అమ్మకు, అక్కకు.. భారమయ్యా!
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
‘‘ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నా.. అమ్మకు అక్కకు భారమయ్యా.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’’ అంటూ లేఖరాసి.. రైలుకు అడ్డుగా నిలబడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది.. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్‌లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు చూస్తుండగా జరిగిన ఆ సంఘటన వివరాలివి..
సామర్ల కోట: రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపురం, నాగంపేటకు చెందిన ముప్పన మల్లిబాబు(24) రామేశ్వరం నుంచి భువనేశ్వర్ వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు అడ్డుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి పరుగుపరుగున వచ్చిన మల్లిబాబు జీఆర్పీ పోలీసు స్టేషన్ ఎదురుగా సామర్లకోటలో ఆగని రైలుకు ఎదురుగా తలకు చేతులు అడ్డుపెట్టుకొని నిలబడ్డాడు.
ఆ సమయంలో ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు కేకలు వేస్తుండగానే రైలు వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లిబాబు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు పది రోజుల క్రితం సామర్లకోటలోని మఠంసెంటర్‌లో మిఠాయి దుకాణంలో పనికి చేరినట్టు పోలీసులు తెలిపారు. అంతకు ముందు అనపర్తి మిఠాయి దుకాణంలో పని చేసే వాడని చెప్పారు. అనపర్తి నుంచి వచ్చిన తరువాత నుంచి మృతుడు మల్లిబాబు మౌనంగా ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తండ్రి లేకపోవడంతో తల్లి, అక్కల వద్దే ఉంటున్నాడు. ‘‘అక్కకు పెళ్లి చేయాల్సి ఉంది.
ఆర్థిక బాధలతో తల్లి, అక్కలకు భారంగా ఉన్నా, తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదు’ అని ఇంటి వద్ద లేఖ రాసినట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఉన్న ఆ లేఖను చూచి మేన మామలు రైల్వేస్టేషన్‌కు వచ్చేసరికి మల్లిబాబు మరణవార్తను గమనించారు. రైల్వే డాక్టరు నిర్ధారణ మేరకు మృతదేహాన్ని పెద్దాపురం పోస్టు మార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ పవన్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.