సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): మందస మండలం కొర్రాయి గేటు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లుడు మృతిచెందారు. మామ తీవ్రంగా గాయపడ్డారు. మందస పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలంలోని పెద్దమురహరిపురం, అమలపాడు గ్రామాలకు చెందిన గొరకల మాధవరావు, కర్ని అప్పన్న లియాస్ తుంభనాథం(38) మామాఅల్లుళ్లు. హరిపురం సమీపంలోని శాసనంలో అప్పన్న చెల్లలు నిర్మించిన గృహ ప్రవేశానికి ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. శనివారం భార్య, పిల్లలు వెళ్లారు. మామఅల్లుళ్లు కలిసి స్కూటీపై పలాస నుంచి హరిపురం వస్తున్నారు.
మఖరజోలకు సమీపంలో అదే దారిలో వెనుక నుంచి వస్తున్న కంటెయినర్ (లారీ) స్కూటీని బలంగా ఢీకొంది. స్కూటీ ఎగిరిపడింది. అప్పన్న, మాధవరావులు రోడ్డుపై పడిపోయారు. క్షతగాత్రులను 108లో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మర్గమధ్యంలో కర్ని అప్పన్న మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మృతుని మామ గొరకల మాధవరావు చికిత్స పొందుతున్నారు. అప్పన్న మృతదేహానికి పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు, కేసు నమోదు చేసి మృతదేహాన్ని భార్య, కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిని తండ్రి రామస్వామి చనిపోయారు.
తల్లి వరాలమ్మ, భార్య నిర్మల, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలిద్దరిదీ చిన్న వయస్సు కావడంతో తల్లి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతుని కుటంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ నాయకులు దున్న వీరస్వామి, బాలరాజు తదితరులు పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఆదుకునేందుకు ఎమ్మెల్యే డాక్టర్ సీదరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్తామన్నారు. సంఘటన స్థలాన్ని మందస ఎస్‌ఐ వి.నాగరాజు, హైవే పోలీసులు సందర్శించారు. ప్రమాదానికి కారణమైన లారీతోపాటు డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాగరాజు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment