విహారయాత్రలో విషాదం..
రిజర్వాయర్‌లో నిట్ విద్యార్థి మృతి
ధర్మసాగర్: స్నేహితులతో కలసి విహారానికి వచ్చిన ఆ విద్యార్థి అంతలోనే నీట మునిగి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామానికి చెందిన సామినేని వాసు, శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్. వీరిలో నిఖిల్ (22) వరంగల్ నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఈసీఈ ఫైనలియర్ చదువుతున్నాడు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భం గా నిట్‌లో జరిగిన జెండావిష్కరణలో పాల్గొన్న అనంతరం ఆరుగురు మిత్రులతో కలిసి ఎన్‌ఐటీకి 10 కిలోమీటర్ల దూరంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌కు విహారం కోసం వెళ్లారు. రిజర్వాయర్ వద్ద మిత్రులతో కలసి నిఖిల్ కొద్దిసేపు సరదాగా గడిపాడు.
అనంతరం జాలర్లు చేపలు పట్టడానికి ఉపయోగించే తెప్పను తీసుకుని ఒంటరిగా నీటిలో కొద్దిదూరం వెళ్లి ఫొటోలు దిగటానికి ప్రయత్నిస్తుండగా తెప్ప పట్టు తప్పంది. ఆ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండ టం, నిఖిల్‌కు ఈత రాకపోవటంతో ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీంతో వీరిలో మిగతా ఇద్దరు విద్యార్థులతోపాటు, వీరి అరుపులు విని వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు అతడిని రక్షించటానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే నిఖిల్ నీటిలో పూర్తిగా మునిగి మృతి చెందాడు. ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న కాజీపేట ఏసీపీ జనార్దన్, సీఐ రాజయ్య ఘట నాస్థలానికి చేరుకుని స్థానిక జాలర్ల సహకారంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. విగతజీవిగా మారిన నిఖిల్‌ను చూసి మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక
క్యాంపస్‌కు చెందిన విద్యార్థి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న నిట్ డైరక్టర్ శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న సామినేని నిఖిల్ క్యాంపస్ ఇంటర్యూలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం పొందాడని, ఈ సెమిస్టర్ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరాల్సి ఉందని తెలిపారు. తెలివైన విద్యార్థిగా పేరుపొంది, ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న నిఖిల్ మృతి చెందటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.