సాక్షి, హైదరాబాద్: కేరళ కోజికోడ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)–కాలికట్‌లో విద్యనభ్యసిస్తున్న నగర యువకుడు చెన్నుపాటి యశ్వంత్ (22) అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఇది ఆత్మహత్య అని, దానికి సంబంధించిన సూసైడ్ నోట్ లభించిందని యాజమాన్యం ప్రకటించింది.
అయితే, యశ్వంత్ తండ్రి నాగేశ్వరరావు దీన్ని ఖండించారు. సూసైడ్ నోట్‌లోని చేతిరాత తన కుమారుడిది కాదని చెప్పారు. తన కుమారుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.7 లక్షలు కాజేసిన హాస్టల్ మేట్స్ అతడిని భవనంపై నుంచి తోసి చంపారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన ‘సాక్షి’తో చెప్పారు.
దర్యాప్తు పూర్తి కాకుండానే ప్రకటన
సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో యశ్వంత్ హాస్టల్లోని తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం సమాచారమిచ్చింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే ఎన్‌ఐటీ యాజమాన్యం ఫిర్యాదుతో అనుమానాస్పద స్థితిగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
యశ్వంత్ రాసినట్లు చెబుతున్న ఓ లేఖ అతడి గదిలో దొరికింది. దీనిపై దర్యాప్తు పూర్తి కాకుండానే ఎన్‌ఐటీ యాజమాన్యం యశ్వంత్‌ది ఆత్మహత్యగా తేల్చేసింది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నష్టపోయాడని, దీంతోపాటు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంది. దీంతో తన కుమారుడి కేసు దర్యాప్తు పక్కాగా సాగేలా చూడాలంటూ నాగేశ్వరరావు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా కేరళ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (సీఎంఓ) కోరారు.
కుమారుడి పేరుతో ట్రేడింగ్ ఖాతా
ఏపీలోని గుంటూరుకు చెందిన చెన్నుపాటి నాగేశ్వరరావు కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కూకట్‌పల్లిలో స్థిరపడ్డారు. ఈయన కుమారుడు యశ్వంత్‌కు గతేడాది ఐఐటీ–గాంధీనగర్‌పాటు ఎన్‌ఐటీ కాలికట్‌లోనూ సీటు వచ్చింది. కంప్యూటర్ సైన్స్‌పై ఆసక్తి ఉండటంతో ఎన్‌ఐటీ కాలికట్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం సీఎస్‌ఈలో మూడు సెమిస్టర్లు పూర్తి చేశారు. క్లాస్ టాపర్‌గా ఉన్న ఈయన రిప్రజెంటేటివ్‌గానూ ఎన్నికయ్యారు.
నాగేశ్వరరావు కొన్నాళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నారు. తన పేరుతో ఒక ట్రేడింగ్ ఖాతా చాన్నాళ్లుగా ఉండటంతో కొద్దిరోజుల క్రితం యశ్వంత్ పేరుతో మరో ఖాతా తెరిచారు. దీన్ని నగరంలో ఉంటున్న నాగేశ్వరరావే నిర్వహిస్తున్నారు. మూడు నెలల క్రితం ఈ ఖాతాలో రూ.20 లక్షలు డిపాజిట్ చేసిన ఆయన దాని నుంచి రూ.13 లక్షలు తన డీ–మ్యాట్ ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. మిగిలిన రూ.ఏడు లక్షలు మూడు నెలలుగా యశ్వంత్ ఖాతాలోనే ఉన్నాయి.
రూ.ఏడు లక్షలు వివిధ ఖాతాల్లోకి...
యశ్వంత్ మృతిపై అనుమానాలు ఉండటంతో నాగేశ్వరరావు అతడి బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలించారు. దీంతో పలు అనుమానాస్పద అంశాలు ఆయన దృష్టికి వచ్చాయి. యశ్వంత్‌కు రూ.100 అవసరమైనా తమకు చెప్పే తీసుకుంటాడని నాగేశ్వరరావు తెలిపారు. అయితే శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం యశ్వంత్ ఖాతా నుంచి జరిగిన 20 లావాదేవీల్లో రూ.7 లక్షలు వేరే ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. అవన్నీ అతడి రూమ్ మేట్స్‌తోపాటు అదే హాస్టల్లో ఉండే వారి ఖాతాలుగా నాగేశ్వరరావు చెప్పారు.
యశ్వంత్ సొమ్ము కాజేసిన వాళ్లే ఎవరికీ తెలియకుండా ఉండటానికి హాస్టల్ పైనుంచి తోసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తంచేశారు. ఎన్‌ఐటీ పరువు పోతుందనే ఉద్దేశంతో కేసును నీరు గార్చేందుకు యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ‘నేను మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసిన తర్వాత కేరళ ఏసీపీ నన్ను కలిశారు. మా అనుమానాలను ఆయనకు చెప్పడంతోపాటు యశ్వంత్ బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాం. పోస్టుమార్టం అనంతరం ఎఫ్‌ఐఆర్ కాపీ, ఎన్‌ఓసీ మాకు ఇచ్చారు. దహనసంస్కారాలు పూర్తయ్యాక రావాలని సూచించారు’అని నాగేశ్వరరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment