mandasa
-
దారుణం: ఒక ఇంట్లో రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో
సాక్షి, మందస/పర్లాకిమిడి (శ్రీకాకుళం): ఒక ఇంటిలో తండ్రి కోసం ఎదురుచూస్తు న్న రెండేళ్ల పసిపాప ఇంకెప్పుడూ నాన్నను చూడ లేదు. అమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాన్న చేయి పట్టుకునే భాగ్యం ఇక లేదు. మరో ఇంటిలో కుటుంబానికి దిక్కుగా ఉండాల్సిన యువకుడు ఊపిరి వదిలేశాడు. ఇంకో ఇంటిలో పెళ్లి నవ్వుల బదులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక్క ప్రమాదం.. ఇన్ని కుటుంబాల్లో విషాదానికి కారణమైంది. ఒడిశాలోని గారబంద పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుకల హరీష్ (32), బొడ్డపాటి తులసీదాసు(25)లు మృతి చెంద గా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరికి 17వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. వివరాల్లోకి వెళితే.. మందస మండలంలో ని మూలిపాడు గ్రామానికి చెందిన పి.శివకుమార్ ఆర్మీ లో పని చేస్తున్నారు. ఆయనకు ఒడిశాలోని బీఎస్ పు రం గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 17న వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో శివకు మార్ వధువు ఇంటికి వెళ్లడానికి తన స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన వలంటీర్ హరీష్‌తో బైక్‌పై బయల్దేరాడు. ఒడిశాలోని గారబంద పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరి బండిని బలంగా ఢీకొట్టింది. ఘటనలో హరీష్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్‌కు తీవ్ర గాయా లయ్యాయి. వీరి బండిని ఢీకొట్టిన బైక్‌పై ఉన్న బొడ్డపాటి తులసీదాసు కూడా ప్రమాద స్థలంలోనే ఊపిరి వదిలేశాడు. ఆయన వెనుక ఉన్న గోకర్ణపు రం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గారబంద పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: (నాగసులోచనా నన్ను క్షమించు..!.. నేను బాధపడుతూ నిన్ను మరింత..) క్షతగాత్రులను పర్లాఖిముండి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గోకర్ణపురం గ్రామానికి చెందిన వ్యక్తిని అక్కడి నుంచి శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం మెడికల్ కాలేజీకి తరలించారు. మూలిపాడు సర్పంచ్ గుసిరి వెంకటరావు, మృతుడు హరీష్ సోదరుడు తెలుకల డొంబురు, తెలుకల సురేష్‌తో పాటు పలువురు సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. హరీష్‌కు దీవెన అనే రెండేళ్ల కుమార్తె ఉండగా, ఆయన భార్య బబిత ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. ఈ సంఘటనతో మూలిపాడు గ్రామంలో విషా దం చోటు చేసుకుంది. -
కళ్లలో కారంకొట్టి.. వేడిగంజి పోసి
మందస: అల్లుడిపై అత్తింటివారు దురాగాతానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెల్లుపటియా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు మందస పోలీసులు వివరాలను గురువారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. సోంపేట మండలం గొల్లూరు గ్రామానికి చెందిన రాపాక వెంకటరమణ విజయనగరం జిల్లా చింతలవలస ఐదో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఇతనికి ఏడేళ్ల క్రితం మందస మండలం బెల్లుపటియా గ్రామానికి చెందిన కర్రి ఐశ్వర్యతో వివాహమైంది. అల్లుడు, అత్తవారి మధ్య స్వల్ప విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వెంకటరమణ అత్తవారిల్లు బెల్లుపటియాకు బుధవారం వచ్చారు. అక్కడ ఏమైందోగాని అత్త కర్రి కాంతమ్మ తనపై మరుగుతున్న గంజినీటిని పోసి.. కళ్లలో కారం కొట్టి హత్యాయత్నం చేయబోయిందని, మామ భైరాగి సహకరించారని బాధితుడు ఆరోపించారు. బాధతోనే పరుగులు తీసిన వెంకటరమణ, భార్య, పిల్లలను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని మందస పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం హరిపురం సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స తీసుకోగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 108 వాహనంలో శ్రీకాకుళంలో కిమ్స్‌లో చేరి.. చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రక్తమోడిన జాతీయ రహదారి.. మళ్లీ అదే చోట..
మందస: జాతీయ రహదారి మరోసారి రక్తమోడింది. గత ఏడాది ఓ కారు కల్వర్టులో పడిపోయి ఐదుగురు మృతి చెందిన చోటుకు సమీపంలోనే మరో ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమల కిరణ్(35), మద్ది జాస్మిని(8) అనే ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన యలమల కిరణ్ (35), ఇచ్ఛాపురం మండలం బెల్లుపడ గ్రామానికి చెందిన మద్ది విష్ణుప్రియ, ఆమె కుమార్తె జాస్మిని పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు స్కూటీపై వెళ్తున్నారు. కొత్తపల్లి జాతీయ రహదారి మీదుగా వీరు వెళ్తుండగా.. సింహాచలం నుంచి ఒడిశాలోని అస్కా రోడ్డు వైపు వెళ్తున్న ఓడీ02బిఎన్ 8282 అనే నంబరు గల కారు ఈ స్కూటీని బలంగా ఢీకొంది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు రోడ్డుపై ఎగిరి పడ్డారు. వీరిలో కిరణ్‌కు తలపై బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. విష్ణుప్రియ, జాస్మినికి తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు క్షతగాత్రులను పలాస సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చిన్నారి జాస్మిని మృతి చెందింది. విష్ణుప్రియ పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. మందస ఎస్ఐ కోట వెంకటేష్ సంఘటనా స్థలానికి వెళ్లి, కేసు నమోదు చేశారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ఏడాది ఇదే స్థలంలో ఒడిశాకు చెందిన కారు కల్వర్టులో పడిపో యి ఐదుగురు ఒడిశా వాసులు మరణించారు. తర చూ ప్రమాదాలు సంభవిస్తుండడంతో ఈ ప్రాంతా న్ని డేంజర్ జోన్‌గా గుర్తించి, హెచ్చరికలను ఏర్పా టు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా..
శ్రీకాకుళం : జిల్లాలోని మందస సమీపంలో మంగళవారం వలస కూలీలతో వెళ్తున బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 33 మంది గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. కర్ణాటకలో క్వారంటైన్ పూర్తిచేసుకున్న వీరు.. బెంగళూరు నుంచి కోల్‌కతాకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. అయితే బస్సు మందస సమీపంలోకి చేరుకోగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 42 మంది వలస కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. -
పాక్ ఉగ్రవాదులపై దొరబాబు వీరత్వం
సాక్షి, మందస: ఉద్దానం సైనికుడు వీరత్వం చూపాడు. శత్రువుల తూటాలకు గాయాల పాలైనా బాధను దిగమింగుకుని లక్ష్యాన్ని ఛేదించాడు. ప్రాణాలు పణంగా పెట్టి కర్తవ్య నిర్వహణలో భాగంగా పాకిస్తాన్ టెర్రరిస్టును అంతమొందించి శభాష్ అనిపించుకున్నాడు మందస మండలం చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన జవాను తామాడ దొరబాబు. సైన్యంలో చేరి తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్న దొరబాబు సోమవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చడంలో కీలకంగా వ్యవహరించి ఆర్మీ అధికారులతో పాటు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కాలికి గాయమైనా.. ఉద్దాన ప్రాంతమైన లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన తామాడ భైరాగి, కామమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆనందరావు(ఢిల్లీ), దొరబాబు(జమ్మూ–కాశ్మీర్) ఇద్దరూ ఆర్మీలోనే పని చేస్తున్నారు. దొరబాబు జమ్మూ–కాశ్మీర్‌లోని 1ఆర్ఆర్ బెటాలియన్‌లో పని చేస్తున్నారు. 200 మంది జవాన్లు సెర్చ్టీంగా కోజ్‌పూర్ గ్రామంలో సెర్చ్ చేస్తున్నారు. రెండిళ్లు సెర్చ్ చేసిన అనంతరం హఠాత్తుగా ఓ ఇంటి నుంచి కాల్పులు ప్రారంభమవ్వగా సైనికులు తేరుకునే లోపే దొరబాబు కాలికి గాయమయ్యింది. అయినా వెనుకడుగు వేయక శత్రువు గమ్యాన్ని నిశితంగా పరిశీలించారు. కిటికీ నుంచి ఇద్దరు ముష్కరులు కనిపిస్తుండడంతో ఏకే–47తో దొరబాబు ముందుకు ఉరికి కాల్పులు జరిపారు. 30 రౌండ్ల మేగజైన్లోని 27 రౌండ్లు శత్రువులో దిగిపోయాయి. దీంతో పాకిస్తా టెర్రరిస్టు సాభిర్ అహ్‌మాలిక్ అక్కడికక్కడే మరణించారు. మరో ఉగ్రవాదికి కూడా దొరబాబు కాల్చిన బులెట్లతో పాటు పక్కనే ఉన్న సైనికులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. సర్వత్రా హర్షం.. దేశ రక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయక శత్రువులను దొరబాబు ఉద్దానం ఖ్యాతిని మరింత పెంచారని ఉద్దానంవాసులు పేర్కొంటున్నారు. తమ కుమారులిద్దరూ సైన్యంలో పని చేయడం గర్వంగా ఉందని, దొరబాబు ముష్కరులను హతమార్చి మాతృభూమి రక్షణలో కీలకపాత్ర పోషించడంపై తల్లిదండ్రులు కామమ్మ, భైరాగి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఎన్కౌంటర్లో స్వల్పంగా గాయపడ్డానని సైనికుడు దొరబాబు ‘సాక్షి’కి ఫోన్ ద్వారా వివరించారు. కాలిలో బులెట్ తగిలి స్వల్ప గాయమైందని, ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పారు. -
ఆశల దీపం ఆరిపోయింది
సాక్షి, మందస: ఆశల దీపం ఆరిపోయింది. ఇన్నాళ్లు ఆ ఇంట్లో గళగళమన్న కాళ్ల పట్టీల సవ్వడి ఆగిపోయింది. అందరినీ ఎంతగానో నవ్వించిన ఆ నవ్వు మాయమైంది. ఆ చిన్నారిపై క్యాన్సర్ మహమ్మారి పగబట్టి తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. దాతల సాయంతోనైన బతికించుకుందామనుకున్న ఆ తల్లిదండ్రుల ప్రయత్నాలను నీరుగార్చింది. తన గారాల పట్టి భవిష్యత్‌పై ఎన్నో కలలు కన్న వారికి గుండె కోత మిగిల్చింది. మందస మండలం లొహరిబంద గ్రామానికి చెందిన చిన్నారి నవ్య(9) అలియాస్ ప్రేమకుమారి బుధవారం అర్ధరాత్రి బోన్‌మారో కేన్సర్‌తో మరణించింది. రెయ్యి రాజు, లక్ష్మీకాంతం దంపతులు తమ కుమార్తె మృతితో గుండెలవిసేలా రోదించారు. పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో దాతలు సాయంతో ఏడాదిపాటు బతికించారు. ఈ నేపథ్యంలో పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రూ.5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. ఏ కష్టమొచ్చిన తామంతా ఆదుకోవడానికి ముందుంటామని ఉద్దానవాసులు నవ్య సమస్యను సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగతంగా, పత్రికల ద్వారా బాహ్య ప్రపంచానికి చెప్పి, ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. నవ్యకు సోకిన వ్యాధి చికిత్సకు అవసరమయ్యే వ్యయం సేకరించడానికి ఉద్దానం యువత సిద్ధమవుతుండగా, హఠాత్తుగా నవ్య మరణించడంతో చిన్నారిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిఒక్కరూ కన్నీటి పర్యవంతమవుతున్నారు. ఇక ఆమె తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూకావడం కాలేదు. అందరి ఆశలు అడియాశలు చేసిన నవ్య అంత్యక్రియలు ప్రజల కన్నీటి సంద్రం మధ్య జరిగాయి. -
ఆస్తి కోసం కొట్టుకున్న అన్నదమ్ములు
సాక్షి, మందస(శ్రీకాకుళం) : మండలంలోని పితాతొళి పంచాయతీ పుచ్చపాడులో శుక్రవారం అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా చోటు చేసుకుంది. వీరిలో అన్నయ్య శిస్టు శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. మందస పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అన్నదమ్ములు శిస్టు శ్రీనివాసరావు, తాతారావుల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి. తాతారావు పొలం దున్నుకుని వస్తున్నాడు. ఇప్పటికే వివాదాలున్న పొలం ఎందుకు దున్నావని అన్నయ్య ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైంది. వాగ్వాదం మరింత పెరిగి, తాతారావుతోపాటు కుటుంబ సభ్యులైన హేమసుందర్, బాలనాగమ్మ, నాగేశ్వరరావు వెదురు కర్రలతో శ్రీనివాసరావుపై దాడి చేశారు. ఈ దాడిలో ఈయన తీవ్రంగా గాయపడగా, ఈయన భార్యకు కూడా దెబ్బలు తగలడంతో స్పృహ కోల్పోయింది. మందస 108 అంబులెన్స్ ఈఎంటీ డీ తారకేశ్వరరావు, పైలట్ వీ మురళీమోహన్ బాధితులను పలాస ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం కిమ్స్‌లో చేర్పించారు. ఎస్ఐ చిట్టిపోలు ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏం కష్టమొచ్చిందో ఏమో ?
సాక్షి, మందస(శ్రీకాకుళం) : కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు.. విదేశానికి వెళ్లి మరీ కష్టపడుతున్నాడు.కూలీనాలీ చేసుకునే ఆ కుటుంబానికి పెద్ద దిక్కై నిలిచాడు. నమ్ముకున్నవారిని అనాథను చేసి వెళ్లిపోయాడు. ఇక ఆ కుటుంబానికి దిక్కు లేకపోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు హృదయ విదారకరంగా మారింది. మందస పట్టణంలోని ఆర్టిజన్ కాంప్లెక్స్‌లో నివాసముంటున్న కోటిలింగాల భీముడు, జయంతిల కుమారుడు రమేష్ (24) ఉన్నారు. కుమార్తె సంతోషికి వివాహమైంది. కుమారుడే కుటుంబానికి ఆధారంగా మారాడు. భీముడు, జయంతిలు పేదవారు కావడంతో కూలీ చేసుకుని జీవిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేక వారిని పోషించడానికి రమేష్ ముందుకు వచ్చాడు. విదేశానికి(కువైట్) వెళ్లాలని నిర్ణయించుకుని పాస్‌పోర్టు, వీసా సంపాదించి వెళ్లాడు. కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ 10 రోజుల సెలవుపై మందస వచ్చాడు. ఈ నెల 10న మళ్లీ కువైట్ వెళ్లిపోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. తల్లిదండ్రులు కుమారుడి ఇష్టమైన పిండివంటలు, వస్తువులు సిద్ధం చేస్తూనే... ఒక్కగానొక్క కుమారుడైన రమేష్‌ను విదేశాలకు వెళ్లవద్దని, తమకు దూరంగా ఉండడం ఇష్టంలేదని చెప్పారు. అయినప్పటికీ రమేష్ కుటుంబ కష్టాలు దృష్ట్యా కువైట్ వెళ్తానని భీష్మించుకున్నాడు. సోమవారం ఉదయం సినిమాకు కాశీబుగ్గ వెళ్తానని చెప్పిన రమేశ్ మంగళవారం వరకు తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడిన కుటుంబ సభ్యులు, స్నేహితులు రమేష్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ చేసినట్టు సమాచారం వచ్చింది. మంగళవారం ఉదయం నుంచి హరిపురం సమీపంలో యువకుడి ఆత్మహత్య అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ కావడంతో వాటిని గుర్తించిన రమేష్ స్నేహితులు ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపారు. బాలిగాం–రైల్వేస్టేషన్ మధ్య మృతదేహం గుర్తింపు మండలంలోని హరిపురం సమీపంలోని బాలిగాం–రైల్వేస్టేషన్ మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాస ప్రభుత్వ ఆస్పపత్రిలో పోస్టుమార్టం అనంతరం మందస పట్టణానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. మరుసటి రోజున విదేశాలకు వెళ్లాల్సిన కుమారుడు అందని తీరాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. -
సైకిల్‌ను తప్పించబోయి..
సాక్షి, శ్రీకాకుళం : మండలంలోని సందూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గిరిజన యువకుడు మరణించిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..మండలంలోని కొండలోగాం పంచాయతీ, బంసుగాం గ్రామానికి చెందిన సవర రాజేష్(24) అదే గ్రామానికి చెందిన తన స్నేహితులు రామారావు, చిన్నలతో కలిసి పలాస మండలంలోని గొప్పిలి గ్రామానికి వెళ్లి ఆదివారం రాత్రి తిరిగి వస్తున్నారు. వీరు మందస మండలంలోని సందూరు వద్దకు చేరుకోగా ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి బైక్ అదుపు తప్పడంతో రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో రాజేష్‌కు తీవ్ర గాయాలవ్వగా, మిగతా ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురునీ పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేష్ మరణించాడు. దీంతో ఒక్కగానొక్క కుమారుడు మరణిండంతో రాజేష్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని బంసుగాం తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మందస ఎస్ఐ చిట్టిపోలు ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గమ్యం చేరకుండానే..
సాక్షి, మందస(శ్రీకాకుళం) : ఖరీఫ్ విత్తనాలు అందించే సమయం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో మంగళవారం సాయంత్రం 7.30 గంటల వరకూ విధులు నిర్వహించి, బుధవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి, తిరిగి పలాసలోని కార్యాలయానికి రావాలన్న ఆత్రుత ఆ అధికారిని అనంత లోకాలకు తీసుకెళ్లింది. ఆగి ఉన్న లారీని పలాస వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టరు చల్లా దశరథుడు(52) కారు ఢీకొనడంతో మృతి చెందారు. కంచిలిలో నివాసముంటున్న ఈయన తానే డ్రైవింగ్ చేసుకుంటూ కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో మందస మండలం బిన్నళమదనపురం సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న (ఏపీ 26 టీఎఫ్ 6461) లారీని తెల్లవారుజామున 5.15 గంటలకు ప్రమాదవశాత్తూ వెనుక నుంచి బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆయన గుండెకు, తలకు బలమైన గాయాలయ్యాయి. అక్కడే కొంతమంది కారులో నుంచి బయటకు తీసి, మందస 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే మాట్లాడిన ఏడీ కొద్దిసేపటికే స్పృహతప్పి, కోమాలోకి వెళ్లిపోయారు. ఈ తరుణంలో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 వాహనంలో పలాస ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాద స్థలాన్ని మందస ఎస్ఐ వానపల్లి నాగరాజు, కానిస్టేబుల్ రామ్మోహన్ పరిశీలించారు. మృతుని భార్య లక్ష్మీకనకవల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దశరథుడుకి భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. మరికొద్ది సమయంలో ఇంటికి చేరుకుంటారని భావించిన కుటుంబ సభ్యులకు పిడుగులాంటి వార్త చేరడంతో గుండెలవిసేలా రోదించారు. ఏడీ మరణంతో మందస, పలాస వ్యవసాయ కార్యాలయ అధికారులు, సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిగా, అందరితో స్నేహంగా మెలిగారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చెల్లెలు గృహప్రవేశానికి వెళ్తూ అన్న మృతి
సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): మందస మండలం కొర్రాయి గేటు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లుడు మృతిచెందారు. మామ తీవ్రంగా గాయపడ్డారు. మందస పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలంలోని పెద్దమురహరిపురం, అమలపాడు గ్రామాలకు చెందిన గొరకల మాధవరావు, కర్ని అప్పన్న లియాస్ తుంభనాథం(38) మామాఅల్లుళ్లు. హరిపురం సమీపంలోని శాసనంలో అప్పన్న చెల్లలు నిర్మించిన గృహ ప్రవేశానికి ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. శనివారం భార్య, పిల్లలు వెళ్లారు. మామఅల్లుళ్లు కలిసి స్కూటీపై పలాస నుంచి హరిపురం వస్తున్నారు. మఖరజోలకు సమీపంలో అదే దారిలో వెనుక నుంచి వస్తున్న కంటెయినర్ (లారీ) స్కూటీని బలంగా ఢీకొంది. స్కూటీ ఎగిరిపడింది. అప్పన్న, మాధవరావులు రోడ్డుపై పడిపోయారు. క్షతగాత్రులను 108లో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మర్గమధ్యంలో కర్ని అప్పన్న మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మృతుని మామ గొరకల మాధవరావు చికిత్స పొందుతున్నారు. అప్పన్న మృతదేహానికి పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు, కేసు నమోదు చేసి మృతదేహాన్ని భార్య, కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిని తండ్రి రామస్వామి చనిపోయారు. తల్లి వరాలమ్మ, భార్య నిర్మల, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలిద్దరిదీ చిన్న వయస్సు కావడంతో తల్లి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతుని కుటంబ సభ్యులను వైఎస్సార్సీపీ నాయకులు దున్న వీరస్వామి, బాలరాజు తదితరులు పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఆదుకునేందుకు ఎమ్మెల్యే డాక్టర్ సీదరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్తామన్నారు. సంఘటన స్థలాన్ని మందస ఎస్ఐ వి.నాగరాజు, హైవే పోలీసులు సందర్శించారు. ప్రమాదానికి కారణమైన లారీతోపాటు డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగరాజు చెప్పారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా
మందస మండలంలో దీక్షకు దిగిన గిరిజన యువతి నిందితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మందస : నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై ఓ గిరిజన యువతి న్యాయ పోరాటానికి దిగింది. ప్రేమ పేరుతో దారుణంగా మోసగించిన ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పాలని అతడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... మందస మండలంలోని పట్టులోగాం గ్రామానికి చెందిన సవర హరిశంకర్ కవిటి మండలం బొ రివంక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. అదే మండలం కుల్లోగాం కాలనీకి చెందిన సవర భూలక్ష్మి పలాసలో చదువుతోంది. తొమ్మిది నెలల కిందట వీరిద్దిరికీ పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగారు. ఈ క్రమంలో శారీరకంగా కూడా దగ్గర కావడంతో భూలక్ష్మి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని హరిశంకర్‌కు చెప్పి తనను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. అప్పటి నుంచి ప్రియుడు ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. దీంతో విషయం యువతి అన్నయ్య శంకర్, ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు కూడా పట్టులోగాం వెళ్లి ప్రియుడి కుటుంబ సభ్యులను కలిశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మార్చి 12న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హరిశంకర్‌ను ఎస్ఐ వి.రవివర్మ హరిశంకర్‌ను పిలిపించి నిలదీయగా... పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని అంగీకార పత్రం రాసి ఇచ్చారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. దీంతో బాధితులు పలాస డీఎ స్పీని ఆశ్రయించారు. అయినా హరిశంకర్ గడువులు కోరుతూ విషయం దాటవేయడంతో బాధితురాలు మహిళా సంఘాలతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా ఉన్న భూలక్ష్మికి న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ ఏడాది మార్చి 27న హరిశంకర్ ఎవరికీ తెలీకుండా కళావతి అనే యువతిని కంచిలి లోని జగన్నాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నా రు. ఆ తర్వాత ఈ నెల 7న రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఈ విషయం భూలక్ష్మి కి ఆలస్యంగా తెలియడంతో శుక్రవారం ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు... న్యాయ పోరాటానికి దిగిన సవర భూలక్ష్మికి సీపీఐఎంఎల్ లిబరేషన్, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం, నవోదయ మహిళా సంఘంతో పలు మహిళా సంఘాలు మద్దతు నిచ్చాయి. బాధితురాలికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. న్యాయం కోసం ప్రియుడి వద్దకు రాగా బాధితురాలితో పాటు ఆమెతో వచ్చిన మహిళా సంఘాల సభ్యులపై హరిశంకర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ దాడిని పలు సంఘాల ప్రతినిధులు ఖండించారు. కేసు నమోదు... హరిశంకర్ ఆచూకీపై మందస ఎస్ఐ రవివర్మ అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాధితురాలికి న్యా యం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి.. జగన్‌ను సీఎం చెయ్యండి
కార్యకర్తలకు ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు పిలుపు మందస,న్యూస్‌లైన్: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ైవైఎస్సార్సీిపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు పిలుపునిచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా జగన్మోహన్రెడ్డిని సీఎం చేసి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఆదివారం సాయింత్రం హరిపురంలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదటి సారిగా 2004 ఎన్నికల్లో మత్య్సకార కోటాలో అప్పటి సోంపేట అసెంబ్లీ స్థానానికి టెకెట్ ఇచ్చార న్నారు. అయితే అప్పట్లో ఓటమి పొందినప్పటికి మరల ఆయన 2009లో పలాస నియోజకవర్గానికి టికెట్ ఇచ్చారన్నారు. దివింగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో టీడీపీ అభ్యర్ధి గౌతు శ్యామసుందర శివాజీపై అఖండ మెజారిటీతో గెలిచానన్నారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. మహానేత ఆశయాలను కొనసాగించడానికి, ఆయన ప్రవేశపెట్టిన పధకాలను పూర్తిస్థాయిలో అందించేందుకు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందిరిపైనా ఉందన్నారు. ఆ పార్టీలోకి కాస్త ఆలస్యంగా చేరడంతో నాకు టికెట్ రాలేదని, అయితే మడమ తిప్పని, మాట తప్పని నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డితో ఉంటే మనకు మంచి రోజలు వస్తాయన్నారు. అంతేకాకుండ తనకు ఎమ్మెల్సీ ఇస్తామని వైఎస్ జగన్ తన గురువుగారైన ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారని ఆయన అన్నారు. తన గురువుగారైన ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీిపీ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. రాజశేఖర్‌రెడ్డిపై ఎంత అభిమానం ఉందో అంతే అభిమానం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఉందన్నారు. కార్యకర్తలంతా కలసి మెలసి వైఎస్ఆర్ సీపీ పలాస నియోజకవర్గ అభ్యర్ధి వజ్జ బాబూరావు గెలుపుకు కృషి చేసి వైఎస్ జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా అంతా పని చేయాలని కార్యకర్తలను కోరారు. మన ప్రధాన లక్ష్యం తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించడమేనని అన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటను ఎప్పటికీ జవదాటమని అన్నారు. ఎమ్మెల్యే జగన్నాయకులు ప్రకటనతో కార్యకర్తల్లో నూతనోత్సాహం పొంగి పొర్లింది. జై జగన్...జై జై జగన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెట్ట కుమారస్వామి, ఏఎమ్‌సీ చైర్మన్ పాలిన శ్రీనివాసరావు, వజ్రపుకొత్తూరు పీఏసిఎస్ అధ్యక్షుడు దువ్వాడ మదుకేశ్వరరావు, డొక్కరి దానయ్య,మరడ భాస్కరరావు, బోర క్రష్ణారావు, దుంపల లింగరాజు, జెడ్పీటిసి అభ్యర్ధి దొరబాబు, దుంపల లింగరాజు, కర్రి గోపాలక్రిష్ణ, బమ్మిడి ధర్మారావు, వాయిలపల్లి ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.