దుమ్మురేపిన హామిల్టన్
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి సొంతం
‘ఫోర్స్ ఇండియా’ పోడియం ఫినిష్
సెర్గియో పెరెజ్‌కు మూడో స్థానం
మనామా: ‘పోల్ పొజిషన్’ లభించకపోయినా ప్రధాన రేసులో దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సీజన్లో రెండో టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 39 నిమిషాల 42.743 సెకన్లలో పూర్తి చేశాడు.
ఇక ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటివరకు సీజన్‌లోని మూడు రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లే నెగ్గడం విశేషం.భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది. ‘ఫోర్స్ ఇండియా’కు చెందిన డ్రైవర్లు టాప్-5లో నిలువడం విశేషం.
సెర్గియో పెరెజ్ మూడో స్థానాన్ని సంపాదించి పోడియంపై నిలువగా... మరో డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానాన్ని పొందాడు. 2009లో యూరోప్ గ్రాండ్‌ప్రి రేసులో ఫిషిచెల్లా రెండో స్థానం పొందిన తర్వాత ఫోర్స్ ఇండియా జట్టుకు చెందిన మరో డ్రైవర్ టాప్-3లో నిలువడం ఇదే ప్రథమం. తొలి రెండు రేసుల్లో ఏడుగురు చొప్పున డ్రైవర్లు రేసును ముగించడంలో విఫలంకాగా... ఈసారి ఐదుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. గతేడాది విజేత సెబాస్టియన్ వెటెల్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 20న జరుగుతుంది.