మల్లేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
గోకవరం/గండేపల్లి: అతివేగం, నిర్లక్ష్యం నాలుగు నిండుప్రాణాలను బలితీసుకున్నది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారు జీడి పిక్కల ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం, ఉండ్రాజవరం, ఏలూరు జిల్లా ఉంగుటూరు తదితర గ్రామాల నుంచి సుమారు 13 మంది అనకాపల్లి జిల్లా కశింకోటలో పరమటమ్మతల్లి జాతరలో ప్రదర్శన ఇచ్చేందుకు టాటా మేజిక్ వాహనంలో బయలు దేరారు.
వీరు ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు గండేపల్లి మండలం మల్లేపల్లి వచ్చే సరికి హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ ట్రాలీని అతి వేగంతో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన దుబ్బాకుల ప్రసాద్ (47) అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లజర్లకు చెందిన డ్రైవర్ నల్లకాసుల వెంకట్రావు (కొండ) (28), నల్లజర్ల మండలం నబీపట గ్రామానికి చెందిన పెనుపాక గుబ్బల మంగమ్మ (30) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా, ఉండ్రాజవరం మండలం చివటంకు చెందిన గారపాటి మహేష్ (20), రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఘటనా స్థలాన్ని బుధవారం పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్ పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ వాహనం డ్రైవర్ అతివేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందన్నారు. కాగా, టాటా మేజిక్ వాహనం ట్రాలీని ఢీకొట్టి డ్రైవర్‌తో సహా ఇరుక్కుపోగా.. సుమారు అరగంట పాటు శ్రమించి బయటకు తీశారు. టాటా మేజిక్ డ్రైవర్ కుడికాలు దాదాపు తెగిపోయింది. క్షతగాత్రులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.