Management colleges
-
ఇంజనీరింగ్‌లో ఇక నిఖార్సైన బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీల్లో ఈ నెల 16 తర్వాత ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూహెచ్ తప్పనిసరి చేయనుంది. అన్ని కాలేజీలతో అనుసంధానమవుతూ హాజరు పర్యవేక్షణకు ఇప్పటికే ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. దీనివల్ల సంబంధిత సబ్జెక్టులను అర్హులైన అధ్యాపకులే బోధించాల్సి రానుంది. దీంతో ఇప్పటివరకు చాలా కాలేజీలు అనర్హులతో చేపడుతున్న విద్యా బోధనకు తెరపడనుంది. అలాగే అధ్యాపకులకు కాలేజీలు నిర్దిష్ట సమయంలోనే వేతనాలు చెల్లించాల్సి రానుంది. నిజానికి బయోమెట్రిక్ అటెండెన్స్‌ను ఈ నెల ఒకటి నుంచే ప్రారంభిస్తామని జేఎన్టీయూహెచ్ గత నెలలోనే ప్రకటించింది. అయితే ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని భావించడంతో కొంత జాప్యమైనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి మోసం... జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్, 70 ఫార్మసీ, 10 మేనేజ్మెంట్ కాలేజీలు ఉండగా వాటిల్లో 30 వేల మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం అధ్యాపకుడు తప్పనిసరిగా ప్రొఫెసర్ అయి ఉండాలి. అలాగే ప్రిన్సిపాల్ విధిగా పీహెచ్డీ చేసి ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఫ్యాకల్టీ విషయంలో విద్యార్థులను మోసం చేస్తున్నాయి. అర్హత లేని వారితో బోధన కొనసాగిస్తున్నాయి. దీనివల్ల విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్యను అందుకుంటున్న వాళ్లు 40 శాతం మందే ఉన్నారు. మిగతా విద్యార్థులు ఉపాధి కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా మంది బ్యాక్‌లాగ్స్‌తో నెట్టుకొస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికే బయోమెట్రిక్ తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనల మేరకు బయోమెట్రిక్ అమలు చేస్తున్నా ఇందులో లొసుగులున్నాయని జేఎన్టీయూహెచ్ క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించింది. ఆధార్ లింక్ తప్పనిసరి ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుండటంతో అధ్యాపకుడు ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఇది జేఎన్టీయూహెచ్కు అనుసంధానమై ఉంటుంది కాబట్టి అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించేందుకు అవకాశం లభించనుంది. అధికారులు బయోమెట్రిక్ నమోదు వివరాలను ఆయా కాలేజీల సమయాలతో సరిపోల్చుకొనేందుకు మార్గం ఏర్పడనుంది. అలాగే అధ్యాపకుల ఆధార్ నంబర్లను బయోమెట్రిక్ విధానానికి అనుసంధానించనుండటం వల్ల వారి వేతన వివరాలు తేలికగా తెలిసిపోతాయి. కాలేజీల నుంచి వేతనం అందుతోందా? వారు మరెక్కడైనా పనిచేస్తున్నారా? అనే వివరాలు తెలుస్తాయి. దీనివల్ల నకిలీ వ్యక్తులను రికార్డుల్లో చూపించడం కుదరదని అధికారులు అంటున్నారు. బయోమెట్రిక్‌తో ఉద్యోగాలు నిలబడతాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తే దాదాపు 30 వేల మంది అధ్యాపకులకు వేతనాలు సక్రమంగా అందుతాయి. దీనివల్ల ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్య అందుతుంది. కాలేజీల మోసాలకు కళ్లెం పడుతుంది. – అయినేని సంతోష్‌కుమార్ (రాష్ట్ర స్కూల్స్, టెక్నికల్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు) విద్యార్థులకు మేలు బయోమెట్రిక్ హాజరుతో ఆధార్‌ను అనుసంధానిస్తే అర్హత ఉన్న అధ్యాపకుడే బోధన చేయడం అనివార్యమవుతుంది. ఇది విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆధార్‌ను లింక్ చేయాలన్న లక్ష్యంతోనే ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. – ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్, వీసీ -
ఫీజు బకాయిలుండవు
సాక్షి, హైదరాబాద్: కాలేజీ యాజమాన్యాలకు శుభవార్త. గత కొన్నేళ్లుగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి 2017–18 విద్యా సంవత్సరం వరకు ఉన్న బకాయిలను పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలని నిర్ణయించింది. ఇకపై ఫీజు బాకీ అనేది లేకుండా ప్రతి కాలేజీకీ విడుదల కావాల్సిన నిధులను పైసాతో సహా ఇవ్వనుంది. ఐదేళ్ల బకాయిలు రూ. 287.26 కోట్లు... ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వం ఏటా విడుదల చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలు, బిల్లుల క్లియరెన్స్‌లో జాప్యం తో ప్రతి సంవత్సరం నూరు శాతం చెల్లింపులు జరగడం లేదు. ఏటా ఒకట్రెండు శాతం నిధులు విడుదల కాకపోవడం... తర్వాత ఏడాదిలో వాటికి మోక్షం లభించకపోవడంతో బకాయిలుగా మారు తున్నాయి. 2013–14 విద్యా సంవత్సరం నుంచి 2017–18 విద్యా సంవత్సరం వరకు రూ. 287.26 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం... వాటిని ఒకేసారి విడుదల చేసి జీరో బ్యా లెన్స్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కాలేజీలవారీగా పెండింగ్ బిల్లులను పరిశీలించాలని సంక్షేమ శాఖలను ఆదేశించింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన సంక్షేమాధికారులు ఆయా కాలేజీలకు సర్క్యులర్లు పంపేందుకు సిద్ధమవుతున్నారు. అలా కుదరకుంటే యాజమాన్యాలకు ఫోన్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. జనవరి 15 డెడ్‌లైన్... కాలేజీల యాజమాన్యాలకు ఫీజు బకాయిలున్నట్లు తేలితే సంబంధిత బిల్లులను తక్షణమే సంబంధిత జిల్లా సంక్షేమ శాఖాధికారులకు సమరి్పంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత వారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివిధ సంక్షేమ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బకాయిలను ఎట్టిపరిస్థితుల్లో ఆపొద్దని, వాటిని వెంటనే చెల్లించాలని నిర్ణయించడంతో ఈ మేరకు చర్యలు వేగవంతమయ్యాయి. ఆన్లైన్లో సాఫ్ట్కాపీలతోపాటు హాడ్కాపీలను వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమరి్పంచాలి. అలా సమర్పించిన బిల్లులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సంక్షేమ శాఖలకు స్పష్టం చేసింది. గడువులోగా వచి్చన బిల్లులను పరిశీలించి జనవరి 31 నాటికి క్లియర్ చేయాలని ఆదేశించింది. జనవరి 15లోగా బిల్లులు సమరి్పంచకుంటే ఆయా కాలేజీలకు ఫీజు బకాయిలు విడుదల కష్టం కానుంది. ఎందుకంటే 2017–18 వార్షిక సంవత్సరం వరకు చెల్లింపులు చేసే ఆప్షన్‌ను జిల్లా సంక్షేమశాఖాధికారుల లాగిన్ ఐడీ నుంచి ప్రభుత్వం తొలగించనుంది. దీంతో ఆ బకాయిలు విడుదల కావాలంటే కాలేజీలు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందని ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకుడు పి.కరుణాకర్ ‘సాక్షి’కి చెప్పారు. ఫిబ్రవరి తర్వాతే 2018–19 చెల్లింపులు...! 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలన ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 77 శాతం దరఖాస్తులను పరిశీలించినట్లు తెలుస్తోంది. గత విద్యా సంవత్సర ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ డిమాండ్ రూ. 2,101.45 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు రూ. 941.05 కోట్లు చెల్లించగా ఇంకా రూ. 1,164.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఫిబ్రవరి నుంచి ఈ చెల్లింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
బోధన.. వేదన
కేజీబీవీల్లో ఇంటర్ బోధన యాజమాన్యాలకు వేదనగా మారింది. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామన్న పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) పదో తరగతి తర్వాత బాలికలు విద్యను ఆపేస్తున్నారన్న ఉద్దేశంతో ఈఏడాది నుంచి ఇంటర్ విద్యను ప్రారంభించారు. అయితే బోధన, అధ్యాపకుల నియామకం గురించి మరచిపోయారు.కేజీబీవీల్లో పదవ తరగతికి బోధించే ఉపాధ్యాయులతో తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులను మాత్రమే బోధిస్తూ..ఇతర సబ్జెక్టులను అటకెక్కించడంతోవిద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. కడప ఎడ్యుకేషన్: బాలికా విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2004 నుంచి కేజీబీవీలను ప్రారంభించింది. జిల్లాలో 29 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో బాలికలకు మాత్రమే ప్రవేశం ఉంది. కేజీబీవీల్లో పదో తరగతి వరకు విద్య అందించేవారు. అయితే విద్యార్థినులు పదో తరగతి తర్వాత విద్యకు స్వస్తి పలుకుతున్నట్లు తెలియడంతో ప్రభుత్వం బాలికల విద్యను ప్రొత్సహిస్తూ జిల్లాలోని పెద్దముడియం, వీరబల్లి కేజీబీవీల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్ తరగతులను ప్రారంభించింది.మౌలిక వసతులు అరకొరే.అధ్యాపకుల నియామకానికి సంబంధించిన ప్రక్రియను ఇప్పుడు మొదలు పెట్టింది. ఫలితంగా బోధన ఆలసమ్యమవుతోంది. కళాశాలల వివరాలు జిల్లాలోని పెద్దముడియం, వీరబల్లి కేజీబీవీలను ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చే సింది. వీరబల్లిలో బైపీసీ గ్రూపును మాత్రమే నిర్వహిస్తున్నారు, బైపీసీకి సంబంధించి 80 మందివిద్యార్థినులు ఉన్నారు. పెద్దముడియంలో బైపీసీ, ఎంపీసీ గ్రూపులు ప్రవేశపెట్టింది. ఇందులో బైపీసీకి సంబంధించి 26 మంది ఎంపీసీ విభాగంలో 35 మంది ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. అధ్యాపకులు ఎప్పుడొస్తారో.. ఇంటర్ పాఠ్యాంశాలను బోధించేందుకు కావాల్సిన అధ్యాపకుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీరబల్లికి ఆరుగురు, పెద్దముడియం కేజీబీవీకి ఏడుగురు ఆధ్యాపకుల నియామకం కోసం ఈనెల 8వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభించింది. సంబంధిత ప్రక్రియను 11వ తేదీ వరకు కొనసాగించారు. జాబితాను అధికారులు పరిశీలించి కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. ఆయన ఓకే చేసి (సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ)కు పంపుతారు. వారు జాబితాను ప్రదర్శిస్తారు. అనంతరం ఎస్ఎస్ఏ వారు జాబితాలో అభ్యంతరాలను కోరతారు. తర్వాత తుదిజాబితాను విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ తతంగమంతా జరగాలంటే ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో అధ్యాపకులు ఎప్పుడొస్తారో..పాఠాలు ఎప్పుడు బోధిస్తారోననే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కేజీబీవీల్లో ఇంటర్‌ను ఎలా పూర్తి చేస్తారో, ఎంతశాతం ఉత్తీర్ణత తెస్తారో వేచి చూడాల్సిందే. త్వరలో సమస్యను పరిష్కరిస్తాం కేజీబీవీల్లో ఇంటర్‌కు సంబంధించి ఆధ్యాపకుల నియామక ప్రక్రియ పూర్తయింది. త్వరలో జాబితా విడుదల కానుంది. జాబి తారాగానే ఎంపికైన వారితో బోధన ప్రారంభిస్తాం. విద్యార్థినులకు సమస్య లేకుండా చూస్తాం. సిలబస్‌ను కూడా సకాలంలో ముగించేలా చర్యలు తీసుకుంటాం. – సుజన, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి -
రూ.10 వేలు ఇస్తాం.. కాలేజీకి రానక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా.. అయితే వెబ్ ఆప్షన్లలో మా కాలేజీని ఎంచుకోండి.. మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు.. మేమే మీకు రూ.10 వేలు ఇస్తాం’ అంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభ పెడుతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్ల్దిండ్రుల ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. ప్రధాన కాలేజీలు తప్ప చిన్న చిన్న కాలేజీలు మా కాలేజీలో చేరండంటే.. మా కాలేజీలో చేరండి అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. కన్వీనర్ కోటాలో చేరితే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి అందులో నుంచి కొంత మొత్తం ఇస్తామని విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. పైగా కాలేజీకి రానవసరం లేదని అటెండెన్స్, మార్కులు తామే వేస్తామంటూ ప్రలోభ పెడుతున్నాయి. ఈ విషయం కాస్తా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి దృష్టికి వెళ్లింది. అంతేకాదు ఆయన ఓ కాలేజీ యాజమాన్యానికి పేరెంట్లాగా ఫోన్ చేసి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ‘ఇదేమీ టెక్నికల్ కోర్సు కాదు కదా.. కాలేజీకి రానవసరం లేదు. మా కాలేజీలో చేర్చితే రూ.10 వేలిస్తాం’ అని యాజమాన్యం చెప్పడంతో పాపిరెడ్డి అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థుల హాజరు విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంతోపాటు యాజమాన్యాల తప్పిదాలకు ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 250 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 28,228 సీట్లు అందుబాటులో ఉండగా, ఎంసీఏ కాలేజీల్లో 2,181 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి.