malnourished children
-
పోషకాహార లేమిలో ప్రథమస్థానం
భారతదేశంలోని లోతట్టు ప్రాంతాల నుంచి వినిపిస్తున్న ఆకలికేకలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మీపూర్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక రెండురోజులపాటు ఆకలి దప్పులకు గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి చనిపోయాడు. రోజుకూలీ అయిన అమ్మకు పని దొరకలేదు. అదే వారం కేరళలో ఒక గిరిజన యువకుడు దుకాణం నుంచి కిలో బియ్యం అపహరించాడన్న మిషతో జనం అతడిని కొట్టి చంపారు. గ్లోబల్ క్షుద్బాధా సూచి 2017 అంచనా ప్రకారం భారత జనాభాలో దాదాపు 14.5 శాతంమంది పోషకాహార లేమితో బతుకుతున్నారు. మన పిల్లల్లో 21 శాతం మంది తీవ్రమైన పోషకాహార లేమితో బాధపడుతున్నారు. అయిదేళ్ల లోపు పిల్లల్లో 38.4 శాతం మంది ఎదుగుదల లేమితో అల్లాడుతున్నారు. అయిదేళ్లలోపు పిల్లల్లో 5 శాతం మంది ఆకలితో మరణిస్తున్నారు. విషాదం ఏమంటే మన దేశం లోని పిల్లల ఎత్తు సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంత పిల్లల ఎత్తుకంటే తక్కువగా ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల అనంతరం కూడా 25 కోట్ల మంది భారతీయులకు ఆహార భద్రత లేదు. రోజుకు 2,100 కేలరీల ఆహారం కూడా వీరికి లభించడం లేదు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్లానింగ్ కమిషన్ ఓ సందర్భంలో భారత్ దుర్భిక్ష దేశంగా ఉండకపోవచ్చు కానీ దీర్ఘకాలిక క్షుద్బాధా దేశంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. విధాన నిర్ణేతలు ఈ సమస్యను గుర్తించలేదని కాదు. పనికి ఆహార భద్రత బిల్లుతోసహా గత దశాబ్ద కాలంలో సుప్రీంకోర్టు దేశప్రజలకు ఆహార భద్రత కల్పనపై 60 ఆదేశాలు జారీ చేసింది. కానీ న్యాయవ్యవస్థ క్రియాశీలత సైతం వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయించడంలో విఫలమైంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. చట్టాలను విస్తృ తంగా చేపడుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా మెరుగైన ఆహార సరఫరాకు వీలిచ్చే సంస్కరణలను వ్యవస్థాగతంగా అమలు చేయడంలో వైఫల్యం. మన ఆహార విధానం తృణధాన్యాలను అందుబాటులో ఉంచడం పైనే శ్రద్ధ చూపుతోంది కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం మన దేశ వ్యవసాయ ఉత్పత్తుల మిగులును గిడ్డంగుల్లోనే దాచి ఉంచుతూ అవి చెడిపోయేలా చేస్తోంది. చివరకు మహిళల సామాజిక స్థాయిని తగ్గించే సంస్కృతి వల్ల వారు పోషకాహార లేమిలో మగ్గుతున్నారు.పైగా బహిరంగ మలవిసర్జన స్త్రీలు, పిల్లల ఆరోగ్యాలను కూడా దెబ్బతీస్తోంది. ఈ సమస్య పరిష్కరించలేనిది కాదు. ప్రపంచంలో అనేక దేశాలు దీనికి పరిష్కారం చూపిం చాయి. భారతదేశంలాగే దక్షిణాఫ్రికా కూడా ఆహార హక్కుకు హామీ కల్పించింది. బ్రెజిల్ అయితే దేశ ప్రజలందరికీ రోజుకు మూడు సార్లు భోజనం అందించే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని కోసం ఆ దేశం 32 ఆహార సంక్షేమ పథకాలను చేపట్టింది. ఆకలిని మానవ హక్కుల ఉల్లంఘనగా భావిస్తూ న్యాయస్థానాల్లో వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా బ్రెజిల్ అనుమతించింది. ఇక ఉగాండా అయితే విశిష్ట పథకాన్ని చేపట్టింది. కుటుంబానికి ఆహార భద్రత కల్పించడం కుటుంబ పెద్ద బాధ్యతగా చేస్తూ కుటుంబ సభ్యులు పోషకాహార లేమికి గురైతే కుటుంబ పెద్దకే జరిమానా విధించే చట్టపరమైన బాధ్యతను మోపింది. మరోవైపున పట్టణ కేంద్రాల్లో సబ్సిడీ ధరలకు ఆహారాన్ని అందించే పథకాన్ని కూడా ఆదేశం అమలు చేస్తోంది. భారతదేశంలోని పలు రాష్ట్రాలు ప్రజా పంపిణీ వ్యవస్థను పునర్నిర్మించడం ద్వారా ఆహార భద్రతను మెరుగుపర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మన ఆహార గిడ్డంగులలో 30 లక్షల టన్నుల ధాన్యాలను ఇప్పటికీ నిలవ ఉంచుతున్నాం కానీ ఇవి వర్షాలు, పురుగుల బారిన పడుతున్నాయి. మనం నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలు ఒక మధ్యస్థాయి యూరప్ దేశానికి తిండి పెట్టడానికి సరిపోతాయి. పేదలకు మరింతగా ఆహార ధాన్యాలు అందించడం ఒక ఎల్తైతే, దుబారా, అవినీతిని అరికట్టటం ఒకెత్తుగా ఉంటోంది. ఇటీవలి గతంలో కూడా కుటుం బం వారీగా లబ్ధిదారులకు గోదుమ, వరిధాన్యాల్లో 44 శాతం మేరకు అందడం లేదని సర్వే. దేశంలో రెండేళ్ల లోపు వయసు పిల్లల్లో ఎదుగుదల సమస్యను అరికట్టడానికి బ్రెజిల్లో లాగా జీరో హంగర్ పథకాన్ని చేపట్టాల్సిఉంది. దీనికి వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చడం, మహిళల సాధికారతను పెంచడం, పోషకాహార విద్య, సామాజిక రక్షణ పథకాలు వంటి బహుముఖ చర్యలను చేపట్టాల్సి ఉంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ దిశగా కొన్ని చర్యలు చేపట్టాయి. వచ్చే దశాబ్దిలోపు దేశం నుంచి ఆకలిని నిర్మూలించే దిశగా దీర్ఘకాలిక రాజకీయ నిబద్ధతను మన పాలకులు ప్రదర్శించడంతోపాటు ఆహార కూపన్లను, నగదు మార్పిడి వంటి పధకాలను కూడా చేపట్టాలి. ఎన్ని పథకాలు ఉన్నా అమలు విషయంలో అలసత్వం ప్రదర్శించి నంత కాలం భారత్ క్షుద్బాధా దేశంగానే కొనసాగక తప్పదు. వ్యాసకర్త: వరుణ్ గాంధీ, పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
ఇదేమి 'గుడ్డు' రాజకీయాలు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న దళిత పిల్లల నోటికాడి 'గుడ్డు'ను లాగేసుకున్నాయి హిందూత్వ రాజకీయాలు. దేశంలోని అన్ని రాష్ట్రాలోకెల్లా ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే 52 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. వారిలో ఎక్కువ మంది పిల్లలు దళితులే. వారిని మాంసాహారమా, శాకాహారమా ? అన్న వాదనతో సంబంధం లేదు. స్వతహాగా శాకాహారి, హిందుత్వ పార్టీకి చెందిన ముఖ్యమంత్రయిన శివరాజ్ సింగ్ చౌహాన్ పిల్లలు 'కోడి గుడ్డు' స్కీమ్‌ను అమలు చేసేందుకు ససేమిరా అంగీకరించడం లేదు. రాష్ట్రంలోని మూడు గిరిజన జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు కింద ఎన్నో పోషక విలువలుగల గుడ్డును ఆహారంలో సరఫరా చేద్దామంటూ తన ప్రభుత్వంలోని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారు. అంతేకాకుండా తన నిర్ణయాన్ని ప్రజల ముందు గట్టిగా సమర్థించుకుంటున్నారు. ఎవరి విశ్వాసాలు వారికుంటాయి సరే, తాను శాకాహారి అయినంత మాత్రాన...ఇతరులంతా శాకాహారులుగా మారాలన్న రూలేమి లేదుకదా? బలవంతంగా రుద్దే ఇలాంటి రూలు ఏ ప్రజాస్వామిక విలువలకు పట్టం కడుతోందో విజ్ఞులు ఆలోచించలేరా? ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కాకుండా నేడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాల్లో గుడ్డు స్కీమ్‌ను అమలు చేయడం లేదు. నేడు దేశంలోని 15 రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అరికట్టేందుకు గుడ్డు స్కీమ్‌ను అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఈ స్కీమ్‌ను అమలు చేస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాల్లో పిల్లల మధ్యాహ్న భోజన పథకాల్లో, ఇంకొన్ని రాష్ట్రాలు రెండు పథకాల్లోనూ ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వారానికి నాలుగు రోజులపాటు పిల్లలకు ఆహారంలో కోడి గుడ్డును సరఫరా చేస్తుండగా, జమ్మూకాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపుర, తమిళనాడు వారానికి ఐదు రోజులు గుడ్డును సరహరా చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మధ్యాహ్మ భోజన పథకాలను అమలు చేస్తున్న అక్షయ పాత్ర, ఇస్కాన్ ఫుడ్ ఫౌండేషన్ సంస్థలు గుడ్డు స్కీమ్‌ను అమలు చేసేందుకు అస్సలు అంగీకరించడం లేదు. అలాంటప్పుడు అంతే పోషక విలువలుగల పాలు, పెరుగును సమృద్ధిగా సరఫరా చేయాలని 'రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్' కార్యకర్తలు చేస్తున్న డిమాండ్‌కు మాత్రం వారి నుంచి సమాధానం రావడం లేదు. 2006లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం భారత్‌లో 60 శాతం మంది మాంసాహారులున్నారు. సంపన్న వర్గాల్లో శాకాహారులు ఎక్కువగా ఉండగా, దళిత, నిమ్న వర్గాల్లో మాంసాహారాలు ఎక్కువగా ఉన్నారు. పోషక విలువలుగల గుడ్డును కూడా శాకాహారంగా పరిగణించాలంటూ శాకాహారుల్లో మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్న నేటి సమాజంలో పిల్లల నోటికాడి గుడ్డును లాగేసుకోవడం ఎంతవరకు సమంజసమో!