mallibabu
-
గిన్నిస్ రికార్డు కోసం 13 టన్నుల మహాలడ్డు
తాపేశ్వరం (మండపేట) : మహా లడ్డూల తయారీతో ఐదుసార్లు గిన్నిస్ రికార్డులు సాధించిన తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్స్ సంస్థ మరోసారి రికార్డు సాధించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా 13,000 కేజీలకు పైగా భారీ లడ్డూ తయారు చేయనున్నట్టు సంస్థ అధినేత సలాది శ్రీనుబాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. తమ సంస్థ మహా లడ్డూల తయారీలో 2011 నుంచి వరుసగా ఐదుసార్లు గిన్నిస్ రికార్డులు నెలకొల్పిందన్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా లడ్డూల తయారీలో తమ సంస్థ ఇప్పటికే 72 జాతీయ, అంతర్జాతీయ రికార్డులను సాధించిందన్నారు. పాత రికార్డులను తిరగరాసే విధంగా ఈ ఏడాది 13 టన్నులకుపైగా లడ్డూను తయారు చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడలోని డూండీ గణేష్ కమిటీకి 8,500 కేజీల లడ్డూతోపాటు అక్కడ ప్రతిషి్ఠంచే వినాయకుని చేతిలో ఉంచేందుకు మరో వెయ్యి కేజీల లడ్డూను కానుకగా అందజేయనున్నట్టు తెలిపారు. లడ్డూల తయారీ కోసం 13 మంది సిబ్బంది గణేష్ మాలలు ధరించి బూందీ తీయడంతోపాటు డ్రైఫ్రూట్స్‌ను సిద్ధం చేస్తున్నారన్నారు. -
అమ్మకు, అక్కకు.. భారమయ్యా!
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు ‘‘ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నా.. అమ్మకు అక్కకు భారమయ్యా.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’’ అంటూ లేఖరాసి.. రైలుకు అడ్డుగా నిలబడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది.. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు చూస్తుండగా జరిగిన ఆ సంఘటన వివరాలివి.. సామర్ల కోట: రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపురం, నాగంపేటకు చెందిన ముప్పన మల్లిబాబు(24) రామేశ్వరం నుంచి భువనేశ్వర్ వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు అడ్డుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి పరుగుపరుగున వచ్చిన మల్లిబాబు జీఆర్పీ పోలీసు స్టేషన్ ఎదురుగా సామర్లకోటలో ఆగని రైలుకు ఎదురుగా తలకు చేతులు అడ్డుపెట్టుకొని నిలబడ్డాడు. ఆ సమయంలో ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు కేకలు వేస్తుండగానే రైలు వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లిబాబు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు పది రోజుల క్రితం సామర్లకోటలోని మఠంసెంటర్లో మిఠాయి దుకాణంలో పనికి చేరినట్టు పోలీసులు తెలిపారు. అంతకు ముందు అనపర్తి మిఠాయి దుకాణంలో పని చేసే వాడని చెప్పారు. అనపర్తి నుంచి వచ్చిన తరువాత నుంచి మృతుడు మల్లిబాబు మౌనంగా ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తండ్రి లేకపోవడంతో తల్లి, అక్కల వద్దే ఉంటున్నాడు. ‘‘అక్కకు పెళ్లి చేయాల్సి ఉంది. ఆర్థిక బాధలతో తల్లి, అక్కలకు భారంగా ఉన్నా, తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదు’ అని ఇంటి వద్ద లేఖ రాసినట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఉన్న ఆ లేఖను చూచి మేన మామలు రైల్వేస్టేషన్‌కు వచ్చేసరికి మల్లిబాబు మరణవార్తను గమనించారు. రైల్వే డాక్టరు నిర్ధారణ మేరకు మృతదేహాన్ని పెద్దాపురం పోస్టు మార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ పవన్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఖైరాత్‌బాద్ గణేశుడి చేతిలో 5600 కేజీల లడ్డూ
హైదరాబాద్(ఖెరతాబాద్): త్రిశక్తిమయ మోక్షగణపతి ఆకారంలో తీర్చిదిద్దుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మహాగణపతికి తాపేశ్వరం సురుచిఫుడ్స్ అధినేత మల్లిబాబు లడ్డూప్రసాదం సమర్పిస్తున్న నేపద్యంలో మహాగణపతి చేతిలో 5600కిలోల లడ్డూను ప్రసాదంగా పెట్టేందుకు సన్నద్దం కావడంతో మహాగణపతి చేతిని ప్రత్యేకంగా ఇంజనీర్ రాంకుమార్ ఆధ్వర్యంలో శిల్పి రాజేంద్రన్, వెల్డింగ్ టీం లీడర్ శేషారెడ్డి నేతృత్వంలో పనులు జరుగుతున్నాయి. గత సంవత్సరం 5200 కిలోల లడ్డూను పెట్టగా ఈ సంవత్సరం 5600కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పిస్తుండటంతో మహాగణపతి చేతిని ఆ బరువును ఆపే విధంగా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఏకంగా మూడు టన్నుల (100-10ఎంఎం)స్టీల్‌ను ఉపయోగించి చేతిని ఏకంగా 6-7 టన్నుల బరువును ఆపేవిధంగా ట్రయాంగిల్ ట్రస్ డిజైన్‌లో తయారుచేస్తున్నారు. గత వారం రోజులుగా 10 మంది వెల్డర్లు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. మంగళవారంతో మహాగణపతి చేతి పనులు పూర్తవుతాయని శేషారెడ్డి తెలిపారు. మహాప్రసాదం చేతిలో పెట్టిన తరువాత ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండే విధంగా పటిష్టంగా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.