మల్లేశం(ఫైల్)
వికారాబాద్ అర్బన్ : ఎంబీఏ చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం రోజు ఈ సంఘటన చోటు చేసుకోవడం నిరుద్యోగులను తీవ్రంగా నిరాశ పరిచింది. మండల పరిధిలోని ధన్నారం గ్రామానికి చెందిన నర్సింలు పట్టణంలోని ధర్మ విద్యాలయం ఎయిడెడ్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమారుడు మల్లేశంను బాగా చదివించి మంచి ప్రయోజకుడిని చేయాలనుకున్నాడు. ఆయన ఆశయం నెరవేర్చేందుకు కుమారుడు మల్లేశం (27) చిన్ననాటి నుండి కష్ట పడి చదువుతూ మంచి మార్కులు సాధిస్తూ వస్తున్నాడు.
10వ తరగతి వరకు వికారాబాద్‌లోని శిశుమందిరం పాఠశాలలో, ఇంటర్ ఓ ప్రైవేటు కళాశాలలో, డిగ్రీ నిజాం కళాశాలలో చదివి మంచి మార్కులతో ఉతీర్ణత సాధించాడు. డిగ్రీ పూర్తి కాగానే పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదివాడు. ఎంబీఏ చదువుతూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఇటీవలే బ్యాంకు ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు. గత రెండేళ్లుగా గ్రూప్–2 ఉద్యోగం కోసం తీవ్రంగా చదువుతున్నట్లు కుటుంబీకులు, మిత్రులు తెలిపారు. సుమారు రూ. 50వేలు ఖర్చు పెట్టి హైదరాబాద్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల వికారాబాద్ పట్టణంలోని తన ఇంటి వద్దనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
చదువు పూర్తయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తీవ్రంగా మనస్థాపానికి గురయ్యాడు. దీంతో శుక్రవారం ఉదయం ఇంట్లో నుండి వెళ్లిపోయిన మల్లేశం అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటన స్థలానికి వెళ్లి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఎదిగిన కుమారుడు తిరిగి రాని లోకాలకు పోవడంతో వారి ఆవేదనకు హద్దుల్లేవు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మృతదేహాన్ని వికారాబాద్ తీసుకొచ్చారు. శనివారం రాత్రి వారి స్వగ్రామం ధన్నారంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment