ఖైరాత్‌బాద్ గణేశుడి చేతిలో 5600 కేజీల లడ్డూ
హైదరాబాద్(ఖెరతాబాద్): త్రిశక్తిమయ మోక్షగణపతి ఆకారంలో తీర్చిదిద్దుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మహాగణపతికి తాపేశ్వరం సురుచిఫుడ్స్ అధినేత మల్లిబాబు లడ్డూప్రసాదం సమర్పిస్తున్న నేపద్యంలో మహాగణపతి చేతిలో 5600కిలోల లడ్డూను ప్రసాదంగా పెట్టేందుకు సన్నద్దం కావడంతో మహాగణపతి చేతిని ప్రత్యేకంగా ఇంజనీర్ రాంకుమార్ ఆధ్వర్యంలో శిల్పి రాజేంద్రన్, వెల్డింగ్ టీం లీడర్ శేషారెడ్డి నేతృత్వంలో పనులు జరుగుతున్నాయి.
గత సంవత్సరం 5200 కిలోల లడ్డూను పెట్టగా ఈ సంవత్సరం 5600కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పిస్తుండటంతో మహాగణపతి చేతిని ఆ బరువును ఆపే విధంగా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఏకంగా మూడు టన్నుల (100-10ఎంఎం)స్టీల్‌ను ఉపయోగించి చేతిని ఏకంగా 6-7 టన్నుల బరువును ఆపేవిధంగా ట్రయాంగిల్ ట్రస్ డిజైన్‌లో తయారుచేస్తున్నారు. గత వారం రోజులుగా 10 మంది వెల్డర్లు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. మంగళవారంతో మహాగణపతి చేతి పనులు పూర్తవుతాయని శేషారెడ్డి తెలిపారు. మహాప్రసాదం చేతిలో పెట్టిన తరువాత ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండే విధంగా పటిష్టంగా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.