వినోదం... సందేశం... మన ఊరి రామాయణం
‘‘ఈ సినిమా చూస్తుంటే.. ప్రతి రోజూ సమాజంలో మనకు తారసపడుతున్న సంఘటనలను తెరపై చూస్తున్న భావన కలగడం ఖాయం. ‘మన ఊరి రామాయణం’ సినిమా కాదు. మనందరం నివసిస్తున్న సమాజం. మనం ప్రతిరోజూ చూస్తున్న కథలకు దృశ్యరూపం. ఇందులో వినోదమూ ఉంది. పంచదార పూతపూసిన మందు గుళికలా.. ఆ వినోదం మాటున మంచి సందేశమూ ఉంది’’ అని అభిషేక్ నామా అన్నారు. ప్రకాశ్ రాజ్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మన ఊరి రామాయణం’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ప్రియమణి, పృథ్వీ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన పట్ల అభిషేక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు...
నాకు ప్రకాశ్‌రాజ్ ఓ రోజు ఫోన్ చేశారు. ‘నేనో సినిమా తీశా. మీరోసారి చూడండి. తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా’ అని చెప్పారాయన. సినిమా పేరు, ఇతర వివరాలు ఏం చెప్పలేదు. అవన్నీ అప్రస్తుతం అన్నారు. అప్పటికి ఫైనల్ వెర్షన్ రెడీ కాలేదు. నాకు ప్రత్యేకంగా షో వేశారు.
నటుడిగా, దర్శకుడిగా ప్రకాశ్‌రాజ్ ప్రతి సన్నివేశంలోనూ ప్రకాశించారు. ప్రియమణి పాత్రను తీర్చిన విధానం, అందులో ఆమె నటన అద్భుతం. ‘నేను బంగారాన్నే కదా’, ‘ఏంటి.. ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావా’ డైలాగులు చెప్పినప్పుడు ప్రియమణి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా చూడగానే.. మనసులో ఏదో మంచి ఫీలింగ్. ఈ మధ్య కాలంలో వినోదంతో కూడిన ఇంత మంచి కాన్సెప్ట్ మూవీ నేను చూడలేదు. బాగా నచ్చేసింది. ఇటువంటి మంచి సినిమాను కచ్చితంగా ప్రేక్షకులకు చూపించాలనుకున్నా. అందరి కంటే ముందుగా సినిమాను నాకు చూపించినందుకు ప్రకాశ్‌రాజ్‌కి అభినందనలు తెలియజేశా.
ఇది భారీ బడ్జెట్ సినిమా కాదు. ప్రేక్షకుల దగ్గరికి సినిమాను ఎలా తీసుకువెళ్లాలి? ప్రమోషన్ ఎలా చేయాలి? ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుంది? అనే అంశాలపై అందరం కూర్చుని ఓ వారం రోజులు కసరత్తులు చేశాం. ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాం. మల్టీప్లెక్స్‌లలో ఎక్కువ శాతం విడుదల చేశాం. మా అంచనా ప్రకారం నూటికి నూరు శాతం ప్రేక్షకులకు చేరువైందీ సినిమా. ఏ నోట విన్నా ‘మన ఊరి రామాయణం’ బాగుంది అనే మాట వినబడుతోంది. మంచి రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటుంటే.. నా జడ్జ్‌మెంట్ కరెక్ట్ అయినందుకు సంతోషంగా ఉంది.