సైనికుల త్యాగానికి సెల్యూట్: మమత
కోల్కత్తా: సియాచిన్ వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్పకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం నివాళులర్పించారు. హనుమంతప్ప చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆమె ట్విట్ చేశారు. దేశం కోసం సైనికులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని, వారి త్యాగానికి సెల్యూట్ చేస్తున్నానని మమత పేర్కొన్నారు. హనుమంతప్పను బ్రతికించేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు గురువారం ఉదయం 11.45 నిమిషాలకు హనుమంతప్ప చివరి శ్వాస విడిచారు.
కాగా హిమాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు.. 800 మీటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి.. సియాచిన్లోని భారత సైనిక శిబిరంపై పడటంతో 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆరురోజుల పాటు 35 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన జవాన్ హనుమంతప్పను సోమవారం సజీవంగా వెలికితీశారు. అయితే అప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమంగా మారింది.