సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు,సమావేశానికి హాజరైన ముఖ్య కార్యకర్తలు
కార్యకర్తలకు ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు పిలుపు
మందస,న్యూస్‌లైన్: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ైవైఎస్సార్‌సీిపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు పిలుపునిచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఆదివారం సాయింత్రం హరిపురంలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదటి సారిగా 2004 ఎన్నికల్లో మత్య్సకార కోటాలో అప్పటి సోంపేట అసెంబ్లీ స్థానానికి టెకెట్ ఇచ్చార న్నారు. అయితే అప్పట్లో ఓటమి పొందినప్పటికి మరల ఆయన 2009లో పలాస నియోజకవర్గానికి టికెట్ ఇచ్చారన్నారు. దివింగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో టీడీపీ అభ్యర్ధి గౌతు శ్యామసుందర శివాజీపై అఖండ మెజారిటీతో గెలిచానన్నారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు.
మహానేత ఆశయాలను కొనసాగించడానికి, ఆయన ప్రవేశపెట్టిన పధకాలను పూర్తిస్థాయిలో అందించేందుకు ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందిరిపైనా ఉందన్నారు. ఆ పార్టీలోకి కాస్త ఆలస్యంగా చేరడంతో నాకు టికెట్ రాలేదని, అయితే మడమ తిప్పని, మాట తప్పని నాయకుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డితో ఉంటే మనకు మంచి రోజలు వస్తాయన్నారు.
అంతేకాకుండ తనకు ఎమ్మెల్సీ ఇస్తామని వైఎస్ జగన్ తన గురువుగారైన ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారని ఆయన అన్నారు. తన గురువుగారైన ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీిపీ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. రాజశేఖర్‌రెడ్డిపై ఎంత అభిమానం ఉందో అంతే అభిమానం ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డిపై ఉందన్నారు.
కార్యకర్తలంతా కలసి మెలసి వైఎస్‌ఆర్ సీపీ పలాస నియోజకవర్గ అభ్యర్ధి వజ్జ బాబూరావు గెలుపుకు కృషి చేసి వైఎస్ జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా అంతా పని చేయాలని కార్యకర్తలను కోరారు. మన ప్రధాన లక్ష్యం తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించడమేనని అన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటను ఎప్పటికీ జవదాటమని అన్నారు.
ఎమ్మెల్యే జగన్నాయకులు ప్రకటనతో కార్యకర్తల్లో నూతనోత్సాహం పొంగి పొర్లింది. జై జగన్...జై జై జగన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెట్ట కుమారస్వామి, ఏఎమ్‌సీ చైర్మన్ పాలిన శ్రీనివాసరావు, వజ్రపుకొత్తూరు పీఏసిఎస్ అధ్యక్షుడు దువ్వాడ మదుకేశ్వరరావు, డొక్కరి దానయ్య,మరడ భాస్కరరావు, బోర క్రష్ణారావు, దుంపల లింగరాజు, జెడ్‌పీటిసి అభ్యర్ధి దొరబాబు, దుంపల లింగరాజు, కర్రి గోపాలక్రిష్ణ, బమ్మిడి ధర్మారావు, వాయిలపల్లి ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.