mangala sutram
-
కర్ణాటక కీలక నిర్ణయం: పరీక్షల్లో తలను కవర్ చేయడం నిషేధం..కానీ..!
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. నియామక పరీక్షల సమయంలో తలపై ధరించే అన్ని రకాల దుస్తులను నిషేధించింది. దీనికి సంబంధించి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ బోర్డు (KEA) కీలక అదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళన నేపథ్యంలో మంగళసూత్రాలు (వివాహిత హిందూ మహిళలు ధరించే నల్ల పూసల నెక్లెస్‌లు) మెట్టెలకు అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నియామక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. బ్లూటూత్ డివైసెస్ ద్వారా అభ్యర్థుల మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం విధిస్తున్నట్టు కేఈఏ ప్రకటించింది. తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా టోపీ ధరించినవారికి పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదని కేఈఏ స్పష్టం చేసింది. అలాగే పరీక్ష హాల్ లోపల ఫోన్లు ,బ్లూటూత్ ఇయర్ఫోన్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి ఉండదు. దీంతోపాటు మెటల్ ఆభరణాలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అయితే వివాహతులైన హిందూ మహిళలు, మంగళ సూత్రాలు, నల్ల పూసలు,మెట్టెలు ధరించవచ్చని ప్రకటించింది. డ్రెస్ కోడ్ నిషేధిత వస్తువుల జాబితాలో హిజాబ్‌ను స్పష్టంగా పేర్కొననప్పటికీ తాజా ఆదేశాలు వివాదాస్పదంగా మారనున్నాయి. ఇది ఇలా ఉంటే అక్టోబర్‌లో జరిగిన రిక్రూట్మెంట్ పరీక్షల సందర్భంగా కేఈఏ హిజాబ్‌లను అనుమతించిన సంగతి గమనార్హం. అయితే బ్లూటూత్ పరికరాల వినియోగంపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. 2023 అక్టోబర్‌లో KEA నిర్వహించిన పరీక్షల్లో కల్బుర్గి, యాద్గిర్ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు బ్లూటూత్ ఉపయోగించారన్న ఆరోపణలపై ప్రభుత్వం నవంబర్ 11న CID విచారణకు ఆదేశించింది. అంతకుముందు 2022లో, రాష్ట్రంలోని తరగతి గదుల్లో హిజాబ్‌ను నిషేధించడంపెద్ద దుమారాన్ని రేపింది. అయితే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఈ ఉత్తర్వును 10, 12వ తరగతి వంటి ఇతర బోర్డు పరీక్షలతో పాటు KEA నిర్వహించే సాధారణ ప్రవేశ పరీక్షలకు కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. -
మాంగల్య బలం గట్టిదే.. హుండీలోకి చేరబోయేది!
సాక్షి, బెంగళూరు: కొద్దిగా ఆలస్యమై ఉంటే ధర్మస్థల మంజునాథస్వామి హుండీలోకి చేరబోయే మాంగల్యం చైన్ నాటకీయ మలుపుల తరువాత మళ్లీ సొంతదారుకు వశమైంది. వివరాలు.. చిక్కమంగళూరులో ఈ నెల 6వ తేదీన ఉపాధ్యాయురాలు హేమలత, భర్త యోగేశ్ తో కలిసి క్రీడామైదానంలో వాకింగ్ చేస్తుండగా తాళిబొట్టు చైన్ జారిపడిపోయింది. 11 గ్రాముల బరువున్న ఆ చైన్ వినోద్, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులకు దొరికింది. మాకు ఎవరిదో చైన్ దొరికింది, సొంతదారు సంప్రదించాలని ఆ యువకులు మైదానం చుట్టుపక్కల బోర్డులు పెట్టినా మూడునాలుగు రోజుల వరకూ స్పందన రాలేదు. దీంతో వారు చైన్‌ను ధర్మస్థల స్వామి హుండీలో వేయాలని బయల్దేరారు. మాంగల్యం చైన్‌ను దంపతులకు అప్పగిస్తున్న వినోద్, రాఘవేంద్ర ధర్మస్థలకు వెళ్లాక ఫోన్.. కాగా, దంపతులు వాకింగ్‌కు వెళ్లగా అక్కడ అమర్చిన ఫోన్ నంబర్లను గమనించి యువకులకు ఫోన్ చేశారు. ధర్మస్థల వెళ్లామని, తిరిగి వస్తామని బదులిచ్చారు. చివరికి ఊరికి చేరి దంపతులకు చైన్ అందివ్వగా, భర్త యోగేష్ భార్య మెడలో అలంకరించాడు. చైన్ పోవడంతో ఎంతో బాధపడ్డానని, తిరిగి దొరకడం ఎంతో ఆనందంగా ఉందని హేమలత చెప్పారు. -
మంగళసూత్రానికే ‘పరీక్ష’
ఇందూరు: గ్రూప్–2 పరీక్షకు హాజరైన ఓ మహిళను మంగళసూత్రం తీసేసి పరీక్షకు హాజరుకావాలని ఆదేశించడంతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని సిద్దార్థ మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం గ్రూప్–2 పరీక్షకు హాజరైన ఓ మహిళా అభ్యర్థిని మంగళసూత్రం తీసివేయాలని ఇన్విజిలేటర్ ఆదేశించారు. దానికి సదరు మహిళ ససేమిరా అనడంతో 10 నిమిషాలు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తాళి కంటే పరీక్ష గొప్పేం కాదంటూ వెనుదిరిగింది. విషయం బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్తపడినట్లు సమాచారం. జిల్లాలోని పలు కేంద్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని మరో పరీక్ష కేంద్రం లో కొత్తగా పెళ్లైన ఓ మహిళా అభ్యర్థిని పసుపుతాడు తీయాలని ఇన్విజిలేటర్ ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. మహిళా అభ్యర్థులు మంగళసూత్రాలు తీయాలనే నిబంధనలు లేవని ఉన్నతాధికారులు చెబుతున్నా ఇలాంటి సంఘటనలు జరగడం గమనార్హం.