breaking news
mallojula venugopal
-
మేం కోవర్టులం కాదు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కోవర్టులుగా తమను చిత్రీకరిస్తున్న వారు, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ మావోయిస్టు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న విజ్ఞప్తి చేశారు. తమలో విప్లవ తత్వం ఇంకా చనిపోలేదని, ప్రజాపోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈమేరకు తనతో పాటు లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి ఛత్తీస్‌గఢ్ నుంచి మాట్లాడిన వీడియోను ఆయన శనివారం విడుదల చేశారు. అందులో ఆశన్న పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘కేంద్ర కమిటీ స్థాయి నాయకులు లొంగిపోతే విప్లవ ద్రోహులుగా పేర్కొనడం చాన్నాళ్లుగా జరుగుతూ వస్తోంది. మాపై కూడా అలాంటి నిందలు వస్తాయని ముందే ఊహించాం. కానీ, ఇటీవల మావోయిస్టు పార్టీకి జరిగిన భారీ నష్టాలకు మేమే కారణమని, మేం కోవర్టులుగా వ్యవహరించామంటూ ఆరోపణలు రావడంతో వివరణ ఇస్తున్నా. నాకు ఏ స్వార్థం లేదు. భయం కూడా లేదు. ప్రస్తుత పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ మాలో విప్లవ తత్వం చచ్చిపోలేదు. ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. అయితే, కార్యాచరణ ప్రకటించేంత అనువైన పరిస్థితులు లేనందున.. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం ముఖ్యం. హైదరాబాద్‌లో కూర్చుని ప్రకటనలా? ప్రజాస్వామిక వాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు హైదరాబాద్‌లో కూర్చుని మాపై ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారు. మేము సైద్ధాంతికంగా మీ అంత బాగా మాట్లాడలేకపోవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో నిలబడి మాట్లాడుతున్నాం. మేము పోరాడుతున్న గడ్డ (దండకారణ్యం)కు వచ్చి నిజాలు తెలుసుకుని మాట్లాడండి. అప్పుడే మేము ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నామో తెలుస్తుంది. అక్కడ (హైదరాబాద్) ఉండి సాయుధ పోరాటం చేయాల్సిందే అని చెబుతున్నారు. చేస్తే ఏమవుతుంది? మా శవాలు తెలంగాణకు వస్తే వాటిపై ఎర్రగుడ్డలు కప్పి ర్యాలీలు తీసి మమ్మల్ని హీరోలను చేస్తారు. కానీ ఇక్కడి(ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు) వారి సంగతేంటి? ప్రాణత్యాగం వృధా సమీప భవిష్యత్‌లో మన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంటే తెగించి పోరాటం చేయడంలో తప్పులేదు. అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రాణత్యాగం చేయడం వృధా. విజ్ఞతతో ఆలోచన చేయండి. అనుకూలమైన పరిస్థితుల్లో ఉండి పరిధి దాటి మాట్లాడం పౌరహక్కుల సంఘం నేతలకు సరికాదు. మేము లొంగిపోయినా గుండెకోట్ ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు సాయుధ పోరాటం చేయగలరని పౌరహక్కుల నేత గడ్డం లక్ష్మణ్ అంటున్నారు. కానీ, ఆ ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారు కూడా ఇప్పుడు ఇక్కడ నా వెంటే ఉన్నారు. నేనో, సోనూనో చెబితే వచ్చేంత అమాయకులు కారు వారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియకుండా వాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్ దాదా ఉద్దేశం అది కాదు.. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌లో మావోయిస్టులపై ప్రభుత్వం దాడి భీకరంగా ఉంటుందనే అంచనా ఉంది. అందుకే మార్చి 28న శాంతిచర్చల కోసం కేంద్ర కమిటీ తరఫున మన పార్టీ నాటి జనరల్ సెక్రటరీ బీఆర్ దాదా (నంబాల కేశవరావు) అనుమతితో లేఖ రాశాం. ఆ తర్వాత ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నేను లేఖలు, ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో నేనేమైనా తొందరపడ్డానా అని తెలుసుకునేందుకు వ్యక్తిగతంగా బీఆర్ దాదాతో చర్చించాను. ఈ సందర్భంగా ‘మనం తప్పు చేయలేదు. సరైన దిశలోనే ఉన్నాం. కేంద్ర కమిటీ అంతా కూర్చుని నిర్ణయం తీసుకోవాల్సింది. అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గం చూడాలి’అని కూడా అన్నారు. దీనికి సంబంధించి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఈ అంశంపై చివరిసారి మే 18న బీర్ దాదా నుంచి నాకు లేఖ వచ్చింది. ఈ లేఖ పంపిన రెండు గంటల తర్వాతే ‘గుండెకోట్ ఆపరేషన్’మొదలైంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది శాంతిచర్చల విషయంలో దండకారణ్యంలో అందుబాటులో ఉన్న కేంద్ర కమిటీ సభ్యుల మధ్య చర్చ జరిగింది. ఇందులో దక్షిణ బస్తర్‌లో ఉన్న కామ్రేడ్లకు సమాచారం అందకముందే శాంతి చర్చల ప్రకటన వచ్చినట్టుంది. ఇక్కడ మా మాధ్య గ్యాప్ ఏర్పడింది. శాంతిచర్చల ప్రకటన మా నుంచి వచ్చినా ప్రభుత్వం నుంచి దాడులు ఆగలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం మనం ఆయుధం పట్టవచ్చు అంటూ మే 13న బీఆర్ దాదా మరో లేఖ పంపారు. ప్రస్తుతం ఈ లేఖను చూపించి బీఆర్ దాదా సాయుధ పోరాటానికి అనుకూలమనే వాదనను తెర మీదకు తెస్తున్నారు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టుకోమనే బీఆర్ దాదా చెప్పారు తప్పితే అప్పటి వరకు శాంతి చర్చలు, కాల్పుల విరమణ, సాయుధ పోరాటంపై వంటి అంశాల్లో తన అభిప్రాయం మార్చుకున్నట్టు కాదు. ‘సాయుధ పోరాటం’విషయంపై నాతో పాటు మరో పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ (తిప్పిరి తిరుపతి)కి కూడా బీఆర్ దాదా లేఖ రాశారు. అందులో విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మల్లోజులతో టచ్‌లో లేను సోను (మల్లోజుల వేణుగోపాల్)తో నేను టచ్‌లో లేను. ఆగస్టుతో పాటు అక్టోబర్ 7వ తేదీన కేవలం రెండు సార్లే ఆయనను కలిశాను. సాయుధ పోరాటం చేయాలనే ఎస్జెడ్సీ సభ్యుడి సమక్షంలోనే బహిరంగంగా ప్రజాస్వామ్యబద్దంగా నేను, సోను చర్చ జరిపాం. అందరి అభిప్రాయాల కోసం సెప్టెంబర్ 13 వరకు ఎదురు చూశాం. ఆ తర్వాత సాయుధ పోరాట విరమణ ప్రకటన వచ్చింది. ఈ విషయంలో సాధ్యమైనంత వరకు పార్టీ పద్దతులు పాటించేందుకు ప్రయత్నించాం అని వివరించారు. -
వారు కోవర్టులు.. విప్లవ ద్రోహులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ విచ్ఛిన్నకులుగా..విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన సోను, సతీశ్, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాలని ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతిని«ధి అభయ్ పేరిట 16న రాసిన లేఖ ఆదివారం వెలుగుచూసింది. లేఖలోని ప్రధానాంశాలివి... సోను రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి 2011 నుంచి దండకారణ్యంలో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురైంది. అప్పటి నుంచే సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాలపై సోను ప్రవేశపెట్టిన పత్రాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సమావేశాల్లో సోనులోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి పార్టీ కృషి చేసింది. ఆయనలో పొడసూపుతున్న వ్యక్తివాదం, అహంభావం, పెత్తందారీతనాన్ని సరిద్దుకోవాలని కోరింది. అయితే 2025 మేలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణాత్మక బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి. నిజాలు దాచి .. నిందలు మోపుతూ.. ఆపరేషన్ కగార్తో ప్రతీరోజు ప్రాణాలు ఎదురొడ్డి విప్లవవోద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థాలు త్యాగానికి సిద్ధపడని స్థితికి, ప్రాణభీతికి దారి తీశాయి. తన బలహీనత, ప్రాణభీతికి ముసుగు కప్పి, పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంథా (వ్యూహం) ఫలితంగానే భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారితీసిందని, ఈ స్థితిలో ఆయుధాలను శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు ప్రకటన సెపె్టంబరు 15న సోను నుంచి వచ్చింది. తన అభిప్రాయాలపై నమ్మకముంటే సోను వాటిని పార్టీ ముందు పెట్టి చర్చించాల్సింది. కానీ శత్రువు ముందు లొంగిపోయాడు. బహిష్కరిస్తున్నాం సోను, అతని అనుచరులు ఆయుధాలు పారీ్టకి అప్పగించి లొంగిపోవాలని కేంద్ర కమిటీ సూచించినా, దాన్ని పాటించకుండా ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు. ఇదివిప్లవ ప్రతిఘాతుకత (కౌంటర్ రివల్యూషన్) అవుతుంది. విప్లవ ద్రోహిగా మారిన సోను, అతనితోపాటు లొంగిపోయిన డీకే ఎస్జెడ్సీ సభ్యుడు వివేక్, దీపలతో పాటు మరో పదిమందిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. గతేడాది నుంచి వారు కాంటాక్ట్‌లో ఉన్నారు.. గతేడాది చివర్లో తన జీవిత సహచరితోపాటు మరికొందరిని మహాæరాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే పోలీస్ ఉన్నతాధికారులతో సోను, ఆశన్న కాంటాక్ట్‌లో ఉన్నారు. ఆ తర్వాత కోవర్టుగా మారినట్టు ఈ మధ్య జరిగిన ఘటనల ద్వారా అర్థమవుతోంది. కోవర్టులుగా మారిన సోను, సతీశ్‌లకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాననే నైతిక అర్హత లేదు. ఇకనైనా పార్టీని చీల్చే పనులు మానుకోవాలని సోను, సతీశ్లను హెచ్చరిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ భారీ లొంగుబాట్లు విప్లవోద్యమానికి నష్టమే అయినా ఇవి తాత్కాలిక నష్టాలే. వీటి ప్రభావం దీర్ఘకాలం ఉండొచ్చు. కానీ విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు. పీడన, సామాజిక అంతరాలు ఉన్నంత వరకు వర్గ పోరాటం ఉంటుంది. మారిన సామాజిక పరిస్థితులు, మారుతున్న విప్లవ స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ – సైనిక పంథాను సుసంపన్నం చేసుకొని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం. -
మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు.. మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక ప్రకటన
-
ఇద్దరూ విప్లవ ద్రోహులే.. శిక్ష తప్పదు.. మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన లేఖ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. లొంగుబాట్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ(Maoists Central Committee) తాజాగా లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసులు ఎదుట లొంగిపోయిన వారికి ప్రజలకే బుద్ధి చెబుతున్నారని హెచ్చరించడం సంచలనంగా మారింది.ఇటీవల మావోయిస్టుల(Maoists) కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venu gopal), ఆశన్నలు(Ashanna) పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. తాజాగా అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మల్లోజుల, ఆశన్నలు విప్లవ ద్రోహులుగా అభివర్ణించింది. విప్లవ ద్రోహులుగా మారి శత్రవులు ఎదుట లొంగిపోయిన ఇద్దరికి తగిన శిక్ష ప్రజలే విధిస్తారు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే, 2018లో ఒకసారి పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు లొంగిపోతున్న వ్యవహారం.. పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే. ప్రాణ భీతితో ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ.. పార్టీకి నష్టం కలిగితే ప్రజలే బుద్ధి చెబుతారు. కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయాడు అని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. -
రాజ్యాంగం వెర్సస్ రైఫిల్
మల్లోజుల వేణుగోపాల రావు లొంగిపోవడం మీద మావోయిస్టు అభిమానులకు కూడా సానుభూతి ఉంది. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఏదో ఘన విజయాన్ని సాధించినట్టు పళ్ళు ఇకిలించి నవ్వితే సహజంగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఒకరు నవ్వినా మరొకరు ఏడ్చినా జరగాల్సిందే జరుగుతోంది! మావోయిస్టు గెరిల్లాలు 70 మంది తుపాకులు తెచ్చి ముఖ్యమంత్రికి స్వాధీనం చేసి వారి చేతుల మీదుగా రాజ్యాంగ ప్రతుల్ని అందు కున్నారు. ఇదొక పారడాక్సీ వేడుక. రాజ్యాంగం వెర్సస్ రైఫిల్! ఆ వెంటనే ఛత్తీస్‌గఢ్‌లో ఆశన్న బృందం లొంగుబాటు. ఇలాంటి వేడుకలు సమీప భవిష్యత్తులో ధారావాహికంగా మరికొన్ని జరగవచ్చు. చాలామంది మరచిపోయినట్టున్నారుగానీ, దేశంలో రక్తపాత విప్లవాన్ని నివారించడానికే రాజ్యాంగం రూపుదిద్దుకుంది. నిజాం సంస్థానంలోని తెలంగాణలో 1946 జూలై 4న రైతాంగ సాయుధ పోరాటం ఆరంభం అయింది. ఆ ఏడాది డిసెంబరు 9న భారత రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది. నాలుగు రోజుల తరువాత డిసెంబరు 13న జవహర్లాల్ నెహ్రూ లక్ష్య ప్రకటన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.రక్తపాత విప్లవ నివారణకే... రాజ్యాంగంలో పొందుపరచిన ప్రతి ఆదర్శం వెనుక రక్తపాత విప్ల వాన్ని నివారించాలనే లక్ష్యం ఉంది. అంబేడ్కర్ ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే బాధితులు తిరగబడి ప్రజాస్వామిక భవనాన్ని పేల్చి పడేస్తారు అని రాజ్యాంగ సభలో చేసిన తన చివరి ప్రసంగంలో హెచ్చరించారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శ ప్రకటనగా రూపొంద డానికి కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఒక కారణం అంటే అతిశయోక్తి కాదు. నక్సలైట్ పోరాటాల వ్యాప్తిని నిరోధించడానికే భూపరిమితి, అటవీ భూములు, ఆదివాసుల హక్కుల రక్షణ వగైరా చట్టాలు రూపొందాయి. రాజ్యాంగ తొలి ఆదర్శాలైన సమానత్వం సోదర భావాలకు మరింత స్పష్టతను చేకూర్చడానికి రాజ్యాంగ పీఠికలో మతసామరస్యం, సామ్య వాదం ఆదర్శాలు చేరింది కూడా నక్సలైట్ల భయంతోనే! అందుచేత నక్స లైట్ల పోరాటాలు, ప్రాణ త్యాగాలు వృథా ప్రయాసలు అనడానికి వీల్లేదు.రెండు అధ్యాయాలువందేళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను మన ఆసక్తి మేరకు వంద సంకలనాలుగా రాయవచ్చు. రెండు అధ్యాయాల్లో రాయాలంటే మాత్రం దానికో ప్రమాణం ఉంది. అది: 1990లకు ముందు, 1990ల తరువాత. పెట్టుబడిదారీ సమాజం రెండు పనులు చేస్తుంది; యంత్రాల వినియో గాన్ని పెంచి సంపదని విపరీతంగా సృష్టిస్తుంది; అదే సందర్భంలో సృష్టి కర్తలకు యజమానులకు మధ్య శత్రుత్వం కూడా విపరీతంగా పెంచుతుంది. ఈ రెండు ధోరణులు సమాజాన్ని అనివార్యంగా సామ్యవాదం వైపునకు నడిపి స్తాయనేది మార్క్సిస్టు మూల సిద్ధాంతం. వైచిత్రి ఏమంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రామికులు, యజమానుల మధ్య శత్రుత్వాన్ని పెంచకుండానూ బతకలేదు; పెంచినా బతకలేదు. తెలివిగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడా నికి అది నిరంతరం సృజనాత్మకంగా జీవన్మరణ పోరాటాన్ని సాగిస్తుంటుంది. అయితే, అంతర్గత బలహీనతలు, లోపాలు, శాపాలు కమ్యూనిస్టులకు బోలెడు ఉన్నాయి. 1990లకు కొంచెం అటూ ఇటుగా తూర్పు యూరప్‌లోని సోషలిస్టు దేశాలు పతనమయ్యాయి. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైంది. చైనా లోనూ సోషలిస్టు ధోరణులు తగ్గి పెట్టుబడిదారీ ధోరణులు పెరిగాయి. ఫలితంగా, కమ్యూనిజానికి ఆమోదాంశమే ఇరుకున పడిపోయింది.‘పెట్టుబడిదారులారా... ఏకం కండి!’సరిగ్గా ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న ప్రపంచ పెట్టుబడి దారులు ఏకం అయ్యారు. అప్పటికే క్లౌస్ మార్టిన్ స్క్వాబ్ వంటివారు ప్రపంచ ఆర్థిక వేదికను నడుపుతున్నాడు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ‘నిర్మాణాత్మక సర్దుబాట్లు’ సిద్ధాంతాన్ని రూపొందించాయి. మరోవైపు, ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ విధానం వచ్చింది. ఇదే అదనుగా, గ్యాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ సూదర్ల్యాండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్మాణానికి నడుం బిగించాడు. చాలాకాలం ముందే ఆస్ట్రియా రాజకీయార్థికవేత్త జోసెఫ్ షుంపీటర్ ‘సృజనాత్మక విధ్వంసం’ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. జోయెల్ మోక్యర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్ త్రయం దీనికో రోడ్ మ్యాప్ గీసిపెట్టారు. 2025 నోబెల్ బహుమానం ఇచ్చింది ఈ ముగ్గురికే! వీళ్ళందరూ తెలివైనవాళ్ళు. ఎక్కడా సామ్యవాదానికి వ్యతిరేకులం అని చెప్పరు. పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగానూ మాట్లాడరు. మార్కెట్ ప్రజాస్వామ్యం, పర్యావరణ రక్షణ వంటి అందమైన పదాల్ని వాడుతుంటారు. మార్క్సిస్టులు సామాజిక పరిణామాలకు కొలబద్దగా భావించే ఉత్పత్తి విధానాన్ని వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీలకే అర్థం కాని ఒక మార్మిక వ్యవహారంగా మార్చేశారు. ఒకరోజు మార్కెట్లో వెలిగిన బ్రాండు మరు నాడు కనిపించదు. ఒకదాన్ని అర్థం చేసుకునేలోపునే దాన్ని తీసివేసి దాని స్థానంలో మరోదాన్ని ప్రవేశ పెడుతుంటారు. దీనికి వాళ్ళు పెట్టిన అంద మైన పేరు ‘సృజనాత్మక విధ్వంసం’! దీనికి తోడు అనేక దేశాల్లో మతతత్త్వాలను రెచ్చగొట్టడం మొద లెట్టారు. దీనితో రాజకీయ లబ్ధిని సులువుగా పొందడమేగాక కొత్త తరాలు సామ్యవాదం వైపునకు మరలకుండా అడ్డుకోవడమూ సాధ్యం అవుతుంది. దీనికి సమాంతరంగా సామాజిక ఉనికివాద ఉద్యమాలు తలెత్తి సన్నివేశాన్ని ఇంకా సంక్లిష్టంగా మార్చాయి. ఇంత జరిగిపోతున్నా సైద్ధాంతిక రంగంలో పెట్టుబడిదారీ వ్యూహకర్తల్ని ఢీకొనే ఆలోచనాపరుల్ని కమ్యూనిస్టు పార్టీలు సృష్టించుకోలేకపోయాయి. దానికి ప్రధాన కారణం కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న ఏకేశ్వరోపాసన! పార్లమెంటరీ పంథా ప్రత్యామ్నాయమేనా?ప్రపంచ పెట్టుబడిదారులు ఇంతగా విజృంభిస్తున్న సమయంలో, ఇండి యాలో ప్రధాన నక్సలైట్ పార్టీగా భావించే పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వ పోరులో నిండా మునిగి వుంది. ముందు కేజీ సత్యమూర్తిని తరిమేశారు. అవే పద్ధతుల్లో కొండపల్లి సీతారామయ్యను బయటికి పంపించారు. నిజా నికి కొండపల్లి, సత్యమూర్తి కలిసి కొనసాగినా విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో అనూహ్య మార్పులు ఏమీ వచ్చేవి కావు. వాళ్ళు చేయగలిగింది చేసేశారు. చరిత్రలో వాళ్ళ పాత్రలు అక్కడికే పరిమితం. ఆ తరువాత విప్లవ పార్టీలకు నాయకత్వం వహించినవాళ్ళు ఆపాటి సమర్థులు కూడా కాదు. పెట్టుబడిదారీ సమాజంలో అతి వేగంగా జరిగిపోతున్న పరిణామాలను అర్థం చేసుకుని విరుగుడు కనిపెట్టే శక్తి వాళ్ళకు లేకపోయింది. బ్రిటిష్ కాలంలో 303 రైఫిల్ గొప్పది. ఓ నలభై ఏళ్ళ క్రితం ఏకే 47 గొప్పది. ఇప్పుడు మానవ రహిత డ్రోన్లు, యుద్ధ విమానాలు వచ్చేశాయి. పాత అవగాహనలతో, పాత ఆయుధాలతో కొత్త శక్తుల్ని ఎదుర్కోవడానికి సిద్ధమైతే అది దుస్సాహసం అవుతుంది! ఏ ఉద్యమంలో అయినా విధిగా మూడు తరాలుండాలి. యువతరం, మధ్యతరం, అనుభవతరం. అనుభవతరం బండిని లాగుతుండాలి. యువ తరం బండిని గెంటుతుండాలి. కొత్త తరాల్ని ఆకర్షించలేకపోతే విప్లవ పార్టీలు వృద్ధాశ్రమాలుగా మారిపోతాయి. ఆయుధాలను ఉపయోగించడం అటుంచి వాటిని మోయడం కూడా సాధ్యం కాదు. ఒక వ్యూహం ప్రకారం ఉద్యమాల్లోనికి యువతరం రిక్రూట్‌మెంటును ఆపగలిగినవాళ్ళు... కల్లోల ప్రాంతాల్లో ప్రాణరక్షణ మందుల సరఫరానూ ఆపేశారు. వృద్ధాప్యంలో వచ్చే జీవనశైలి వ్యాధులకు అడవిలో మందులు అందకపోతే అల్లకల్లోలం జరిగిపోతుంది. గ్లూకోజ్ స్థాయిలు పెరిగి రెటీనో పతితో అంధులైన నాయకులు దారి కనిపించక పోలీసులకు దొరికిపోతున్న బాధాకరమైన కేసులు ఇటీవలి కాలంలో అనేకం ఉన్నాయి. అణగారిన సమూహాల సహజమైన ఆప్షన్ సమసమాజమే. ఆ లక్ష్య సాధన కోసం పుట్టిన పార్టీలు బలహీనంగా ఉన్నప్పుడే మరోవైపు చూడాల్సి వస్తుంది. సాయుధ పోరాటానికి ప్రత్యామ్నాయం రాజ్యాంగం అనడం కూడా ఇప్పుడు సమంజసం కాకపోవచ్చు. పాలకులు మంచోళ్ళయితే చెడ్డ రాజ్యాంగం కూడా ప్రజలకు మంచిదయిపోతుంది; పాలకులు చెడ్డోళ్ళయితే మంచి రాజ్యాంగం కూడా ప్రజలకు చెడ్డదయిపోతుందని అంబేడ్కర్ చెప్పి ఉన్నారు. ఇప్పుడు సమస్య రాజ్యాంగం మంచిదా, కాదా అన్నది కాదు; పాలకుల స్వభావం ఏమిటీ అన్నదే అసలు సమస్య! మన రాజ్యాంగానికి ప్రాణం ప్రజాస్వామిక ఎన్నికలతో కూడుకున్న పార్లమెంటరీ వ్యవస్థ. ఈ రెండింటినీ, కార్పొరేట్ మతతత్వ నియంతృత్వం భ్రష్టు పట్టించింది. ఆయుధాలు అప్పగించిన మావోయిస్టులు పార్లమెంటరీ పంథా చేపడతారా? అక్కడ మార్పులు తేగలుగుతారా? దానికి సమాధానం కోసం మరికొంతకాలం వేచిచూడాలి.డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
మావోయిస్టుల లొంగుబాటు యాత్ర
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌సహా 61 మంది బుధవారం లొంగిపోగా, ఛత్తీస్‌గఢ్‌లో అంతకు దాదాపు మూడింతల మంది అడవిని వీడి బయటకు రాబోతున్నారు. 170 మందికి పైగా మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయేందుకు రెండు బృందాలుగా బయలుదేరారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. దండకారణ్యంలోని మడ్ అడవుల నుంచి ఒక భారీ బృందం రణిత నేతృత్వంలో అడవిని వీడి కాంకేర్ జిల్లాలోకి చేరింది. తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో మరో 140 మంది బృందం ఇంద్రావతి నదిని దాటి బీజాపూర్ జిల్లాలోని ఒకప్పటి మావోయిస్టుల కంచుకోట బైరాంగఢ్‌కు చేరుకోనుంది. ఇక్కడి నుంచి వీరంతా జగదల్పూర్కు చేరుకునే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సమక్షంలో శుక్రవారం వీరంతా ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసే కార్యక్రమం జరగనుంది. సందేహాలకు తావులేకుండా..మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు సమయంలో బుధ వారం కనిపించిన దృశ్యాలు అనేక సందేహాలకు తావిచ్చాయి. మల్లోజుల బృందం చాన్నాళ్లుగా పోలీసులకు టచ్‌లో ఉన్నారని, లొంగిపోయినప్పుడు సమర్పించిన ఆయుధాలు సైతం ప్రభుత్వానివే అనే ప్రచారం సాగింది. దీంతో ఇలాంటి సందేహాలు మరోసారి తలెత్తకుండా ఆశన్న లొంగుబాటు విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే 50 మందితో కూడిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జెడ్సీ) సభ్యుడు భాస్కర్, దండకారణ్యం మాడ్ డివిజన్ ఇన్చార్జి రణిత బృందం అడవిని వీడి ఆయుధాలతో బయటకు వచ్చే వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం ఉదయం అబూజ్‌మడ్‌లోని హండావాడా జలపాతం నుంచి ఇంద్రావతి నేషనల్ పార్కు మీదుగా 140 మందికి పైగా సాయుధ మావోయిస్టులతో బయల్దేరిన ఆశన్న బృందం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రావతి నదిని దాటి ఉస్పారీ ఘాట్ మీదుగా భైరాంగఢ్ వైపుగా సాగుతోంది. ఈ బృందాల ప్రయాణం సాఫీగా సాగేలా పోలీసు శాఖ నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగాయి. వీరిలో ఎక్కువ మంది ఆలివ్ గ్రీన్ దుస్తులకు బదులుగా సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. హండావాడా జలపాతం కేంద్రంగాఅబూజ్మడ్లోని దట్టమైన అడవుల్లో ఛత్తీస్‌గఢ్ వైపు హండావాడా జలపాతం ఉంది. ఇక్కడే లొంగుబాటుకు సిద్ధంగా ఉన్న ముఖ్య నేతలు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీ నాటికి ఏ బృందాలు ఎలా వెళ్లాలి, ఎక్కడ లొంగిపోవాలి, వెళ్లే మార్గంలో అడ్డంకులు ఎదురుకాకుండా అవసరమైన శక్తులతో ఎలా సమన్వయం చేసుకోవాలనే అంశంపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. 6వ తేదీన కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు, ప్రజలకు క్షమాపణ చెబుతున్నట్టుగా మల్లోజుల నుంచి 22 పేజీల లేఖ జారీ అయింది. ఈ నెల 13న లొంగిపోయే మావోయిస్టులు అడవి నుంచి బయటకు రావడం మొదలైంది. 14న మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు మల్లోజుల బృందం చేరుకోగా, 15న ఆయన లొంగుబాటును అధికారికంగా ప్రకటించారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, సుక్మా జిల్లాల్లో మరో 78 మంది లొంగిపోయారు. -
అన్నా.. ఒక్కసారి వచ్చిపో
‘అన్నా.. మా చిన్నప్పుడు ఊరొదిలి అడవిబాట పట్టినవ్.. పీడిత, తాడితుల కోసం అరణ్యంలో ఉంటూ సమాంతర సర్కార్ నడిపించినవ్.. మారుతున్న పరిస్థితుల్లో బుల్లెట్‌తో కాదు బ్యాలెట్‌తోనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని గుర్తించినవ్.. ఆయుధం వీడి, రాజ్యాంగాన్ని చేతబట్టుకొని జనజీవన స్రవంతిలో కలిసినవ్.. పేపర్లు, టీవీల్లో నీగురించి వినడం తప్ప నేరుగా జూసిందేలేదు.. పెద్దపల్లి పెద్దవ్వ మధురమ్మ నా కొడుకును ఒక్కసారి జూసి కన్నుయూలని తండ్లాడింది.. ఆశ నెరవేరకుండానే కన్నుమూసింది.. నాన్న, అన్న, అమ్మ అంత్యక్రియలకూ రాకపోతివి.. ఇప్పుడైనా వచ్చిపోరాదే.. నిన్ను జూసి ఒక్కసారి చిన్ననాటి ముచ్చట్లు పంచుకోవాలని ఉంది.. జెర గిప్పుడైనా గిటొచ్చి పోరాదే’ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావుతో అనుబంధం ఉన్నవారు అంటున్నారు.సాక్షి పెద్దపల్లి ●: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు ఉరఫ్ అభయ్, సోను, భూపతి, వివేక్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆయుధలను అప్పగించి, రాజ్యాంగాన్ని చేతబూనారు. 44 ఏళ్లఉద్యమ ప్రస్థానం ముగించి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వేణుగోపాల్‌రావు తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది.తండ్రి స్ఫూర్తి.. సోదరుడి పిలుపు..పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య–మధురమ్మకు మూడోసంతానం వేణుగోపాల్‌రావు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తామ్రపత్రం అందుకున్న తండ్రి నుంచి పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న అభయ్.. సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావు ఉరఫ్ కిషన్‌జీ పిలుపుతో 1981లో అడవిబాట పట్టారు. 2010లో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ ఉరఫ్ ఆజాద్ మృతి తర్వాత ఆయన స్థానంలో నియమితులయ్యారు. 2010లో గడ్చిరోలిలో 76 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్ల ఊచకోతలో మాస్టర్ మైండ్‌గా పనిచేశారు. సీస్ఫైర్(కాల్పుల విరమణ)కు అనుకూలంగా లేఖరాసి మావోయిస్ట్ పార్టీలైన్ దాటారు. దీంతో విప్లవ ద్రోహిగా పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఆయన లొంగిపోవడంతో 44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. వేణుగోపాల్‌రావు భార్య తారక్క 10 మంది మావోయిస్టులతో ఈ ఏడాది జనవరి ఒకటిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయారు. ఇప్పుడు ఆయన కూడా 60 మందితో నక్సల్స్‌తో అదే సీఎం వద్ద లొంగిపోవడం గమనార్హం.మిగిలింది 9మందే..మావోయిస్ట్ పార్టీ అగ్రనేత లొంగిపోవడంతో మిగిలినవారి అడుగులపైనా చర్చ జరుగుతోంది. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మల్లా రాజిరెడ్డి ఉరఫ్ సంగ్రాం(సీసీఎం), రామగుండం ప్రాంతానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్ ర మేశ్(డీసీఎం), సబ్బితానికి చెందిన గంగిడి సత్యనా రాయణరెడ్డి ఉరఫ్ విజయ్(ఎస్సీఎం), పాలితానికి చెందిన అలేటి రామలచ్చులు ఉరఫ్ రాయలచ్చులు(డీసీఎస్), దాతు ఐలయ్య(ఏసీఎస్), జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాదరావు ఉరఫ్ చంద్రన్న, సోమన్న(సీసీఎం) అదే గ్రామానికి చెందిన దీకొండ శంకరయ్య ఉరఫ్ శేషన్న(ఏసీఏస్), కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి ఉరఫ్ వెంకటేశ్(ఎస్సీఎం), సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన వెంకటేశ్వర్రావు ఉరఫ్ ధర్మన్న(ఎసీఎం) మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతుండటంతో వీరి తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది. -
అంతా మార్చిన ఆ లేఖ!
మహారాష్ట్ర: మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అగ్రనే త మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవటానికి మాజీ మావోయిస్టు ఒకరు రాసిన ఓ లేఖ కారణ మని పోలీసులు తెలిపారు. మల్లోజులతో పాటు మరికొందరితో సన్నిహితంగా పని చేసిన అనిల్ అనే మావోయిస్టు గత ఏడాది సెప్టెంబర్ 15న పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ప్రశాంత జీవనం గడుపుతున్నానని పేర్కొంటూ ఇటీవల ఆయన మల్లోజులకు లేఖ రాశారు. ఆ తర్వాతే మల్లోజుల కూడా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘గౌరవనీయులైన కామ్రేడ్ సోను దాదా.. జోహార్! ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో కూడా మీరు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను, అంజు నాగపూర్‌లో 2024 సెప్టెంబర్ 15న లొంగిపోయాం. ప్రస్తుతం మేము గడ్చిరోలిలో ఉన్నాం. పోలీసుల నుంచి మాకు మంచి సహకారం అందింది. నేను ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను. గడ్చిరోలిలో ఇల్లు కూడా కట్టుకోవా లని ప్రయత్నాలు చేస్తున్నాం. తారక్క (మల్లోజు భార్య) కూడా మాతోపాటే ఉంది. ఇక్కడ మనవాళ్లంతా దాదాపు 60–70 మందిమి కలిశాం. తార దీదీ బాగున్నారు. ఆమె అనారోగ్యానికి గురైతే మేమే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆమె కుటుంబ సభ్యులు కూడా తరచూ వచ్చి చూసి వెళ్తున్నారు’ అని లేఖ లో అనిల్ పేర్కొన్నాడు. -
ఆ ఒక్కడి లెక్క తేలిస్తే కగార్ ముగిసినట్లే!
నిన్న మల్లోజుల, నేడు ఆశన్న.. రేపు ఎవరో?. వరుస పరిణామాలతో యాభై ఏళ్ల మావోయిస్టు పార్టీ ఉద్యమం చివరి అంకానికి చేరుకుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar)తో పార్టీ కేడర్ కకావికలం కాగా.. అదే సమయంలో కీలక నేతలు వరుసగా లొంగిపోతుండడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 2026 మార్చికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. లెక్కలు చూస్తే.. ఆయన చెప్పినట్లు నిజంగానే గత పదేళ్లలో ఉద్యమం తీవ్రంగా క్షీణించింది కూడా. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు( Nambala Keshava Rao) ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అయ్యింది.గత రెండేళ్లలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండగా.. చేసేదేం లేక కింది స్థాయిలో కేడర్ కూడా పార్టీని వీడుతోంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో మరో విశేషం ఒకటి ఉంది. ఆ పన్నెండు మందిలో.. 8 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలే ఉన్నారు. హనుమంతు, గణపతి, తిరుపతి, చంద్రన్న, సంగం వీళ్లంతా ఇక్కడి వాళ్లే. ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్కడు మడావి హిడ్మా. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయన పలు రాష్ట్రాలకు మోస్ట్‌వాంటెడ్. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉదృతంగా సాగుతోంది. ఆయన ‘లెక్క తేలిస్తే’.. మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం శాఖ బలంగా భావిస్తోంది. ఇదీ చదవండి: మడావి హిడ్మా ఎక్కడ?మావోయిస్టు ఉద్యమం 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరి గ్రామంలో ప్రారంభమైంది.మార్క్సిజం–లెనినిజం–మావోయిజం సిద్ధాంతాల ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థను కూల్చి.. సమసమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఇంతకాలం సాగింది.ఉద్యమం కాలక్రమంలో.. CPI (ML) పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్(MCC) విలీనంతో 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఏర్పడింది.ఉద్యమం ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని భావించింది. కానీ హింసా మార్గం వల్ల పోను పోను ప్రజల మద్దతు తగ్గుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ ఉద్యమం తీవ్రంగా క్షీణించగా.. 2026 నాటికి పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో ఉంది. -
ఆయుధం వీడిన మల్లోజుల.. ఆరు కోట్ల రివార్డు అందించిన సీఎం
ముంబై: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మహారాష్ట్ర పోలీసుల ఎదుట మల్లోజుల మంగళవారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్(Devendra Fadnavis) సమక్షంలో మల్లోజుల సహా మావోయిస్టులు తమ ఆయుధాలు సరెండర్ చేశారు.బుధవారం ఉదయం మల్లోజులతో పాటు మరో 61 మంది మావోయిస్టులు(maoists) ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను పోలీసులకు అందించారు. ఇక, మల్లోజులపై దాదారు ఆరు కోట్ల రివార్డు ఉండటంతో(ఆరు రాష్ట్రాల్లో కోటి చొప్పున) ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. రివార్డును ఆయనకు అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో మోస్ట్‌వాంటెడ్‌గా మల్లోజులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ..‘మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలో మావోయిజానికి చోటులేదు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మిస్తాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Gadchiroli, Maharashtra: Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati, surrenders in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 Naxalites surrendered today.Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati gave a… pic.twitter.com/stBiJWEJvd— ANI (@ANI) October 15, 2025అయితే, మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.#WATCH | Gadchiroli, Maharashtra: Naxalites surrender in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 surrendered today, including Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati surrendered today. pic.twitter.com/DoZucnsWGH— ANI (@ANI) October 15, 2025 -
లొంగిపోయిన మల్లోజుల..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, పెద్దపల్లి: తొలితరం మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. ఆయన తలపై రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. 60 మంది అనుచరులతో కలిసి ఆయన గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వేణుగోపాల్‌తోపాటు లొంగిపోయిన మావోయిస్టులందరినీ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో హోద్రి గ్రామం నుంచి పోలీస్ వాహనాల్లోనే గడ్చిరోలి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. లొంగిపోయినవారిలో ముగ్గురు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జెడ్సీ) సభ్యులు, పదిమంది డివిజినల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, మల్లోజుల లొంగుబాటును మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 16న మీడియా సమావేశంలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించనున్నారని సమాచారం. మల్లోజుల భార్య, గడ్చిరోలి దళ సభ్యురాలు తారక్క 2024 డిసెంబర్ 31న లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ వల్ల పార్టీ ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోవడంతో ఇక పోరాడలేమని గ్రహించి మావోయిస్టు పార్టీలో కొందరు లొంగుబాట పట్టారు. మల్లోజుల కూడా సాయుధ పోరాట పంథాను వీడుతున్నట్లు ఇటీవలే లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో మల్లోజుల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్ జీ కూడా పార్టీలో అగ్రనేతే. ఆయన 2011లో పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. కిషన్‌జీ భార్య పోతుల కల్పన గతేడాది తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగుబాటుకు కారణాలివే.. వేణుగోపాల్‌కు ప్రస్తుతం 70 ఏళ్లు. ఆయనపై 100కుపైగా కేసులున్నాయి. అనారోగ్య, వ్యక్తిగత కారణాలతోపాటు మారుతున్న రాజకీయ పరిస్థితులు కూడా ఆయన లొంగుబాటుకు కారణమని చెబుతున్నారు. ప్రజల నుంచి రోజురోజుకూ ఆదరణ తగ్గుతుండటం, అడవులపై బలగాల పట్టు పెరిగిన కొద్దీ.. వాటిని వదిలి కొత్త ప్రాంతాలకు వెళ్లడంపై వేణుగోపాల్ విభేదిస్తూ వస్తున్నారు. సాయుధ పోరు వదిలి రాజకీయ వేదికగా ఉద్యమించాలని కొంతకాలంగా చెబుతున్నారు. ఈ విషయంపై ఆగస్టు 15న ‘టెంపరరీ ఆర్మ్డ్ స్ట్రగుల్ అబాండెన్’పేరిట విడుదల చేసిన లేఖ సెపె్టంబర్ 17న వెలుగుచూడటం పార్టీలో కలకలం రేపింది. పార్టీలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఆయుధాలు సరెండర్ చేయాలని పార్టీ ఆదేశించింది. వేణుగోపాల్ లొంగుబాటును మహారాష్ట్ర గడ్చిరోలి, ఉత్తర బస్తర్, దండకారణ్యంలోని మెజారిటీ మావోయిస్టు అనుచరగణం సమర్థిస్తోంది. కానీ, మావోయిస్టు అగ్రనేతలు పుల్లూరి ప్రసాద్, పార్టీ తెలంగాణ కమిటీ, సెంట్రల్ కమిటీ నేతలు ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తండ్రి బాటలో పోరాట మార్గం.. మల్లోజుల వేణుగోపాల్‌ది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కేంద్రం). బ్రాహ్మణ కుటుంబంలో 1956లో ఆయన జన్మించారు. తండ్రి మల్లోజుల వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా తామ్రపత్రం అందుకున్నారు. ఆయన వెంకటయ్య 1997లో మరణించారు. తల్లి మధురమ్మ గతేడాది కాలం చేశారు. మరో సోదరుడు ఆంజనేయులు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి రిటైరయ్యారు. తండ్రి బాటలోనే పేద ప్రజల హక్కుల కోసం మల్లోజుల కోటేశ్వర్రావు, వేణుగోపాల్ ఉద్యమించారు. జగిత్యాల జైత్రయాత్ర అనంతరం 1978లో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1980లో పీపుల్స్‌వార్ ఆవిర్భావ సభ్యులుగా వ్యవహరించారు. 1986లో పెద్దపల్లిలో డీఎస్పీ బుచ్చిరెడ్డిని అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్ కాల్చి చంపారు. ఆగ్రహించిన పోలీసులు వెంకటయ్య – మధురమ్మ ఇంటిని కూల్చివేశారు. దీంతో కొంతకాలం వారు గుడిసెలో తలదాచుకున్నారు. వేణుగోపాల్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి అధినేతగా పనిచేశారు. మహారాష్ట్ర, ఏపీ, గోవాతోపాటు పశ్చిమ కనుమల్లో పార్టీ కార్యకలాపాలు విస్తరించారు. 2010లో పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. 2010లో గడ్చిరోలిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతలో ఇతనే మాస్టర్ మైండ్ అని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. 2011లో పశ్చిమబెంగాల్ పోలీసుల ఎన్కౌంటర్లో ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావు మరణించారు. ఆ తరువాత సెంట్రల్ ఇండియా అడవుల్లో పార్టీని బలోపేతం చేయడంలో వేణుగోపాల్ వ్యూహాలు రచించారు. ఆయన గడ్చిరోలి జిల్లాలో పనిచేసే సమయంలో తారక్కను వివాహమాడారు. 2018లో ఆమె మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. 44 ఏళ్లపాటు అజ్ఞాతంలోనే ఉన్న ఆయన పార్టీ విధానాలతో విబేధించి జనజీవన శ్రవంతిలో కలిశారు. వేణుగోపాల్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కోయ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని చెబుతారు. ‘సాధన’అనే కలం పేరుతో గోండుల జీవితాలకు అక్షరరూపం ఇచ్చారు. సరిహద్దు, రాగో అనే నవలు రాశారు. అడవి నుంచి అమ్మకు లేఖ తన తల్లి మధురమ్మ అంత్యక్రియలకు రాలేకపోయిన వేణుగోపాల్.. మీడియాలో కథనాలు చూసి ‘అమ్మా.. నన్ను మన్నించు’అని లేఖ రాశారు. ‘నీకు, అమరుడైన నా సోదరునికి.. మన కుటుంబానికి ఏ కలంకం రాకుండా, జనానికి దూరం కాకుండా తుదివరకూ నమ్మిన ఆశయాల కోసం నిలబడతానని మరోసారి హామీ ఇస్తున్నా.. అమ్మా’అంటూ లేఖ విడుదల చేశారు. దానికి విరుద్ధంగా వేణుగోపాల్ లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. నానమ్మ ఉంటే సంతోషించేది మా బాబాయ్ జనజీవన స్రవంతిలోకి రావడం సంతోషంగా ఉంది. కుటుంబం, దోస్తుల ప్రేమను దూరం చేసుకుని నమ్మిన సిద్ధాంతాలు, ఆశయాల కోసం ఇన్నేళ్లు నిస్వార్థంగా పనిచేశారు. మా నానమ్మ (మధురమ్మ) కొడుకును చివరిచూపు చూడాలని తపించింది. రెండేళ్ల క్రితం చనిపోయింది. ఇప్పుడు ఉంటే కొడుకుని చూసుకుని సంతోషపడేది. –దిలీప్‌శర్మ, వేణుగోపాల్ అన్న కూమరుడు వారిచేతుల్లోనే ఎదిగిన నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వేణువాళ్ల ఇంట్లోనే తిరుగుతుండేవాడిని. కోటన్న, వేణన్న నన్ను ఎత్తుకుని ఆడించేవారు. విప్లవబాట పట్టాక మధురమ్మ ద్వారా వారి గురించి తెలుసుకున్నా. వెంకటయ్య తాత, కిషన్ అన్న, మధురమ్మ చనిపోయినప్పుడు కూడా వాళ్లు రాలేదు. ఇప్పుడు లొంగిపోయారు. ఇక్కడకు వస్తే ఒక్కసారి చూడాలని ఉంది. – ఠాకూర్ విజయ్‌సింగ్, పొరుగింటి వ్యక్తి -
పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత మల్లోజుల?
-
మావోయిస్టు టి.ఇన్చార్జిగా మల్లోజుల వేణుగోపాల్!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్చార్జిగా అగ్రనాయకుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సాధును నియమించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం వేణుగోపాల్ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జిగా ఉన్నాడు. ఈయన మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. రాష్ట్ర విభజన ఖరారైపోవడంతో.. తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ అధికార ప్రతినిధి కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్‌కు చెందిన వేణుగోపాల్‌ను తెలంగాణ రాష్ట్ర కమిటీకి కేంద్ర కమిటీ తరఫున బాధ్యునిగా నియమించినట్లు సమాచారం. అలాగే, గతంలో తమకు పెట్టని కోటలా ఉన్న ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తిరిగి పట్టు సాధించే లక్ష్యాన్ని ఆయనకు నిర్దేశించినట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల నుంచి మేధావి వర్గాన్ని పార్టీ వైపు ఆకర్షించే బాధ్యతలను ఆయనపై ఉంచినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.


