రూ.10 వేలు ఇస్తాం.. కాలేజీకి రానక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా.. అయితే వెబ్ ఆప్షన్లలో మా కాలేజీని ఎంచుకోండి.. మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు.. మేమే మీకు రూ.10 వేలు ఇస్తాం’ అంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభ పెడుతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్ల్దిండ్రుల ఫోన్ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నాయి. ప్రధాన కాలేజీలు తప్ప చిన్న చిన్న కాలేజీలు మా కాలేజీలో చేరండంటే.. మా కాలేజీలో చేరండి అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి.
కన్వీనర్ కోటాలో చేరితే ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది కాబట్టి అందులో నుంచి కొంత మొత్తం ఇస్తామని విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. పైగా కాలేజీకి రానవసరం లేదని అటెండెన్స్, మార్కులు తామే వేస్తామంటూ ప్రలోభ పెడుతున్నాయి. ఈ విషయం కాస్తా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి దృష్టికి వెళ్లింది. అంతేకాదు ఆయన ఓ కాలేజీ యాజమాన్యానికి పేరెంట్‌లాగా ఫోన్ చేసి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ‘ఇదేమీ టెక్నికల్ కోర్సు కాదు కదా.. కాలేజీకి రానవసరం లేదు. మా కాలేజీలో చేర్చితే రూ.10 వేలిస్తాం’ అని యాజమాన్యం చెప్పడంతో పాపిరెడ్డి అవాక్కయ్యారు.
ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థుల హాజరు విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంతోపాటు యాజమాన్యాల తప్పిదాలకు ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 250 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 28,228 సీట్లు అందుబాటులో ఉండగా, ఎంసీఏ కాలేజీల్లో 2,181 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి.