మాజీ మంత్రి మల్కోడ్ మాణిక్రావు మృతి
♦ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే
♦ రెండు సార్లు ఎమ్మెల్సీ గెలుపు
♦ 14 ఏళ్లు వివిధ శాఖల మంత్రి
తాండూరు (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మల్కోడ్ మాణిక్రావు (86) అస్తమించారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య శశిప్రభ, రమేష్, సురేష్, దీనేష్(మృతి చెందారు) ఇద్దరు కూతుళ్లు, ఉన్నారు. పీవీ.నర్సింహ్మారావు, జలగం వెంగళరావు, చెన్నారెడ్డిల ప్రభుత్వంలో దాదాపు 14 ఏళ్లు ఆయన వివిధ శాఖల మంత్రి పని చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మాణిక్రావు చురుకైన పాత్ర పోషించారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలకంగా పని చేశారు. 1964లో ఏకగ్రీవంగా తొలిసారి, 2007లో రెండోసారి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1969లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో మాణిక్రావు మొదటిసారి రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి ముఖ్యమంత్రి పీవీ.నర్సింహ్మారావు మంత్రివర్గంలో మున్సిపల్ శాఖ మంత్రి పని చేశారు. 1972లో రెండోసారి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికై జలగం వెంగళరావు మంత్రివర్గంలో వాణిజ్య,సమాచార శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1978లో మూడోసారి శాసనసభకు ఎన్నికైన మాణిక్రావు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్అండ్బీ, వాణిజ్య శాఖల మంత్రి పని చేశారు. 1983లో నాల్గోసారి తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన అజయం పొందారు. క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర,జాతీయ కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తాండూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గత ఏడాది కాలంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సోమాజిగుడలోని నివాసంలో ఇంట్లో భార్య శశిప్రభతో కలిసి ఉంటున్నారు. 8నెలల క్రితం ఆయనకు పక్షపాతం వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. రెండు నెలలుగా శ్వాస తీసుకోవడంలో మాణిక్రావు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో వారం రోజుల క్రితం కుటుంసభ్యులు హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మాణిక్రావు గురువారం ఉదయం 7గంటలకు మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే తరుచూ సన్నిహితుల వద్ద ఆయన ప్రస్తావించే వారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో తన కల సాకారం అయ్యిందని మాణిక్రావు సంతోషపడ్డారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఆయన మృతి కాంగ్రెస్కు తీరని లోటని స్థానిక కాంగ్రెస్ నేతలు అన్నారు. తాండూరులో ఆయన అంత్యక్రియలు జరిగాయి.