mana oori ramayanam
-
వినోదం... సందేశం... మన ఊరి రామాయణం
‘‘ఈ సినిమా చూస్తుంటే.. ప్రతి రోజూ సమాజంలో మనకు తారసపడుతున్న సంఘటనలను తెరపై చూస్తున్న భావన కలగడం ఖాయం. ‘మన ఊరి రామాయణం’ సినిమా కాదు. మనందరం నివసిస్తున్న సమాజం. మనం ప్రతిరోజూ చూస్తున్న కథలకు దృశ్యరూపం. ఇందులో వినోదమూ ఉంది. పంచదార పూతపూసిన మందు గుళికలా.. ఆ వినోదం మాటున మంచి సందేశమూ ఉంది’’ అని అభిషేక్ నామా అన్నారు. ప్రకాశ్ రాజ్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మన ఊరి రామాయణం’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ప్రియమణి, పృథ్వీ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన పట్ల అభిషేక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు... నాకు ప్రకాశ్‌రాజ్ ఓ రోజు ఫోన్ చేశారు. ‘నేనో సినిమా తీశా. మీరోసారి చూడండి. తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా’ అని చెప్పారాయన. సినిమా పేరు, ఇతర వివరాలు ఏం చెప్పలేదు. అవన్నీ అప్రస్తుతం అన్నారు. అప్పటికి ఫైనల్ వెర్షన్ రెడీ కాలేదు. నాకు ప్రత్యేకంగా షో వేశారు. నటుడిగా, దర్శకుడిగా ప్రకాశ్‌రాజ్ ప్రతి సన్నివేశంలోనూ ప్రకాశించారు. ప్రియమణి పాత్రను తీర్చిన విధానం, అందులో ఆమె నటన అద్భుతం. ‘నేను బంగారాన్నే కదా’, ‘ఏంటి.. ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావా’ డైలాగులు చెప్పినప్పుడు ప్రియమణి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా చూడగానే.. మనసులో ఏదో మంచి ఫీలింగ్. ఈ మధ్య కాలంలో వినోదంతో కూడిన ఇంత మంచి కాన్సెప్ట్ మూవీ నేను చూడలేదు. బాగా నచ్చేసింది. ఇటువంటి మంచి సినిమాను కచ్చితంగా ప్రేక్షకులకు చూపించాలనుకున్నా. అందరి కంటే ముందుగా సినిమాను నాకు చూపించినందుకు ప్రకాశ్‌రాజ్‌కి అభినందనలు తెలియజేశా. ఇది భారీ బడ్జెట్ సినిమా కాదు. ప్రేక్షకుల దగ్గరికి సినిమాను ఎలా తీసుకువెళ్లాలి? ప్రమోషన్ ఎలా చేయాలి? ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుంది? అనే అంశాలపై అందరం కూర్చుని ఓ వారం రోజులు కసరత్తులు చేశాం. ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాం. మల్టీప్లెక్స్‌లలో ఎక్కువ శాతం విడుదల చేశాం. మా అంచనా ప్రకారం నూటికి నూరు శాతం ప్రేక్షకులకు చేరువైందీ సినిమా. ఏ నోట విన్నా ‘మన ఊరి రామాయణం’ బాగుంది అనే మాట వినబడుతోంది. మంచి రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటుంటే.. నా జడ్జ్మెంట్ కరెక్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. -
ఐదుగురు జాతీయ అవార్డు గ్రహీతల... మన ఊరి రామాయణం
ప్రకాశ్‌రాజ్ దర్శకుడిగా తీసిన తొలి రెండు సినిమాలు ప్రేక్షకులకు చేరువ కాలేకపోయుండొచ్చు. కానీ ఆయనలో ఓ మంచి కథకుడు ఉన్నాడనే విషయాన్ని మాత్రం ఆ సినిమాలు స్పష్టంగా చాటి చెప్పాయి. మనవైన కథల్ని ప్రేక్షకులకు చూపించాలనే ప్రకాశ్‌రాజ్‌లోని ఓ తపన ఆ సినిమాలతోనే బయటపడింది. అందుకే ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టాడనగానే ప్రేక్షకులు ఆసక్తిగా ఆ సినిమావైపు చూడటం మొదలుపెట్టారు. ‘మన ఊరి రామాయణం’ అంటూ ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన ఆ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ పాఠకుల కోసం కొన్ని విశేషాలు... మనందరి రామాయణం: ప్రతి మనిషిలోనూ రాముడు, రావణుడు ఉంటాడు. పరిస్థితుల్నిబట్టి ఒక్కో సందర్భంలో ఒకొక్కరు మనలో నుంచి బయటికొస్తుంటారు. ఆ విషయాన్నే దుబాయ్ రిటర్న్ అయినటువంటి ఒక వ్యక్తి నేపథ్యంలో చెప్పే ప్రయత్నం చేశారు ప్రకాశ్‌రాజ్. సమాజంలో ఎంతో గౌరవింపబడే ఆ వ్యక్తికి శ్రీరామనవమి సమయంలో ఎదురైన అనుభవాలు ఎలాంటివి? తన జీవితాన్ని ఆ సంఘటనలు ఏ విధంగా మలుపు తిప్పాయి? అనే విషయాల్ని ఆసక్తికరంగా చూపించా మంటున్నారు ప్రకాశ్‌రాజ్. ఐదుగురు జాతీయ అవార్డు గ్రహీతలు: ప్రకాశ్‌రాజ్‌లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, తనకి తెలిసింది చేస్తారు, తెలియని దాని కోసం వినమ్రంగా వేరే వ్యక్తుల దగ్గరికి వెళతారు. ‘మీరే చేయాలి’ అని బాధ్యనంతా వారిపై పెడతారు. ‘మన ఊరి రామాయణం’కి ప్రకాశ్‌రాజ్ ఓ కథకుడు, ఓ దర్శక-నిర్మాత, ఓ నటుడిగా మాత్రమే చేశారు. సాంకేతికత విషయంలో మాత్రం నిష్ణాతులైన వ్యక్తుల్ని సంప్రదించారు. సంగీతం కోసం ఇళయరాజా, ఎడిటింగ్ కోసం శ్రీకర్ ప్రసాద్, కథానారుుక పాత్ర కోసం ప్రియమణి, కళా దర్శకత్వం కోసం శశిధర్ అడపాల్ని సంప్రదించారు. వాళ్లంతా కూడా జాతీయ అవార్డు గ్రహీతలే. ప్రకాశ్‌రాజ్‌తో కలుపుకొంటే మొత్తం ఐదుగురు జాతీయ పురస్కార గ్రహీతలు ‘మన ఊరి రామాయణం’కి పనిచేశారు. మనదైన ఓ కథని చెప్పాలనే ఓ ప్రయ త్నమే దర్శకత్వంవైపు అడుగేయించింది. దర్శకత్వంలో ఓ గొప్ప సంతృప్తి లభిస్తోంది. నా తొలి, మలి సినిమాల ఫలితాన్ని పట్టించుకోను. ఒక సినిమా ఆడటానికి, ఆడకపోవ డానికి చాలా కారణాలుంటాయి. కానీ మన మనసులోని కథని ఎలా చెప్పామన్నదే నాకు ముఖ్యం. ‘మన ఊరి రామాయణం’ విషయంలో ఓ కథకుడిగా చాలా సంతృప్తిగా ఉన్నా. కానీ నా కథ గురించి నేను సంతృప్తి పడితే సరిపోదు. అది ప్రేక్షకులకూ సంతృప్తినివ్వాలి. ఆ తీర్పు కోసమే ఎదురు చూస్తున్నా. ఫలితమెలా ఉన్నా... నావైన ప్రయత్నాలు ఇకపై కూడా జరుగుతూనే ఉంటాయి - ప్రకాశ్‌రాజ్ -
రాముడు... రావణుడు...మన ఊరి రామాయణం
వెండితెరపై విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ప్రకాశ్‌రాజ్. ఆయనలో నటుడు మాత్రమే కాదు.. రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా ఉన్నారు. ‘ధోని’, ‘ఉలవచారు బిర్యాని’ చిత్రాలు దర్శక-నిర్మాతగా ప్రకాశ్‌రాజ్ అభిరుచి ఏంటో ప్రేక్షకులకు తెలియజేశాయి. తాజాగా ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మన ఊరి రామాయణం’. ఒకరిద్దరు కాదు.. ఐదుగురు జాతీయ ఉత్తమ పురస్కార గ్రహీతలు ఇళయరాజా, ప్రకాశ్‌రాజ్, ప్రియమణి, శ్రీకర ప్రసాద్, శశిధర్ అడపా పని చేసిన చిత్రం ఇది. ఈ నెల 7న ‘మన ఊరి రామాయణం’ విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ చెప్పిన విశేషాలు. ♦ ప్రతి మనిషిలోనూ రాముడు, రావణుడు.. ఇద్దరూ ఉంటారు. సందర్భాన్ని బట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వస్తారు. అటు వంటి కథను ఈ చిత్రంలో చెప్పబోతున్నా. దుబాయ్ నుంచి సొంతూరికి వచ్చిన పెద్ద మనిషి భుజంగయ్య పాత్రలో నేను నటించా. సత్యదేవ్, రఘుబాబు, పృథ్వీలు ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ♦ ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియమణి పాత్ర ప్రవహించే నదిలా ఉంటుంది. ఆ ప్రవాహంలో ఎప్పుడు ఏది ఎదురవుతుందో చెప్పడం కష్టమే. ఆ ప్రవాహం ఎన్ని మలుపులు తిరిగింది? దారిలో ఏం దాగుంది? ఎక్కడ ఆగుతుంది? అనేది ఎవరికీ తెలీదు. ఆ భావోద్వేగాలను ప్రియమణి పలికించిన తీరు అద్భుతం. పాత్రలో జీవించింది. ♦దర్శకుడిగా నేను కథను మాత్రమే చెప్పగలను. కానీ, ఆ కథలో భావోద్వేగాలను, ఆత్మను తెరపై ఆవిష్కరించేది స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతమే. నా దర్శకత్వంలో వచ్చిన గత రెండు చిత్రాలకు ఆయనే సంగీతం అందించారు. మరోసారి ఈ చిత్రానికి స్వరాలు, నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. ♦ మంచి కథను ప్రేక్షకులు బోర్ ఫీలవ్వకుండా చెప్పడం చాలా ముఖ్యం. శ్రీకర్ ప్రసాద్ క్రిస్పీ ఎడిటింగ్ కథను వేగవంతం చేసింది. గ్రామీణ నేపథ్యంలోనే కథంతా జరుగుతుంది. ఆ ఫీల్ తీసుకురావడానికి జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిత్రీకరించాం. ఆ పల్లెటూరి వాతావరణం తెరపైకి తీసుకొచ్చిన ఘనత ప్రొడక్షన్ డిజైనర్ శశిధర్ అడపాదే. ఈ చిత్రకథను ప్రేక్షకులందరికీ చేరువయ్యేలా చెప్పడంలో వీళ్లందరి కృషి ఉంది. ♦ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా ‘మన ఊరి రామాయణం’ రషెస్ చూసిన తర్వాత తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకొచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై చిత్రం విడుదలవుతుంది. -
రాముడిలాంటి రావణుడు?
‘‘రాముడి రూపంలో ఉండే రావణుడి కథ ఇది. రాముడిగా మారిన రావణుణ్ణి చంపమని హనుమంతుడితో సీత చెప్పినప్పుడు.. రాముణ్ణి చంపాడా? లేదా? అనేది చిత్రం చూసి తెలుసుకోండి’’ అంటున్నారు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రామ్జీతో కలసి నిర్మించిన చిత్రం ‘మన ఊరి రామాయణం’. దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదలవుతోంది. ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ - ‘‘శ్రీరామ నవమి రోజు జరిగిన ఓ సంఘటన నలుగురి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనేది ముఖ్య కథ. భుజంగయ్యగా నేను, సుశీలగా ప్రియమణి, ఆటోవాలా శివగా సత్యదేవ్, గరుడ అనే దర్శకుడి పాత్రలో పృథ్వీ నటించాం. నాలుగు పాత్రల మధ్య నడిచే భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ చిత్రాన్ని విడుదల చేస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రమణ గోపిశెట్టి, ప్రకాశ్‌రాజ్, పాటలు: భాస్కరభట్ల, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, కెమేరా: ముకేశ్, సంగీతం: ఇళయరాజా. -
మన ఊరి రామయణం ఆడియో హైలెట్స్
-
‘మన ఊరి...’లో అదే చెప్పాలనుకున్నా: ప్రకాశ్‌రాజ్
‘‘ఇప్పుడిప్పుడే భారతీయ సినిమా కొత్త దిశలో పయనిస్తోంది. ఈ టైమ్‌లో ‘మన ఊరి రామాయణం’ వస్తుండడం ఆనందంగా ఉంది. నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ప్రకాశ్ రాజ్, ఈ సినిమాతో దర్శకుడిగానూ జాతీయ అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. ప్రకాశ్‌రాజ్, ప్రియమణి, సత్య ముఖ్యతారలుగా ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో రామ్జీతో కలసి నిర్మించిన సినిమా ‘మన ఊరి రామాయణం’. ఇళయరాజా స్వరపరిచిన పాటల సీడీలను నాగార్జున విడుదల చేశారు. ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ - ‘‘ప్రతి మనిషిలో రాముడు, రావణుడు, ఆంజనేయుడు, శూర్పణఖ ఉంటారు. అవసరం, పరిస్థితులను బట్టి క్యారెక్టర్ బయటికొస్తుంది. ఈ సినిమాలో నేను చెప్పాలనుకున్నది అదే. నన్ను మహా నటుడంటుంటే ఎక్కడో నాకు తెలియకుండా కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్నా. నేను నిత్య విద్యార్థిని. అందుకే దర్శకుడినయ్యా. ఈ సినిమా విడుదలకు అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఎంతో సహకరిస్తోంది’’ అన్నారు. దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, సుకుమార్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, హీరోయిన్ ప్రియమణి, నటుడు సత్య, రచయిత భాస్కరభట్ల, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశ్‌రాజ్ మన ఊరి రామాయణం
మన ఊరి మెయిన్ రోడ్డు పక్కన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద పోస్టర్ ఉంది చూశావ్ కదా. అందులో నమస్కారం పెడుతూ కనిపించిన పెద్దాయనే భుజంగయ్య. మొన్ననే దుబాయ్ నుంచి తిరిగొచ్చారు. దానధర్మాలు గట్రా బాగానే చేస్తుంటారు - ఊరి రచ్చబండ దగ్గర ఒకాయన భుజంగయ్య గురించి గొప్పగానే చెబుతున్నాడు. ఆ శ్రీరామనవమి రోజు జరిగిన ఓ సంఘటన భుజంగయ్య జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సంఘటన ఏంటి? శ్రీరామనవమి నాడు ఏం జరిగింది? అనే కథాంశంతో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘మన ఊరి రామాయణం’. ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కన్నడలో ‘ఇదొల్లె రామాయణ’గా తెరకెక్కింది. ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ప్రతి మనిషిలోనూ ఓ రాముడు, ఓ రావణుడు ఉంటారు. వారి గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ఫస్ట్ కాపీ పిక్చర్స్, ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కథ: జాయ్ మాథ్యూ, మాటలు: రమణ గోపిశెట్టి, ప్రకాశ్‌రాజ్, సంగీతం: ఇళయరాజా, పాటలు: భాస్కరభట్ల, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, కెమేరా: ముకేశ్, నిర్మాతలు: రామ్ జీ, ప్రకాశ్‌రాజ్. -
మనలోని రామాయణం!
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన ఊరి రామాయణం'. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరంలో బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తున్న పాట.. సినిమా థీమ్‌ను వివరిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భుజంగయ్య అనే పల్లెటూరి పెద్ద మనిషి పాత్రలో అలరించనున్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే మనుషులు, సంఘటనలతో కూడిన సహజమైన కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. టీజర్ చివరలో ప్రముఖ తార ప్రియమణి మెరిసి మాయమవుతుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందనేది ఇంకా ఖరారు కాలేదు. -
ఫిబ్రవరిలో 'మన ఊరి రామాయణం'
తన విలక్షణ నటనతో సౌత్, నార్త్ ఇండస్ట్రీలను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్.., నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ధోని, ఉలవచారు బిర్యానీ లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రకాష్ రాజ్ త్వరలోనే మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు మన ఊరి రామాయణం అనే టైటిల్‌ను ఫైనల్ చేశాడు. తన సొంతం నిర్మాణ సంస్థ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో మన ఊరి రామయణం సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించారు. -
ప్రకాష్‌రాజ్ చెబుతున్న రామాయణం
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నాడు. నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన ప్రకాష్ రాజ్ తరువాత నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించాడు. ఆకాశమంత, గగనం లాంటి సినిమాలను నిర్మించిన ప్రకాష్ రాజ్.. తరువాత ధోని, ఉలవచారు బిర్యాని లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోకపోయినా ప్రకాష్ రాజ్ అభిరుచికి మాత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. మరోసారి మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నాడు ప్రకాష్ రాజ్. కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాకు తెలుగులో మన ఊరి రామాయణం అనే టైటిల్‌ను ఫైనల్ చేశాడు. శనివారం ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ట్విట్టర్లో విడుదల చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తే ఈ సినిమా డ్రామా వారి జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇటీవలే ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్ రాజ్ అక్కడి ప్రజల జీవన స్థితిగతులను కూడా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అందుకే సినిమా టైటిల్‌ను మన ఊరి రామయణం అని పెట్టినట్టుగా విశ్లేషిస్తున్నారు. My next directorial film ..Kannada/Telugu bilingual..Yet another journey of reinventing self....on sets this winter pic.twitter.com/VfpoctuAZO — Prakash Raj (@prakashraaj) November 21, 2015