ఎన్ని‘కలలే’!
సాక్షి, కరీంనగర్ : స్థానిక సంస్థలకు అనుకున్నట్టుగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. మునిసిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరుపుతామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డివిజన్లు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు కూడా పూర్తయింది. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం మండల ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించారు. పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలను సోమవారం పరిష్కరించవలసి ఉంది. ఒకవైపు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చునని భావిస్తున్నారు. జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సింది.
ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడంతో పాటు డివిజన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మేయర్, చైర్మన్ పదవులకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం మున్సిపల్ ఎన్నికలు వచ్చేనెల 2లోగా పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వ సన్నద్ధత, ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఇది సాధ్యం కాదు కాబట్టి మరికొంత సమయం కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరపాలని భావించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఈ మధ్యే ప్రారంభమైంది. కొత్త జనాభా లెక్కలకనుగుణంగా ఎంపీటీసీ స్థానాల విభజన జరిగింది. ఎన్నికల నిర్వహణ కోసం ఇంకా సుదీర్ఘ కసరత్తు చేయాల్సి ఉంటుంది.
ఈ నెల 28న ఎంపీటీసీ స్థానాల తుది జాబితా ప్రకటిస్తారు. ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేయడం దగ్గర నుంచి అనేక చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం సజావుగా పూర్తి చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు సాధ్యమన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇరు ప్రాంతాల్లో ప్రశాంత పరిస్థితి నెలకొంటేనే ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్తుందని అధికారులు చెప్తున్నారు. అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, ఎన్నికలకు సంబంధించి ఇంతకు ముందటి హడావుడి కనిపించడంలేదు. ప్రక్రియ మందగించడాన్ని బట్టి ఎన్నికలు ఇప్పట్లో ఉండవని అధికారులు నిర్ధారణకు వచ్చారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షేత్రస్థాయి నాయకులకు ఇది ఆశనిపాతంగా మారింది.