మీరట్ సాహసమహిళ ఆత్మహత్య చేసుకోవలసిందేనా?
మీరట్: ఈ దేశంలో సాహసమహిళలకు, వీరనారీమణులకు దక్కేది ఏమిటి? ఓ మహిళ తనను, తన భర్తను రక్షించుకోవడం కోసం దుండగులపై తిరగబడినా ఈ సమాజంలో సహాయపడేవారే లేరా? పోలీసులు, ప్రభుత్వం సహాయపడరా? బెదిరింపులు ...భయం భయంగా బతకవలసిందేనా? అంటే అంతే అని స్పష్టమవుతోంది మీరట్లో ఓ మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తుంటే. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పట్టపగలు నడిరోడ్డు మీద తన భర్తపై దాడి చేస్తున్న ఇద్దరు యువకులను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొన్న సంఘటన తెలిసిందే.
సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే.. మమత యాదవ్ అనే మహిళ తన భర్తతో కలసి బైకుపై వెళుతోంది. ఇద్దరు యువకులు వారి బైకును కారుతో ఢీకొట్టారు. ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఆమె భర్తపై దాడి చేశారు. తమకు సాయం చేయాలంటూ ఆ మహిళ పట్టపగలు రోడ్డుపై ఉన్నవారిని ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. పైగా చోద్యం చూస్తూ ఈ సంఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. దాంతో భర్తను రక్షించుకునేందుకు ఆ మహిళే రంగంలోకి దిగింది. అపరకాళిలా విరుచుకుపడింది. ఆ యువకులకు దేహశుద్ధి చేసింది. ప్రాణాలకు తెగించి నడిరోడ్డుపై పోరాడుతున్న ఆ మహిళకు అక్కడ ఉన్న ఏ ఒక్క మగవాడు కూడా సహాయపడలేదు. ఆ సంఘటనను సెల్ ఫోన్ లో ఎక్కించడంలో నిమగ్నమై ఉన్నారు. ఆ తరువాత పోలీసులు ఒక్క నిందితుడిని మాత్రమే అరెస్ట్ చేశారు.
ఇంతటి సాహసం చేసిన మమతకు ఆ సంఘట తరువాత న్యాయం జరుగలేదు. నిందితుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. తన భర్తను రక్షించుకోవడం కోసం యువకులను చికతబాదిన మహిళ, ఇప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.
ఈ సంఘటన మంగళవారం జరిగితే అంకిత్ అనే నిందితుడిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారని మమత యాదవ్ చెప్పారు. మరో నిందితుడు సమాజ్వాదీ పార్టీ నేత అనుచరుడు అయినందున అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఆ రోజు నుంచి వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా నిందితుడి అరెస్ట్ చేయకుండా, తనకు సహకరించకుండా వేధిస్తున్నారని చెప్పారు. తాను ఏమీ మాట్లాడకుండా ఉంటే లక్ష రూపాయలు డబ్బు ఇస్తామని చెప్పారని తెలిపారు. తనకు డబ్బు అవసరంలేదని, న్యాయం కావాలని ఆమె కోరారు. తన కుటుంబం భయంతో బతుకుతోందని మమత తెలిపారు. ఒక వారంలో తనకు న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు.