ఇంటికి వెళ్లి వస్తామంటే ఊరుకోను ఇక్కడే..
► గర్భిణిని లంచం డిమాండ్ చేసిన వైద్యుడు
► పసిపిల్లలను ఇవ్వాలన్నా సొమ్ము ఇవ్వాల్సిందే
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఒక వైద్యుడు మానవత్వ లేకుండా ప్రవర్తించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఖోయిరాపుట్ సమితి బొండాçఘాట్‌లోని మందిలిపొడియా గ్రామంలోని బొండా తెగకు చెందిన గిరిజన మహిళ గురుసీసా రెండోసారి గర్భం దాల్చింది. కడుపులో కవలలు ఉన్నట్టు గ్రామంలో మంత్రసాని తెలిపింది. నెలలు నిండిన ఆమెను ప్రసవం కోసం మంగళవారం ఆమె భర్త, తమ్ముడు మల్కన్‌గిరి ఆస్పత్రికి తీసుకువచ్చారు.
ఆ సమయంలో విదుల్లో ఉన్న వైద్యుడు నిర్మల్‌నాయక్ ఆమెను పరీక్షించి వెంటనే ఆపరేషన్ చేయాలి..రూ. ఐదువేలు ఇవ్వండి..లేకుంటే ఆపరేషన్ చేయనని చెప్పాడు. దీంతో ఏమీ తోచక గర్భిణితో పాటు భర్త, సోదరుడు అరగంట సేపు అలానే ఉన్నారు. గురుసీసాకు చికిత్స అందించండి అని వేడుకున్నారు. వైద్యుడు రూ.మూడు వేలు ఇవ్వమన్నాడు. ఇంటికి వెళ్లి వస్తామంటే ఊరుకోను ఇక్కడే ఇవ్వాలని వైద్యుడు తెగేసి చెప్పాడు. దీంతో గురుసీసా తమ్ముడు అక్కడ ఎవరినో అడిగి రెండు వేల రూపాయలు ఇవ్వడంతో వైద్యుడు ఆపరేషన్ చేశాడు.
పిల్లలు ఇద్దరూ క్షేమంగా∙పుట్టారు. కానీ తక్కువ బరువు ఉండడంతో పిల్లలను ఐసీయూలో పెట్టారు. అయితే మిగతా మూడు వేలు ఇస్తేనే పిల్లలను అప్పగిస్తామని వైద్యుడు చెప్పాడు. డబ్బులు ఇవ్వకపోతే పిల్లలు చనిపోయారని సర్టిఫికెట్ ఇస్తానని బెదిరించాడు.
స్పందించిన ఎమ్మెల్యే
దీంతో గురుసీసా భర్త వెంటనే మల్కన్‌గిరి ఎమ్మెల్యే మనాస్మడకామిని కలిసి విషయం తెలియజేశాడు. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఆస్పత్రికి చేరుకుని సీడీఎంఓ ఉదయ్ చంద్రమిశ్రా, ఎడీఎం రఘుమణి గొమాంగోలతో కలిసి వార్డుకు వచ్చి గురుసీసా భర్తను విషయం అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలను పరిశీలించారు. అనంతరం వైద్యుడు నిర్మల్నాయక్ను ఆ వార్డులో విధుల నుంచి సీడీఎంఓ తొలగించారు.
అనంతరం సీడీఎంఓ ఉదయ్ చంద్ర మిశ్రో మాట్లాడుతూ నిర్మల్నాయక్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ అందుబాటులో లేరు. ఆయన వస్తే వైద్యుడ్ని సస్పెండ్ చేయిస్తాం..ఇకపై ఎక్కడా ఇలా ప్రవర్తించకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మానాన్మాడకమి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అందాల్సిన పథకాలన్నీ త్వరలోనే గురుసీసాకు అందజేసి వైద్యునిపై చర్య తీసుకుంటామని చెప్పారు.