సౌదీలో సగం వేతనాలే..
* అంతర్యుద్ధంతో కోత విధించిన కంపెనీలు
* ఇబ్బందుల్లో తెలంగాణ కార్మికులు
మోర్తాడ్: సౌదీ అరేబియాలో అంతర్యుద్ధం కారణంగా ఇక్కడి నుంచి వెళ్లిన కార్మికుల వేతనాలను యాజమాన్యాలు సగానికి తగ్గించాయి. స్వదేశాలకు వెళ్తామని కార్మికులు చెబుతున్నా పాస్‌పోర్టులు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వేతనాలు చెల్లించేందుకు తొలుత ఒప్పందాలు కుదుర్చుకున్న యాజమాన్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం వేతనాలనే చెల్లిస్తున్నట్లు అక్కడి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ భోజనం, వసతి ఉన్న కార్మికుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా, మిగిలిన కార్మికుల పరిస్థితి మరింత భిన్నంగా తయారైంది. ఒక్కో వీసాకు రూ.75 వేల నుంచి రూ. లక్ష వరకు ఏజెంట్లకు చెల్లించి గల్ఫ్‌కు వచ్చిన కార్మికులకు ఇప్పుడు తక్కువ వేతనాలు అందుతుండటంతో దిక్కుతోచకున్నారు.
విదేశాలకు వెళ్లడానికి బంగారం అప్పుగా తీసుకుని తులానికి అర్ధ తులం వడ్డీగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, తక్కువ వేతనంతో పని చేస్తే తమ ఖర్చులు పోనూ వడ్డీలకే సరిపోవని వారి ఆవేదన. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కార్మికులకు పూర్తి వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.