కంపెనీలన్నింటికీ ఒకే కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్
ఐసీఎస్ఐ ప్రతిపాదన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వ్యాపారాల నిర్వహణను సరళతరం చేసే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీలన్నింటికి ఒకే తరహా కార్పొరేట్ గవర్నెన్స్ నియమావళి అమల్లోకి తెచ్చే దిశగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) కసరత్తు చేస్తోంది. దీంతో పాటు ఇంటర్నేషనల్ కార్పొరేట్ గవర్నెన్స్ డే ప్రతిపాదనకు కూడా ఇతర దేశాల మద్దతు కూడగట్టేలా ఐక్యరాజ్యసమితితో కూడా త్వరలో చర్చలు జరపనున్నట్లు మంగళవారమిక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ మమతా బినాని తెలిపారు.
గ్లోబల్ కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్ (జీసీజీసీ)పై అవగాహన పెంచే క్రమంలో డిసెంబర్ 9,10 తేదీల్లో హైదరాబాద్లో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు మమత వివరించారు. దేశవిదేశాల నుంచి సుమారు 2,500 మంది పైచిలుకు ప్రతినిధులు దీనికి హాజరు కానున్నట్లు చెప్పారు. యువతలో వృత్తి నైపుణ్యాలపై అవగాహన పెంచేందుకు ఈ నెల 15న యువకౌశల్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మమత తెలిపారు. ఐసీఎస్ఐ పరిధిని విస్తరిస్తూ త్వరలో దుబాయ్లో కూడా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ మహాదేవ్ తిరునగరి, కౌన్సిల్ సభ్యుడు ఆహ్లాద రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు ఐసీఎస్ఐ సభ్యులతో జరిగిన ఇష్టాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి మమత వివరించారు.