మరణంలోనూ వీడని స్నేహం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల దుర్మరణం
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణాపురానికి చెందిన సుంకరి సురేశ్(20), పట్టం వెంకటేశ్(21), ప్రభుదేవ్(19) స్నేహితులు. పదో తరగతి వరకు కలసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం సురేశ్, వెంకటేశ్ నగరానికి వచ్చారు. సురేశ్ నాగారంలో తన అన్న తిరుపతి వద్ద ఉంటూ తార్నాకలోని ప్రైవేట్ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు.
వెంకటేశ్ ఘట్‌కేసర్‌లోని మేథ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూ.. నాగారంలో స్నేహితులతో కలసి ఉంటున్నాడు. ప్రభుదేవ్ సూర్యాపేటలోని ప్రైవేట్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. స్నేహితులను చూడటానికి ప్రభుదేవ్ మంగళవారం నగరానికి వచ్చాడు. ఈ సందర్భంగా నాగారంలోని వెంకటేశ్ రూమ్‌లో ముగ్గురూ కలసి పార్టీ చేసుకున్నారు. కాగా, బుధవారం తెల్లవారు జామున ఎస్పీనగర్ ప్రధాన రహదారిపై డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో ముగ్గూరు ప్రాణాలు కోల్పోయారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అతి వేగంతో బైక్ నడపడంతో అదుపుచేయలేక డివైడర్‌ను ఢీ కొట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాగారం నుండి తార్నాక వైపు వెళుతుండగా ప్రమాదం జరిగిందని, ప్రభుదేవ్‌ను బస్టాండ్‌లో దించడానికి వె ళుతుండగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నాకు కూడా తెలియదు: రూమ్‌మేట్ ప్రసాద్
వారు ముగ్గురూ తెల్లవారుజామున బయటకు వెళ్లిన విషయం తనకు కూడా తెలియదని వెంకటేశ్ రూమ్‌మేట్ ప్రసాద్ చెప్పాడు. తన బైక్ తాళం తీసుకెళ్లారని, రూమ్ తలుపు కూడా వేసిఉండటంతో ఇరుగుపొరుగువారు తలుపు తీశారని తెలిపాడు. సురేశ్ అన్న తిరుపతి మాట్లాడుతూ.. తన వద్దనే ఉండి సురేశ్ చదువుకుంటున్నాడని, అప్పుడప్పుడు వెంకటేశ్ రూమ్‌కు వెళ్లి వచ్చేవాడని చెప్పాడు. మంగళవారం రాత్రి ఇంటికి రాలేదని, ఆ రోజే తన తమ్ముడికి చివరిరోజు అవుతుందని ఊహించలేదని అతను రోదించాడు.