నీ భార్య తప్పు చేసిందని ఊరంతా చెప్పు!
ఒడిశా: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.ప్రజాస్వామ్యంలో నచ్చిన వారికి ఓటు వేసుకునే అధికారం ఉంటుంది. కానీ అలా ఓటు వేసినందుకు ఓ గ్రామ కమిటీ ఆటవిక శిక్ష విధించింది. ఓ మహిళా ప్రజాప్రతినిధి, పంచాయతీ ఎన్నికల్లో గ్రామ కమిటీ నిర్ణయాన్ని ధిక్కరించి నచ్చిన అభ్యర్ధికి ఓటు వేసింది. దీంతో ఆ గ్రామ కమిటీకి కోపమొచ్చింది. తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయలేదని ఆటవిక పద్దతిలో శిక్షించారు.
వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని అనుగుల్ జిల్లా రగుడిపడాలో గ్రామంలో వార్డు సభ్యురాలు మల్లికా సాహు ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్థులు బలపరిచిన సర్పంచి అభ్యర్థికి ఓటు వేయలేదు. తనకు నచ్చిన అభ్యర్థికి వేశారు. ఈ విషయమై ఇటీవల గ్రామ కమిటీ సమావేశం నిర్వహించి వార్డు సభ్యురాలికి రూ.50వేలు జరిమానా వేసింది. అయితే మల్లికా సాహూ జరిమానా చెల్లించడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రామ కమిటీకి కోపమొచ్చింది.
ఆమె భర్త దుష్మంత్ సాహుకు కమిటీ సభ్యులు గురువారం శిక్ష విధించారు. జేగంట కొడుతూ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తిరుగుతూ తన భార్య తప్పు చేసిందని చెప్పాలని తీర్పు ఇచ్చారు. దీంతో గురువారం మల్లిక భర్త దుష్మంత్ సాహు తీవ్ర అవమాన భారంతో కుంగిపోయారు. జేగంట కొడుతూ పంచాయతీలోని గ్రామాలలో తిరుగుతూ గ్రామ కమిటీ సూచించినట్లు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామ కమిటీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.