ఓడితే నా వృత్తి ఉందిగా
గెలిస్తే ప్రజాసేవ, ఓడితే నటనే నా వృత్తి అంటున్నారు నటి రమ్య. తమిళంలో కుత్తు, వారణం ఆయిరం, పొల్లాదవన్ తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటిచిన ఈ కన్నడ భామ మాతృభాషలో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందారు. నటిగా మంచి ఫామ్లో ఉండగానే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపున కర్ణాటకలోని పాండియ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అదే పాండియ స్థానం నుంచి బరిలోకి దిగారు.
అయితే ఈసారి పరాజయం తప్పదనే సమాచారం వెలువడటంతో షాక్కు గురైన రమ్య తన ట్విట్టర్లో కింది విధంగా స్పందించారు. జీవితంలో జయాపజయాలు ఒక భాగంగా పేర్కొన్నారు. తనకు పార్లమెంటు సభ్యురాలిగా పని చేసే అవకాశం ఒకసారి కలిగిందన్నారు. దీంతో అవిరామంగా ప్రజలకు సేవలందించానని తెలిపారు. పాండియ ప్రాంతం తన కుటుంబంలాంటిదన్నారు. ఎన్నికల ఫలితాల గురించి ఎలాంటి చింతా లేదని చెప్పారు. గెలిస్తే ప్రజాసేవలో నిమగ్నమవుతానని లేదంటే తనకు నటన వృత్తి ఉండనే ఉంది అన్నారు. ఎల్లప్పుడూ ప్రేమానందాలతో జీవించాలని నటి రమ్య పేర్కొన్నారు.