14 శాతం పెరిగిన అమూల్ టర్నోవర్
న్యూఢిల్లీ: గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో 14 శాతంపెరిగింది. ఈ సంస్థ అమూల్ బ్రాండ్ కింద పాలు, ఇతర పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.18,143 కోట్లుగా ఉన్న టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.20,730 కోట్లకు పెరి గిందని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ ఆర్.ఎస్. శోధి చెప్పారు. వినియోగదారుల ఉత్పత్తుల విభాగంలో అమ్మకాలు 21% వృద్ధి చెందడమే దీనికి కారణమని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రైతులకు 8-10% అధిక ధరను చెల్లించామని తెలిపారు.
అయితే దేశీయ మార్కెట్లో పాల సేకరణ ధరలు 15-20 శాతం వరకూ తగ్గాయని పేర్కొన్నారు. నెయ్యి, స్కిమ్మ్డ్ మిల్క్ పౌడర్ వంటి బల్క్ కమోడిటీ విభాగాల్లో రాబడులు 70%కి పైగా క్షీణించాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గడమే దీనికి కారణమని వివరించారు. పాల సరఫరా 15% పెరిగినందున పాల ధరలను తక్షణం పెంచే యోచనేదీ లేదని తెలిపారు. విస్తరణ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 230 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తున్నామని, రెండేళ్లలో దీనిని 320 లక్షల లీటర్లకు పెంచడం లక్ష్యమని శోధి చెప్పారు.