెరాల పూటేజీలను పరిశీలిస్తున్నారు. నవాబుపేట సీసీ కెమెరాల పుటేజీలో భార్గవ్ 4.05 గంటలకు అక్కడి నుంచి వచ్చినట్లు గుర్తించారు. -
విహారయాత్రలో విషాదం..
రిజర్వాయర్‌లో నిట్ విద్యార్థి మృతి ధర్మసాగర్: స్నేహితులతో కలసి విహారానికి వచ్చిన ఆ విద్యార్థి అంతలోనే నీట మునిగి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామానికి చెందిన సామినేని వాసు, శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్. వీరిలో నిఖిల్ (22) వరంగల్ నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఈసీఈ ఫైనలియర్ చదువుతున్నాడు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భం గా నిట్‌లో జరిగిన జెండావిష్కరణలో పాల్గొన్న అనంతరం ఆరుగురు మిత్రులతో కలిసి ఎన్ఐటీకి 10 కిలోమీటర్ల దూరంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌కు విహారం కోసం వెళ్లారు. రిజర్వాయర్ వద్ద మిత్రులతో కలసి నిఖిల్ కొద్దిసేపు సరదాగా గడిపాడు. అనంతరం జాలర్లు చేపలు పట్టడానికి ఉపయోగించే తెప్పను తీసుకుని ఒంటరిగా నీటిలో కొద్దిదూరం వెళ్లి ఫొటోలు దిగటానికి ప్రయత్నిస్తుండగా తెప్ప పట్టు తప్పంది. ఆ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండ టం, నిఖిల్‌కు ఈత రాకపోవటంతో ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీంతో వీరిలో మిగతా ఇద్దరు విద్యార్థులతోపాటు, వీరి అరుపులు విని వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు అతడిని రక్షించటానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే నిఖిల్ నీటిలో పూర్తిగా మునిగి మృతి చెందాడు. ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న కాజీపేట ఏసీపీ జనార్దన్, సీఐ రాజయ్య ఘట నాస్థలానికి చేరుకుని స్థానిక జాలర్ల సహకారంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. విగతజీవిగా మారిన నిఖిల్‌ను చూసి మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక క్యాంపస్‌కు చెందిన విద్యార్థి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న నిట్ డైరక్టర్ శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న సామినేని నిఖిల్ క్యాంపస్ ఇంటర్యూలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం పొందాడని, ఈ సెమిస్టర్ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరాల్సి ఉందని తెలిపారు. తెలివైన విద్యార్థిగా పేరుపొంది, ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న నిఖిల్ మృతి చెందటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.