షీ టీమ్స్‌పై మహిళలకు అవగాహన కల్పించాలి
రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ భార్య మమత
హైదరాబాద్: మహిళలకు షీ టీమ్స్‌పై మరింత అవగాహన కల్పించాలని డీజీపీ అనురాగ్‌శర్మ భార్య మమత అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ రెండో వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మమత మాట్లాడుతూ.. ఆకతాయిల నుంచి మహిళలు ఆత్మరక్షణ ఎలా చేసు కోవాలో షీ టీమ్స్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. నగరంలో షీ టీమ్స్ రావడంతో ఆకతాయిల ఆగడాలు తగ్గాయన్నారు. ప్రజలకు, పోలీసులకు షీ టీమ్స్ వారధిగా పనిచేస్తున్నాయన్నారు.
ఇంట్లో చెప్పుకోలేక తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్న మహిళలకు షీ టీమ్స్ అండగా నిలిచి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 524 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అనంతరం సినీ నటి ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. షీ టీమ్స్ వచ్చిన తర్వాత మహిళలకు మరింత ధైర్యం వచ్చిందన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం రూపొందించిన రెండు లఘు చిత్రాలను, బ్రోచర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మాదాపూర్ డీసీపీ శివప్రసాద్, ఏసీపీ రమణకుమార్, సీఐ కళింగరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.