‘గని కార్మిక సంఘం’లో గందరగోళం
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని మల్కాపూర్ గని కార్మిక సంఘం కార్యాలయంలో గురువారం గందరగోళం నెలకొంది. మెజార్టీ సభ్యులైన నలుగురు డెరైక్టర్లు మొగులాన్, ఉల్లి నర్సిములు, జట్టూరి నాగయ్య, పోత్రెపల్లి పండరీలు కలిసి సొసైటీ చైర్మన్ రాములు, వైస్‌చైర్మన్ పండరీలపై వికారాబాద్‌లోని కో ఆపరేటివ్ అధికారి నాగేశ్వర్రావుకు బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రతిని అందజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్లు తమకు సమాచారం ఇవ్వకుండానే సొసైటీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన డెరైక్టర్లు ఆరోపించారు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన డెరైక్టర్లను గురువారం సొసైటీ కార్యాలయంలో చైర్మన్ రాములు, వైస్ చైర్మన్ పండరీలతో పాటు సొసైటీ సభ్యులు నిలదీశారు. చైర్మన్‌పై ఆరోపణలు నిరూపించాలని వారు పట్టుబట్టారు. డబ్బులు తీసుకుని ప్రభుత్వ భూమిని రైల్వేమార్గం కోసం అమ్మినట్లు రుజువు చూపించాలని కోరారు. దీంతో ఇరు వర్గాల డెరైక్టర్ల మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. సదరు నలుగురు డెరైక్టర్లను సొసైటీ సభ్యులు చుట్టుముట్టారు. దీంతో డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది వాస్తవమేనని వారు అంగీకరించారు. చైర్మన్, వైస్ చైర్మన్లు అక్రమాలకు పాల్పడినట్లు తాము అనలేదంటూ సదరు డెరైక్టర్లు అక్కణ్నుంచి నిష్ర్కమించారు.
ఇది రాజకీయ కుట్ర: వైస్ చైర్మన్ పండరీ
మల్కాపూర్ గని కార్మిక సంఘం కార్యాలయంపై కొంతమంది గిట్టనివారు కుట్రతో రాజకీయం చేస్తున్నారని సొసైటీ వైస్ చైర్మన్ పండరీ విమర్శించారు.
మూడు దశాబ్దాలుగా సొసైటీలో ఎన్ని అక్రమాలు జరిగినా వారు ఎందుకు నోరు మెదపలేదంటూ ఆయన ప్రశ్నించారు. కొంతమంది నాయకులు రాజకీయ కుట్రతో సొసైటీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.